- 48 గంటల పరుగు… లక్ష్యం ఏపీ
- లోకేష్ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మంత్రం
- ఢిల్లీనుంచి అహ్మదాబాద్ వరకూ… పెట్టుబడుల వేట
- ఈజ్ నుంచి స్పీడ్‌కు మారిన పాలనా సంస్కృతి
- ఒక్కో సమావేశం వెనుక ఒక్కో రంగం, ఒక్కో కల
- ఫార్మానుంచి డేటా సెంటర్ల వరకూ అన్నీ ఏపీవైపే
- యువతకు ఉద్యోగాలే అంతిమ లక్ష్యంగా పర్యటన
రాత్రి పదకొండు గంటలు దాటినా ఫోన్లో ఫైళ్లు తిరగేస్తున్న మంత్రి. తెల్లవారుజామునే విమానం ఎక్కి మరో నగరం చేరిన మంత్రి. ఒక సమావేశం ముగియకముందే మరో సమావేశానికి సిద్ధమవుతున్న మంత్రి. ఇదేమీ సినిమా సీన్ కాదు… ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ నిత్యజీవితంలో రెండు రోజుల టూర్ చిత్రం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు రాష్ట్ర పాలనా సంస్కృతిని మార్చామని అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చిన యువ మంత్రి, ఆ మాటల వెనుక నిబద్ధతను నిరూపించేలా సాగించిన ఢిల్లీ, అహ్మదాబాద్ పర్యటనల రియల్ సీన్. రెండు రోజులు. రెండు నగరాలు. ప్రతి నిమిషాన్నీ వెచ్చించిన తీరు చూస్తే, ఇది కేవలం పర్యటనగా కాకుండా, రాష్ట్ర భవిష్యత్తుకు యువ సైన్యాధినేత సాగించే యుద్ధతంత్రంలా అనిపించకపోదు.
సమయమే సంపదన్నట్టు… దేశ రాజధాని ఢిల్లీలో ఒక రోజు, పారిశ్రామిక రాజధాని అహ్మదాబాద్‌లో మరో రోజు. ప్రతి నిమిషాన్నీ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారో అర్థమవుతుంది.
వీటికి తోడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ, ఒక రౌండ్ టేబుల్ సమావేశం, ఒక రోడ్ షో, ఒక కీలక సదస్సులో పార్టిసిపేషన్ -ఇలా ప్రతి కార్యక్రమం వెనుక నిర్దుష్ట లక్ష్యముంది. సాధారణంగా రాజకీయ నాయకుల పర్యటనలంటే లాంఛనప్రాయ భేటీలు, ఫోటో సెషన్లు అనుకుంటాం. కానీ లోకేష్ పర్యటన అందుకు పూర్తి భిన్నం. ప్రతి భేటీ వెనుక ఒక రంగం ఉంది. ప్రతి చర్చ వెనుక పెట్టుబడి ప్రతిపాదన ఉంది. ప్రతి ఆహ్వానం వెనుక ఏపీలో కొత్త పరిశ్రమ, కొత్త నైపుణ్యం, కొత్త ఉపాధి కల్పించాలన్న తపన కనిపిస్తుంది.
ఢిల్లీలో టెక్ దిగ్గజాలతో డీల్స్ దిశగా అడుగులు
పర్యటనలో మొదటి అంకం దేశ రాజధాని ఢిల్లీ సుంచే మొదలైంది. ఇక్కడ వివో, సిస్కో, అబాట్, మాస్టర్‌కార్డ్, ఎసఏపీ, గోద్రేజ్, యారావంటి అంతర్జాతీయ, జాతీయస్థాయి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ చర్చలు జరిపారు. తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం ఏర్పాటు నుంచి విశాఖపట్నంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) విస్తరణ వరకు, నక్కపల్లిలో మెడికల్ డివైసెస్, జెనరిక్ మందుల తయారీ నుంచి కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంటు ఏర్పాటు వరకు -ఒక్కో కంపెనీతో ఒక్కో నిర్దుష్ట ప్రతిపాదనపై మంత్రి చర్చించారు. ఇదేదో సాధారణ మర్యాదపూర్వక సమావేశాల మాదిరిగా కాకుండా, ఏ కంపెనీకి ఏ రంగంలో బలముందో, ఏపీలో ఏ ప్రాంతం ఆ కంపెనీకి సరిగ్గా సరిపోతుందో ముందుగానే అధ్యయనం చేసి వెళ్లిన తీరుకు నిదర్శనం.
అహ్మదాబాద్‌లో పరిశ్రమల పరంపర
ఢిల్లీ పర్వం ముగియగానే మంత్రి బృందం అహ్మదాబాద్ బాట పట్టింది. గుజరాత్ నేల పారిశ్రామిక సంస్కృతికి పెట్టింది పేరు. అక్కడ టోరెంట్, వెల్స్పన్, గోకుల్ ఆగ్రో, చిరిపాల్, ఎస్ఈ టెలిమీడియా, ఈప్యాక్, ఆస్ట్రల్ పైప్స్, ఎంక్యూర్, విశాఖ గ్రూప్వంటి పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి లోకేష్ వరుస భేటీలు సాగించారు. ఫార్మా, పునరుత్పాదక ఇంధనం, స్టీల్, టెక్స్టైల్స్, సోలార్, డేటా సెంటర్లు, పైపులు, బయోసిమిలర్స్, ప్యాకేజింగ్వంటి విభిన్న రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను సవివరంగా వివరించారు. రాష్ట్రానికి తరలిరమ్మంటూ ఆహ్వానించారు. ఇప్పటికే ఏపీలో అడుగుపెట్టివుంటే.. విస్తరణకూ ప్రతిపాదించారు. ఒక్కో సమావేశాన్ని పరిశీలిస్తే, మంత్రి ఎంత హోంవర్క్ చేసి వెళ్లారో అర్థమవుతుంది.
ఫార్మా రంగంపై ప్రత్యేక దృష్టి -రౌండ్ టేబుల్ భేటీ
అహ్మదాబాద్ పర్యటనలో అత్యంత కీలకమైనది ఫార్మా రంగంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం. సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026లో భాగంగా, ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి లోకేష్ కీలక ప్రసంగం చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రజాప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ గురించి వివరిస్తూ, ఫార్మా రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. గణాంకాలతో సహా ఏపీ ఫార్మా సామర్థ్యాన్ని మంత్రి ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. 2030 నాటికి భారత ఫార్మా మార్కెట్ 130 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుందని, ఇందులో ఏపీ భారతదేశంలోనే మూడో అతిపెద్ద ఔషధ ఎగుమతిదారుగా నిలుస్తోందని వివరించారు. ప్రపంచ ఫార్మసీ మార్కెట్ విలువ 60 బిలియన్ డాలర్లుగా ఉంటే, అందులో ప్రపంచ సరఫరాలో భారతదేశ వాటా 20 శాతంగా ఉందని, 2030 నాటికి పేటెంట్ గడువు ముగియనున్న ఔషధాల విలువ ఏకంగా 251| బిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నారు.
1.05 బిలియన్ డాలర్ల విలువతో దేశంలోని టాప్-5 ఫార్మా రాష్ట్రాల్లో ఏపీ నిలిచిందన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం ప్రాంతాల్లో నాలుగు ఫార్మాస్యూటికల్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని, విశాఖపట్నం భారతదేశపు ప్రముఖ మెడికల్ టెక్నాలజీ పార్క్ ఏఎంటీజడ్కు కేంద్రంగా మారుతోందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఆరు ఆపరేషనల్ పోర్టులు, నాలుగు గ్రీన్ఫిల్డ్ పోర్టులు ఉన్నాయని, నక్కపల్లి వద్ద 2,000 ఎకరాల్లో ఏర్పాటవుతున్న బల్క్ డ్రగ్ పార్క్ మొదటి దశ పూర్తయిందని చెప్పారు. విస్తారమైన భూమి, పోర్ట్ కనెక్టివిటీ, తక్కువ నిర్వహణ వ్యయాలు, బలమైన ఫార్మా ఎకోసిస్టమ్ పాటు ప్రభుత్వ మద్దతు, పెట్టుబడి రాయితీలు నక్కపల్లి ఫార్మా పార్క్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయని పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించారు.
క్లీన్ ఎనర్జీ కోసం టోరెంట్తో చర్చలు
టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతా, డైరెక్టర్ షాన్ మెహతా, హోల్మ్ డైరెక్టర్ జిగీష్ మెహతాలతో సమావేశమైన మంత్రి లోకేష్.. ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మాలిక్యూల్స్లోకి టోరెంట్ పవర్ ప్రకటించిన విస్తరణ ప్రణాళికకు అనుగుణంగా, పంప్డ్-స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, ఇతర క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఏపీని ఎంపిక చేసుకోవాలని ప్రతిపాదించారు. సౌర, పవన, హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అవకాశాలనూ పరిశీలించాలన్నారు. బ్యాక్ వర్డ్ ఇంటిగ్రేషన్ కోసం టోరెంట్ వైజాగ్ ప్లాంట్ ఏపీఐలు, అధునాతన ఇంటర్మీడియట్‌లపై దృష్టి సారించిన నేపథ్యంలో, రాష్ట్రంలోని ఫార్మా క్లస్టర్లలో ఏపీఐ తయారీ సామర్థ్యాలను విస్తరించే అవకాశాలను అన్వేషించాలని సూచించారు. వెల్స్పన్ వరల్డ్ (ఇండియా) గ్రూప్ సీఈఓ నితిన్ జైన్‌తో మంత్రి భేటీ అయిన లోకేష్.. విశాఖలో వెల్స్పన్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. కాకినాడలో టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, డీఐ పైపుల తయారీ, పైపు కోటింగ్ యూనిట్, గ్రీన్ అమోనియా తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా వెల్స్పన్ ఇండస్ట్రియల్ పార్ను నెలకొల్పాలని సూచించారు. గత ఏడాది దావోస్ సదస్సులో సీఎం చంద్రబాబుతో జరిపిన చర్చల్లో చేసిన ప్రతిపాదనల పురోగతినీ సమీక్షించారు. గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ కనుభాయ్ జె ఠక్కర్ తో సమావేశమైన లోకేష్.. కంపెనీ ప్రస్తుత నెల్లూరు ప్లాంట్‌కు విస్తరణగా పామాయిల్, సోయాబీన్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ నెలకొల్పాలని ప్రతిపాదించారు.
విశాఖలో టైర్ల తయారీకి చిరిపాల్ గ్రూప్ తో భేటీ
చిరిపాల్ గ్రూప్ మేనేజింగ్ డైరక్టర్ బ్రిజ్ మోహన్ చిరిపాల్, గ్రూప్ అనుబంధ సంస్థ గ్రూ సోలార్ సీఈవో వినయ్ థదానితో సమావేశమైన లోకేష్.. రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, రోడ్లు, విధానపరమైన మద్దతును పరిగణనలోకి తీసుకొని గ్రీన్ ఫీల్డ్ టైర్ల తయారీ ప్రాజెక్టును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాల్సిందిగా ప్రతిపాదించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహానగరం అత్యుత్తమమైన కనెక్టివిటీతోపాటు అన్నివిధాలా అనుకూలతలు కలిగి ఉందని వివరించారు. ఎన్టీ టెలిమీడియా సంస్థ వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ జెనా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లలిత్ టి కన్నాలతో సమావేశమైన సందర్భంలో.. డేటా సెంటర్ హబ్ అభివృద్ధి చెందుతున్న విశాఖలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఇప్పటికే గూగుల్ పనులు ప్రారంభించగా, రిలయన్స్ వంటి సంస్థలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని మంత్రి వివరించారు. ఈప్యాక్ గ్రూప్ చైర్మన్ భజరంగ్ బోత్రాతో సమావేశమైన సందర్భంలో.. డేటా సెంటర్ హబ్‌గా మారుతున్న విశాఖలో ఒక ప్రీ ఫ్యాబ్ నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే, ఆస్ట్రల్ పైప్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అల్కేష్ పంచల్‌తో సమావేశమైన సందర్భంలో.. కాకినాడ లేదా అనకాపల్లిలో పైపుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. వేగవంతమైన అనుమతులతోపాటు ఇతర రాష్ట్రాలకంటే మెరుగైన ప్రోత్సాహకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, బయోసిమిలర్ రంగంలో బలమైన ట్రాక్ రికార్డ్ కలిగిన ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ గ్లోబల్ ప్రెసిడెంట్ దీపక్ గోండాలియాతో సమావేశమైన లోకేష్.. నక్కపల్లి క్లస్టర్లో బయోసిమిలర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ ఏపీఐ, ఫెర్మెంటేషన్ ఆధారిత బల్క్- డ్రగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషించాలని ప్రతిపాదించారు. విశాఖ గ్రూప్ ఎండి జిగీష్ భాష్ దోషితో సమావేశమై.. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న ఏపీలో సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇప్పటికే రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీవంటి సంస్థలు ఏపీకి వచ్చాయని, ఎయిర్ పోర్టు, సీ పోర్టులకు సమీపంలోని నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లిలో ఏదోకచోట ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
రాష్ట్రాధినేతలతోనూ చర్చలు
కేవలం పారిశ్రామిక దిగ్గజాలతోనే కాక, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో తో తీర రాష్ట్రాల అభివృద్ధి, పోర్టులు, లాజిస్టిక్స్, పారిశ్రామికీకరణపై మంత్రి లోకేష్ విస్తృతంగా చర్చించారు. ఐసీసీ చైర్మన్ జై షాతో ఏపీని జాతీయ క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలపై మాట్లాడారు. ఇది కేవలం పారిశ్రామిక పెట్టుబడులకే పరిమితం కాకుండా, రాష్ట్రాన్ని బహుముఖంగా అభివృద్ధి చేయాలన్న మంత్రి దార్శనికతకు నిదర్శనం. సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026 కోసం నిర్వహించిన రోడ్‌లోనూ మంత్రి పాల్గొన్నారు.
కొత్త సంస్కృతిగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్షణం తీరికలేని ఈ పరుగే లోకేష్ ‘స్పీడ్’ ఆఫ్ డూయింగ్ మంత్రానికి నిదర్శనం. వ్యవసాయం నుంచి తయారీ వరకు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను రాష్ట్ర సంస్కృతిగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని పీఏఎఫఐ వేదికగా మంత్రి చేసిన వ్యాఖ్య ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావనార్హం. రాష్ట్రం 23 రంగాల క్లస్టర్ల ద్వారా పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉద్యోగాలపై దృష్టి పెడుతోందని కూడా ఆయన అదే వేదికపై వివరించారు.
అసలు లక్ష్యం-యువతకు ఉద్యోగాలు
ఈ మొత్తం పరుగు పెట్టుబడుల కోసమే కాదు. దీని వెనుక సున్నితమైన మానవీయ కోణం ఉంది. ఒక ఫ్యాక్టరీ వస్తే ఉద్యోగాలు రావాలి. ఒక కంపెనీ వస్తే నైపుణ్యాలు పెరగాలి. ఒక పెట్టుబడి వస్తే స్థానిక యువతకు అవకాశాలు పెరగాలి. ఒక పరిశ్రమ వస్తే ఒక ప్రాంతం ఆర్థికంగా ఎదగాలి. ఇదే మంత్రి లోకేష్ అంతిమ లక్ష్యం. అందుకే ఢిల్లీనుంచి అహ్మదాబాద్ వరకు సాగిన చర్చల్లో టెక్నాలజీతో పాటు ఫార్మా, తయారీ, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్, క్రీడలు వంటి అనేక రంగాలు చోటు చేసుకున్నాయి.
నిద్రలేని నాయకుడి నిబద్ధత రెండు రోజుల్లో రెండు నగరాలు, 21 కార్యక్రమాలు, డజనుకు పైగా దిగ్గజ సంస్థలతో లోతైన చర్చలు –ఇదంతా ఒక మంత్రి షెడ్యూల్ మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు యువ నాయకుడు పడుతున్న శ్రమకు అద్దం పట్టే చిత్రం. ఫలితాలు రేపు కనిపించవచ్చు, ఎల్లుండి అందొచ్చు. కానీ నిరంతర ప్రయత్నం, నిద్రలేని పరుగు మాత్రం అనుక్షణం కనిపిస్తోంది. అదే నారా లోకేష్ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్’.. రాష్ట్రాభివృద్ధి తంత్రం!!














