- మంత్రి రాకతో శ్రీకొలనులో పండుగ వాతావరణం
- రూ.1.31 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ఆత్మకూరు (చైతన్య రథం): రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం ఏఎస్ పేట మండలం శ్రీకొలనులో పర్యటించి రూ.1.31 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, కొత్త పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి రాక సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం చోటుచేసుకుంది. గ్రామ ప్రజలు, మహిళలు, యువత, విద్యార్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మంత్రికి ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులతో స్వాగతం పలకగా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు పూలబాటతో మంత్రిని కార్యక్రమ ప్రాంగణానికి ఆహ్వానించడం విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి రూ.31.50 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. అలాగే రూ.31 లక్షలతో నిర్మించిన ఐదు సీసీ రోడ్లను ప్రజలకు అంకితం చేశారు. రూ.29 లక్షలతో చేపట్టనున్న సాగునీటి చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న శ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. శ్రీకొలను గ్రామంలో సాగునీరు, తాగునీటి సౌకర్యం, రహదారుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి వేగంగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. శ్రీకొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా మైదానం అభివృద్ధితోపాటు మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన హాకీ క్రీడాకారిణి విద్యార్థినులను అభినందిస్తూ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడలు, యోగా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, భారతదేశం ప్రపంచానికి స్ఫూర్తిదాయక దేశంగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామపెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















