- వికసిత్ భారత్‌కు గిరిజన విద్యావ్యవస్థ దోహదమని వ్యాఖ్య
విశాఖపట్నం (చైతన్యరథం): గిరిజన విశ్వవిద్యాలయాలు నాయకత్వం, ఆత్మవిశ్వాసం, విధాన నిర్ణయాల రూపకల్పనలో గిరిజన సమాజాలకు కేంద్రాలుగా మారాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. వారి విద్య, జీవనోపాధి, సమగ్రాభివృద్ధిలో ఈ విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. మంగళవారం విశాఖపట్నంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సీటీయూఏపీ) తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. సామాజిక న్యాయ లక్ష్యంతో ఏర్పాటైన సంస్థలు విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, అటవీ హక్కులవంటి రంగాల్లో క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. గిరిజన, అట్టడుగు వర్గాల యువత సమగ్రాభివృద్ధికి, ప్రాంత మొత్తం పురోగతికి ఈ విశ్వవిద్యాలయం అర్థవంతమైన తోడ్పాటు అందిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు రాష్ట్రపతి ముర్ము తెలిపారు. అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, చిరుధాన్యాలు, ఔషధ మొక్కలు, పర్యావరణ పర్యాటకం, స్థానిక వ్యాపారోత్సాహంవంటి అంశాల్లో విలువ జోడింపును ప్రోత్సహిస్తూ గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు గిరిజన వర్శిటీలు నూతన విధానాలను రూపొందించాలని ముర్ము సూచించారు.
ప్రతి విద్యార్థి జీవితంలో స్నాతకోత్సవం ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణిస్తూ, వేగంగా మారుతున్న ప్రపంచంలో ఔచిత్యం కోల్పోకుండా ఉండేందుకు నైపుణ్యాభివృద్ధిలో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పట్టభద్రులకు ఆమె పిలుపునిచ్చారు. పాఠ్యపుస్తక విజ్ఞానానికే పరిమితం కాకుండా తమ చుట్టూ ఉన్న పర్యావరణ వ్యవస్థనుంచి ఆచరణాత్మక జ్ఞానాన్ని పొందాలని, తమ సమాజాలు, సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధాన్ని కొనసాగించాలని విద్యార్థులకు ఆమె సూచించారు. భారతదేశం తన వారసత్వంలో మూలాలు కలిగి ఉంటూనే, ఆధునిక విజ్ఞానశాస్త్ర ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వర్గానికీ చేరేలా చూడాలని రాష్ట్రపతి సూచించారు. ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన సమాజాలను సాధికారం చేసేందుకు విశ్వవిద్యాలయంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ కృషి చేస్తోందని, గిరిజన సంక్షేమం, ప్రజారోగ్యం, వాతావరణ మార్పు, ఆహార-పోషకాహార భద్రత, ఇంధన పొదుపువంటి రంగాల్లో దాని కార్యక్రమాలను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రయత్నాలు సమానత్వంతో కూడిన అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి దోహదపడతాయని ఆమె అన్నారు.
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ, సమ్మిళిత, ఆచరణాత్మక, పర్యావరణ స్పృహతో కూడిన విద్యా విధానం ద్వారా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గణనీయమైన తోడ్పాటు అందిస్తుందని తాను ఆశిస్తున్నట్టు రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. గిరిజన సమాజాలను ఆధునిక విద్యా ప్రయోజనాలతో అనుసంధానం చేయడం వల్ల స్థానిక యువత దేశ సమతుల్య, సమ్మిళిత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలుగుతారని ఆమె తెలిపారు. అంతకుముందు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్, గిరిజన మహిళా శిశు సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, హోంమంత్రి అనిత, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ మదన్ లాల్ మీనా, వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ టీ.శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.














