- న్యూక్లియర్ వాల్యూ చైన్‌లో ఏపీ భాగస్వామ్యానికి లోకేష్ పిలుపు
- క్లియర్ ఆర్థిక వ్యవస్థలో నమ్మకమైన భాగస్వామిగా నిలుపుతామని హామీ
- క్లియర్ ఎనర్జీ గ్లోబల్ భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు సిద్ధం
- డేటా సెంటర్ల చుట్టూ తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తాం
- యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టూ ఇండియా సదస్సులో మంత్రి లోకేష్
న్యూఢిల్లీ (చైతన్య రథం): “ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం మా ధ్యేయం. ప్రపంచ న్యూక్లియర్ ఎనర్జీ పరిశ్రమ కొత్త దశలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఇది కీలకంగా మారగలదు” అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. న్యూక్లియర్ ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్ (ఎనఈఐ), యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం (యూఎసఐఎస్‌పీఎఫ్) సంయుక్తంగా యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా పేరిట యూఎస్ న్యూక్లియర్ ప్రతినిధులతో ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు మంత్రి నారా లోకేష్ అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ నివేదిత మెహ్రా స్వాగతం పలుకగా, న్యూక్లియర్ ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ మారియా కోర్సినిక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… “స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం రియాక్టర్ సిస్టమ్స్ వంటి ఆధునిక న్యూక్లియర్ సాంకేతికతలు, మాడ్యులర్ తయారీ, సప్లయ్ చైన్ పంపిణీ, స్కేలబుల్ వినియోగ నమూనాలకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ రంగంలో విస్తృతి, ఖర్చు విషయంలో పోటీతత్వం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు పారిశ్రామిక ఇన్‌ఫ్రా, పోర్ట్స్, లాజిస్టిక్స్ కనెక్టివిటీ, అమలు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇది భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు ఒక చారిత్రాత్మక అవకాశాన్ని కల్పిస్తుంది” అని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సహజసిద్ధ ప్రయోజనాలు
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. మాకు సువిశాలమైన తీరప్రాంతం, శక్తివంతమైన పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విస్తృతమైన పారిశ్రామిక కారిడార్లు, ప్రతిష్టాత్మకమైన పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అమలు చేస్తున్నాం. పారిశ్రామికీకరణలో వేగం, అమలు అత్యంత ముఖ్యం. ఇందులో న్యూక్లియర్ ఎకోసిస్టమ్ ప్రముఖ పాత్ర వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పర్యావరణ వ్యవస్థ ఆలోచనా విధానం ముఖ్యం. సాంకేతిక సహకారాలు, తయారీ భాగస్వామ్యాలు, సప్లయ్ చైన్ అభివృద్ధి, ఇంజనీరింగ్ ఎకోసిస్టమ్స్, రీసెర్చ్ భాగస్వామ్యాలు, స్కిల్లింగ్, వర్క్‌ఫోర్స్ అభివృద్ధి, పారిశ్రామిక ప్రమాణాలు, భవిష్యత్ సాంకేతికతల అమలుకు విశ్వసనీయ గ్లోబల్ భాగస్వాములతో పనిచేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం” అని లోకేష్ ప్రకటించారు.
ఎనర్జీ సెక్యూరిటీ మాకు అత్యంత కీలకం
“ఈ సమావేశం ఒక అత్యంత ముఖ్యమైన సమయంలో జరుగుతోంది. ఇది కేవలం భారతదేశ ఎనర్జీ భవిష్యత్తుకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎనర్జీ పరివర్తనకు సంబంధించిన అంశం కూడా. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏకకాలంలో ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక వ్యాప్తి, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, డీకార్బనైజేషన్ ఏ విధంగా సాధించాలనే అంశంపై ఆలోచన చేస్తున్నాయి. క్లైమేట్ కమిట్‌మెంట్‌లను పాటిస్తూ ఏఐ యుగాన్ని ఎలా ముందుకు నడిపించాలి, అందుకు అవసరమైన విద్యుత్తును తక్కువ ఖర్చుతో ఎలా సిద్ధం చేసుకోవాలి, ఇంధన భద్రతను ఏ విధంగా సాధించాలనేది తక్షణ సవాళ్లుగా మారాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆకాంక్షలు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఎనర్జీ సెక్యూరిటీ అన్నది మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అత్యంత కీలకమైన పారిశ్రామిక, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కేంద్రంగా మారింది” అని స్పష్టం చేశారు.
ఇంధన పరివర్తనపై ఆంధ్రప్రదేశ్ దృష్టి
“మేము కొత్త పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తున్నాం, ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. వివిధ రకాల రెన్యువబుల్ ఎనర్జీ సాధనకు ఆ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాం. విశాఖపట్నాన్ని ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నాం. 6 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లు పోర్టు సిటీలో రాబోతున్నాయి. భవిష్యత్ తరం పరిశ్రమలకు అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్‌బోన్‌ను నిర్మిస్తున్నాం. ఇందులోకి భారీ పరిమాణంలో విశ్వసనీయ విద్యుత్ అవసరం ఉంటుంది. ఇందుకు సీజనల్ సాంప్రదాయ విద్యుత్ కాకుండా నాణ్యత కలిగిన కాలుష్య రహిత, తక్కువ ఖర్చుతో కూడిన రౌండ్-ది-క్లాక్ (24/7) ఇంధనం అవసరం. అందువల్లే ఎనర్జీ ప్లానింగ్ అన్నది ఆర్థిక ప్రణాళికలో కీలకాంశంగా మారింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ఇంధన పరివర్తనపై దీర్ఘకాలిక, సమగ్ర దృక్పథాన్ని అవలంబిస్తోంది. మా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో రెన్యువబుల్స్, స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్‌మిషన్ ఇన్‌ఫ్రా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్, గ్రిడ్ ఆధునీకరణ రంగాల్లో సుమారుగా రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులను మేం లక్ష్యంగా పెట్టుకున్నాం” అని వివరించారు.
భవిష్యత్తులో భారీగా విద్యుత్ అవసరం
“మేం వాస్తవ దృష్టితో ఆలోచిస్తున్నాం. భవిష్యత్ తరం పారిశ్రామిక వృద్ధికి పునరుత్పాదక శక్తి ఒక్కటే సరిపోదని మేము అర్థం చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ కంప్యూట్ విస్తరిస్తున్న కొద్దీ విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. కేవలం ఒక హైపర్‌స్కేల్ ఏఐ-నేటివ్ డేటా సెంటర్ ఒక మధ్యస్థ పట్టణం ఎంత విద్యుత్ వాడుతుందో అంత ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. పెద్దఎత్తున డేటా సెంటర్లు, సెమికండక్టర్ పార్కులు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి క్లస్టర్లు, పారిశ్రామిక కారిడార్లను ఏకీకృతంగా అభివృద్ధి చేసేటప్పుడు భారీ పరిమాణంలో విద్యుత్ అవసరమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తోంది. మేము ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద డేటా సెంటర్ ఎకోసిస్టమ్‌లలో ఒకటి నిర్మిస్తున్నాం. గ్లోబల్ కంపెనీలు ఏపీలో ముఖ్యంగా విశాఖపట్నంలో గిగావాట్ సామర్థ్యం గల ఏఐ-నేటివ్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి” అని వెల్లడించారు.
డేటా సెంటర్ల చుట్టూ తయారీ ఎకోసిస్టమ్
“మా దృష్టిలో డేటా సెంటర్ అంటే కేవలం సర్వర్లతో కూడిన భవనాలకు ఆతిథ్యమివ్వడం కాదు. డేటా సెంటర్ ఎకోసిస్టమ్ చుట్టూ తయారీ ఎకోసిస్టమ్ కూడా నిర్మించాలన్నదే మా లక్ష్యం. మేం కేవలం భూమి, విద్యుత్ గురించి మాత్రమే ఆలోచించడం లేదు. ఫుల్ స్టాక్ గురించి ఆలోచిస్తున్నాం. కూలింగ్ సిస్టమ్స్‌ను స్థానికంగా తయారు చేయడం, పవర్ ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్‌లను నిర్మించడం, ట్రాన్స్‌ఫార్మర్స్ తయారీని ప్రోత్సహించడం, బ్యాటరీ స్టోరేజ్ సప్లయ్ చైన్స్, సెమీకండక్టర్-అనుసంధాన పరిశ్రమలను ఆకర్షించడంపై మేం దృష్టి సారించాం. ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నీషియన్లు, ఎనర్జీ ఇంజనీర్లు, ఆధునిక తయారీ వర్క్‌ఫోర్స్ కోసం స్కిల్లింగ్ సంస్థలను నిర్మించడం ద్వారా ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం. ప్రాజెక్టుల వారీగా కాకుండా వివిధ దశల్లో క్లస్టర్ల వారీగా సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాం. చరిత్రలో పారిశ్రామికంగా విజయం సాధించిన దేశాలు, ప్రాంతాలు విడివిడిగా పెట్టుబడులపై కాకుండా మొత్తం వాల్యూ చైన్‌లతో అభివృద్ధి చెందినవే. మేము ఏఐ, క్లీన్ ఎనర్జీ అవకాశాలను కూడా అదేవిధంగా అందిపుచ్చుకుంటున్నాం” అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
న్యూక్లియర్ ఎనర్జీ సప్లయ్ చైన్‌లో భాగస్వామ్యం
“న్యూక్లియర్ ఎనర్జీ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను కూడా అదే కోణంలో చూడాలని నేను నమ్ముతున్నాను. అయితే తరచుగా న్యూక్లియర్ ఎనర్జీ గురించిన చర్చలు కేవలం ఉత్పత్తి సామర్థ్యంపైనే కేంద్రీకృతమవుతాయి. కానీ అసలైన అవకాశం అంతకంటే చాలా పెద్దది. న్యూక్లియర్ ఎనర్జీ ఒక పూర్తి పారిశ్రామిక ఎకోసిస్టమ్‌గా మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు దీర్ఘకాలిక అవకాశం కేవలం న్యూక్లియర్ ఆస్తులను కలిగి ఉండటం మాత్రమే కాదు. పూర్తిగా న్యూక్లియర్ వాల్యూ చైన్‌లో భాగస్వామ్యం కావడమే. ప్రధానమైన విడిభాగాలను తయారుచేయడం, ప్రత్యేకమైన ఉక్కు, ఫాబ్రికేషన్ ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేయడం, అత్యాధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలను నిర్మించడం వంటివాటిపై మేం దృష్టి సారిస్తాం. ప్రపంచస్థాయి భద్రతా ప్రమాణాలు, నిర్మాణ ప్రమాణాలను ఏర్పాటుచేయడం, భవిష్యత్ తరం న్యూక్లియర్ వర్క్‌ఫోర్స్‌కు శిక్షణ ఇవ్వడం, కచ్చితమైన మ్యానుఫ్యాక్చరింగ్ సప్లయ్ చైన్‌లకు మద్దతు ఇవ్వడం, అత్యాధునిక న్యూక్లియర్ సాంకేతికతల చుట్టూ ఎగుమతుల పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను నిర్మించడం మా లక్ష్యం” అని వివరించారు.
ఎకోసిస్టమ్ నిర్మాణానికి సరైన సమయం
“న్యూక్లియర్ ప్రాజెక్టులను కాకుండా న్యూక్లియర్ పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను నిర్మించడానికి ఇది సరైన సమయమని మేం భావిస్తున్నాం. దీర్ఘకాలిక మౌలికాంశాలు ఆకర్షణీయంగా ఉండటం మాత్రమే ఇందుకు కారణం కాదు. న్యూక్లియర్ ఎనర్జీ విశ్వసనీయ బేస్డ్ విద్యుత్తును అందిస్తుంది. ఇది పునరుత్పాదక శక్తికి మంచిగా తోడ్పడుతుంది. అస్థిరమైన ఫాసిల్ ఫ్యూయెల్స్ మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టుల జీవిత కాలంలో అత్యంత పోటీదారుగా, హించదగిన లెవలైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీని (ఎల్సీవోఈ) అందిస్తుంది. 20 లేదా 30 ఏళ్ల పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే
డేటా సెంటర్లు, సెమీకండక్టర్ వంటి పరిశ్రమలకు భవిష్యత్ అంచనా ముఖ్యం. తయారీ రంగంలో ప్రధాన పోటీదారుగా నిలవడంలో దీర్ఘకాలిక విద్యుత్ ధరలు కీలకంగా ఉంటాయి. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలకు ఒక వ్యూహాత్మక ప్రయోజనం చేకూరు స్తుంది. మోడర్న్ న్యూక్లియర్ సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ భద్రతా ప్రమాణాలు కూడా భారీగా
మెరుగుపడుతున్నాయి” అని పేర్కొన్నారు.
ఇంధన భవిష్యత్తుపైనే ఏఐ భవిష్యత్తు
“ప్రపంచవ్యాప్తంగా ప్యాసివ్ సేఫ్టీ సిస్టమ్స్, మాడ్యు లర్ డిజైన్లు, డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్, ఆపరేషనల్ రెసిలియన్స్లో ప్రధాన ఆవిష్కరణలు కనిపిస్తున్నాయి. న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ప్రపంచవ్యాప్త చర్చ శైలి మారుతోందని నేను భావిస్తున్నాను. న్యూక్లియర్ ఎనర్జీ పాత్ర లేకుండా భారీ కర్బన ఉద్గారాల తగ్గింపు, పారిశ్రామిక స్థాయి విద్యుదీకరణకు విశ్వసనీయ మార్గం లేదని ప్రపంచ దేశాలు క్రమంగా గుర్తిస్తున్నాయి. ఏఐ విప్లవం ఈ గుర్తింపును మరింత వేగవంతం చేస్తోంది. ప్రపంచం లోని అతిపెద్ద టెక్ కంపెనీలు ఇప్పుడు నేరుగా దీర్ఘకాలిక న్యూక్లియర్ భాగస్వామ్యాలను పరిశీలిస్తున్నా యి. ఏఐ భవిష్యత్తు ఇంధన భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో నమ్మకమైన, స్వచ్ఛమైన బేస్ డ్ విద్యుత్తు తప్పనిసరిగా ఉండాలి. ఇది ప్రభుత్వాలు, టెక్నాలజీ ప్రొవైడర్లు, తయారీదారులు, పెట్టుబడిదారుల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలకు అపారమైన అవకాశాలను సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆ భవిష్యత్తులో భాగస్వామ్యం వహించాలని కోరుకుంటోంది” అని లోకేష్ స్పష్టం చేశారు.
యూఎస్-ఇండియా న్యూక్లియర్ అధ్యాయం
“భారత్-అమెరికా సహకారం ఇప్పటికే సాంకేతికత, రక్షణ, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో మార్పులు తెచ్చింది. ఆ వ్యూహాత్మక భాగస్వామ్యంలోని తదుపరి ప్రధాన అధ్యాయం న్యూక్లియర్ ఎనర్జీ కాగలదని నేను బలంగా నమ్ముతున్నాను. ఇది కేవలం ఎనర్జీ భాగస్వామిగా మాత్రమే కాకుండా… ఒక పారిశ్రామిక భాగస్వామ్యంగా, తయారీ భాగస్వామ్యంగా, ఆవిష్కరణల భాగస్వామ్యంగా, అభివృద్ధి భాగస్వామ్యంగా, ఏఐ యుగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్్బన్ నిర్మాణానికి తోడ్పడే భాగస్వామ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఎనర్జీ, పారిశ్రామిక పునాదులను నిర్మిస్తున్న తరుణంలో మేము దీర్ఘకాలిక దార్శనికతను పంచుకునే గ్లోబల్ నేతలతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాం. ముందున్న అవకాశం అపారమైంది. పారదర్శకమైన అభివృద్ధిని సాధించడానికి, ఉన్నత శ్రేణి నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించడానికి, ఎనర్జీ భద్రతను బలపరచడానికి, అత్యాధునిక తయారీకరణను వేగవంతం చేయడానికి, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ తదుపరి యుగానికి శక్తినిచ్చేందుకు ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతినిధులకు ధన్యవాదాలు. ఇక్కడి చర్చలు దీర్ఘకాలిక భాగస్వామ్యాల నిర్మాణం దిశగా సాగాలి” అని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.














