అమరావతి (చైతన్య రథం): బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందని సీఎం వెల్లడించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవిందరాజన్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించడంపై ఆ సంస్థ ప్రతినిధులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాళ్లకుప్పం, వానల్లూరు గ్రామాలవద్ద రూ.2500 కోట్ల పెట్టుబడితో బుల్లెట్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అత్యాధునిక తయారీ యూనిట్‌తో పాటు టెస్టింగ్ ట్రాక్, పరిశోధనా కేంద్రం, వెండర్ పార్క్ ఎకోసిస్టమ్ కూడా నిర్మిస్తామన్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 9 లక్షల మోటార్ సైకిళ్లు ఉత్పత్తి చేయనున్నట్టు రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ గోవిందరాజన్ ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. త్వరలో ఫ్లైయింగ్ ఫ్లీ సీ6 పేరిట ఎలక్ట్రిక్ వేరియంట్ మోడల్‌ను కూడా తీసుకురానున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ఆంధ్రప్రదేశ్‌లో రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పాదనకు సంబంధించి చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ప్రతినిధులకు వివరించారు. సౌర, పవన విద్యుత్‌తోపాటు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రాజెక్టుల గురించి వారికి తెలియచేశారు. అనంతరం రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతినిధులు సీఎంకు బుల్లెట్ 350 మినియేచర్ మోడల్‌ను అందించారు. ఈ సందర్భంగా బుల్లెట్ 350 మోటార్ సైకిళ్లకు సంబంధించిన మోడళ్లను సీఎం పరిశీలించారు. హెల్మెట్ ధరించి సీఎం బుల్లెట్ ఎక్కారు.













