- ఆసక్తి రేకెత్తిస్తోన్న ఐటీ మంత్రి లోకేష్ పోస్ట్
- పుట్టపర్తిలో స్టెల్త్ విమానాల తయారీ కేంద్రం
- చంద్రబాబు-లోకేశ్ సాధించిన చారిత్రక విజయం
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ రక్షణ రంగంలో కొత్త చరిత్ర సృష్టించబోతోంది. భారత్ తయారు చేయనున్న ఐదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్ల ఉత్పత్తి కేంద్రం ఇప్పుడు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటుకానుంది. మే 15న ఈ ఏరోస్పేస్ సెంటర్‌కు భూమిపూజ జరగనుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఐటీ మంత్రి నారా లోకేశ్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తికర ఏఐ వీడియో విడుదల చేస్తూ “మే 15న పుట్టపర్తినుంచి ఏం టేకాఫ్ అవుతోందో ఊహించగలరా?” అంటూ సోషల్ మీడియాలో సంచలనం రేపారు. ఈ ప్రాజెక్టు ఏపీకి రావడం వెనక ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన నిరంతర కృషి అమోఘమైనది. సీఎం చంద్రబాబు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌కు ప్రతిపాదన సమర్పించిన 11 నెలల 9 రోజులకే ప్రాజెక్టు సాకారమవుతోంది. కేంద్ర రక్షణ మంత్రితో చంద్రబాబు జరిపిన చర్చల ఫలితంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది. దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టినా, చంద్రబాబు-లోకేశ్ జంట పట్టుదల మరియు దూరదృష్టితో వ్యవహరించిన తీరు ఏపీకి అద్భుతమైన ఫలితాన్ని అందించింది.
ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ బృందం ఇప్పటికే పుట్టపర్తి భూమిని పరిశీలించి, తమ అవసరాలకు సరిపోతుందని నిర్ధారించుకున్న వెంటనే, సీఎం చంద్రబాబు కేబినెట్‌లో చర్చించి ఆమోద ముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం డీఆర్డీవోకు 600 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింది. ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్, శాస్త్రవేత్తల నివాస ప్రాంతాలు, ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఉపయోగపడేలా. అంతేకాదు, అనుబంధ పరిశ్రమల కోసం మరో 400 ఎకరాలు కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
పుట్టపర్తిని ఎంపిక చేయడం వెనక ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళిక స్పష్టంగా కనపడుతోంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉండటం పరిశ్రమల ఏర్పాటుకు కలిసివస్తోంది. బెంగళూరు చుట్టుపక్కల రక్షణరంగ విస్తరణకు అవకాశాలు తగ్గడంతో, కంపెనీలన్నీ శ్రీసత్యసాయి జిల్లావైపు చూస్తున్నాయి.
డీఆర్డీవో పర్యవేక్షణలో యుద్ధ విమానాల తయారీకి అవసరమైన వ్యవస్థల రూపకల్పన, తుది కూర్పు, నేలపైన నిర్వహించే పరీక్షల కార్యకలాపాలు పుట్టపర్తి కేంద్రంలో జరుగుతాయి. మొత్తం 140 అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానాలను ఇక్కడ తయారు చేయాలని డీఆర్డీవో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర అధికారులు వెల్లడించారు.
ఇక్కడ తయారు చేయబోయే విమానాలు సుఖోయ్ ఎస్‌యూ-30 యుద్ధ విమానాలకు ప్రత్యామ్నాయంగా స్వదేశీ సాంకేతికతతో ఉంటాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌లను 2035 నాటికి పూర్తిస్థాయిలో తయారు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బెంగళూరుకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఏడీఏ)లో ఏఎంసీఏకు అవసరమైన సిస్టమ్స్ డిజైన్, టెస్టింగ్, మాడ్యూల్స్ అసెంబ్లింగ్‌ను పూర్తి చేస్తారు. అక్కడి నుంచి శ్రీసత్యసాయి జిల్లాలో ఉన్న పుట్టపర్తికి మాడ్యూళ్లను తరలించాలని ప్లాన్ చేశారు. పుట్టపర్తిలో విమానాలనమూనాల ఫైనల్ అసెంబ్లింగ్, ఆన్‌గ్రౌండ్ టెస్టింగ్‌లను నిర్వహించనున్నారు.
శ్రీసత్యసాయి జిల్లాను రాబోయే రోజుల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీ హబ్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో పలు రక్షణ రంగానికి సంబంధించి ప్రాజెక్టులు ఏర్పాటుకానుండగా.. తాజాగా ఏఎంసీఏల తయారీ కేంద్రం కూడా ఏర్పాటు కాబోతోంది. ఇప్పటికే బీఈఎల్ (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) రూ.500 కోట్ల పెట్టుబడితో పాల సముద్ర దగ్గర వెయ్యి ఎకరాల్లో భారీ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయబోతోంది.. అక్కడ ఏరోస్పేస్ రంగానికి అవసరమైన వాటిని తయారు చేయనున్నారు. అలాగే మడకశిరలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ వెయ్యి ఎకరాల్లో రూ.2,500 కోట్లతో భారీ డిఫెన్స్ ఎనర్జిటిక్స్ తయారీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఇలా శ్రీసత్యసాయి జిల్లాకు వరుసగా పరిశ్రమలు వస్తున్నాయి.
శ్రీసత్యసాయి జిల్లా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న ప్రాంతం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉంది. బెంగళూరు నుంచి 130 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే ప్రాంతానికి చేరుకోవచ్చు. అలాగే జిల్లాలోని పుట్టపర్తిలో కూడా విమానాశ్రయం ఉన్న సంగతి తెలిసిందే. అవసరమైతే ఆ ఎయిర్‌పోర్ట్‌ను ఉపయోగించుకోవచ్చంటున్నారు. బెంగళూరు వైపు రక్షణ రంగానికి సంబంధించి ప్రాజెక్టులు విస్తరించేందుకు అవకాశం లేకపోవడంతో కంపెనీలన్నా జిల్లావైపు చూస్తున్నాయని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరికొన్ని కంపెనీలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబు-లోకేశ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కో అడుగూ ముందుకు వేస్తూ, నేడు దేశ రక్షణరంగ పటంలో కీలక స్థానాన్ని సుస్థిరంగా సంపాదించుకుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు.














