విశాఖపట్నం (చైతన్య రథం): విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగందుకున్నట్టేనని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ ఇన్‌ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే వ్యాఖ్యానించారు. విశాఖ సమీపాన తర్లువాడవద్ద ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ భూమిపూజ కార్యక్రమానికి బికాస్ కోలే హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. “గూగుల్ ఇండియా ఏఐ హబ్‌కు విశాఖలో చేసిన శంకుస్థాపన 2047 వికసిత్ భారత్‌కు పునాది రాయి లాంటిది. ఏఐ యుగంలో విశాఖలో ఏర్పాటు చేస్తున డేటా సెంటర్ కీలక పాత్ర పోషించనుంది. భారత డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లోనూ ఈ డేటా సెంటర్ అత్యంత ముఖ్యమైన అంశం. గ్లోబల్ ఏఐ ఎకానమీ దిశగా ఇప్పుడు విశాఖ, ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోంది. ఇంటర్నేషనల్ సబ్ సీ గేట్ వేగా ఉన్న ముంబై, చెన్నైలతోపాటు విశాఖ కూడా ఇప్పుడు కీలకంగా మారింది. కొత్త ఫైబర్ ఆప్టిక్ లైన్లు ఇతర ప్రాంతాలతో విశాఖను అనుసంధానిస్తాయి.
సముద్ర గర్భ లైన్లతో సంప్రదాయ నౌకాయాన మార్గాలు ఇక డిజిటల్ ట్రేడ్ రూట్లుగా మారతాయి. అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్‌ట్రా ఈ డేటా సెంటర్ ఏర్పాటులో భాగస్వామ్యం వహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇండస్ట్రియల్ కారిడార్‌గా ఎదుగుతున్న ఈ ప్రాంతానికి టెక్ ఫ్యూచర్‌ను అందించేలా ఈ డేటా సెంటర్ ఉంటుంది. స్థానిక యువతకు ఉద్యోగ భద్రత, ఇంధన భద్రత, నీటి వినియోగంలాంటి అంశాలతో స్థానిక భాగస్వామ్యంతో ముందుకు అడుగులు వేస్తాం. యువతకు భవితను అందించేలా వారికి అడ్వాన్స్‌డ్ క్లౌడ్, ఏఐలో శిక్షణ కార్యక్రమాలు కూడా గూగుల్ నిర్వహిస్తుంది. 10 వేలమందికి పైగా మహిళలకు మైక్రో ఎంట్రప్రైజ్‌గా మారేందుకు కూడా సహకారం అందిస్తుంది. న్యూ ట్రాన్స్‌మిషన్ లైన్లు, ఎనర్జీ స్టోరేజి సిస్టమ్స్‌లాంటివి ఈ ప్రాంతానికి ఇంధన భద్రతను కల్పిస్తాయి. విశాఖలోని వివిధ నివాస ప్రాంతాలు, పర్యావరణ పరిరక్షణతోపాటు ఈ ప్రాంతానికి ఆర్ధిక స్థిరత్వం కల్పించేలా డేటా సెంటర్ నిర్మితమవుతుంది” అని వివరించారు.
















