అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. “ఈ చారిత్రాత్మక మైలురాయి, ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు. గత కొన్నేళ్లుగా, జస్టిస్ గిల్ సివిల్, క్రిమినల్, రాజ్యాంగ చట్టాలకు సంబంధించిన విస్తృత శ్రేణి కేసులను నేర్పుగా నిర్వహిస్తూ, ఒక విశిష్టమైన, ఆదర్శప్రాయమైన న్యాయవాద వృత్తిని నిర్మించుకున్నారు. న్యాయంపట్ల ఆమెకున్న నిబద్ధతకుకు ప్రజల నుండి ప్రగాఢమైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. జస్టిస్ లీసా గిల్ చట్టబద్ధ పాలనను నిలబెడుతూ, వివేకం మరియు చిత్తశుద్ధితో న్యాయాన్ని అందించడంలో విజయవంతమైన, స్ఫూర్తిదాయకమైన, ప్రభావవంతమైన పదవీకాలాన్ని గడపాలని నేను ఆకాంక్షిస్తున్నాను” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
















