- పుట్టినరోజు సందర్భంగా సీఎంఆరఎఫ్ ఫైలుపై సీఎం సిగ్నేచర్
- సహాయ నిధినుంచి రూ.56 కోట్ల విడుదలకు సంతకం
- 22 నెలల్లో అభాగ్యులకు రూ.1,298 కోట్ల ఆర్ధిక సాయం
అమరావతి (చైతన్య రథం): ఏ మంచి సందర్భం వచ్చినా పేదలకు మేలు చేసే కార్యక్రమంతో ఆ రోజును ప్రారంభించడం ఆనవాయితీ చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉగాది రోజు, న్యూఇయర్‌వంటి సందర్భాల్లో పేదలకు మేలు చేసే సీఎంఆరఎఫ్ ఫైలుపై తొలి సంతకం చేసి రోజువారీ విధులు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఇదే ఆనవాయితీని కొనసాగించారు. ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో వేద ఆశీర్వచనం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీన్‌కు వెళ్లారు. అక్కడ లబ్దిదారులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం రోడ్డుమార్గంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళుతున్న సమయంలో సీఎంఆరఎఫ్ ఫైల్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొంది సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న 7,074మందికి రూ.56.39 కోట్లు విడుదల చేసే దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. తన పుట్టిన రోజున పేదలతో కలసి అన్న క్యాంటీన్‌లో భోజనం చేసిన సీఎం… తరువాత పేదలకు లబ్ది చేకూర్చే ముఖ్యమంత్రి సహాయనిధి విడుదల ఫైలుపై సంతకం చేశారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన నాటినుంచి ఈ 22 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మొత్తం 1,43,314 మంది లబ్ధిదారులకు రూ.1,298.33 కోట్లు అందజేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద మొత్తంలో సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థికసాయం అందించలేదు. ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక కష్టాలు అవరోధం కాకూడదనే ఆలోచనతో అనేక సవాళ్లున్నా… పెద్ద మనుసుతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చంద్రబాబు ప్రజలకు సాయం చేస్తున్నారు.














