- అన్ని ప్రభుత్వ పాఠశాలలను త్రీస్టార్‌కు చేర్చేలా చర్యలు
- ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల పెంపుదలకు డోర్ టు డోర్ క్యాంపెయిన్
- ప్రభుత్వ కాలేజీల్లో అత్యుత్తమ మార్కులపై ప్రచారం కల్పించండి
- పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను స్కూలు మేనేజ్‌మెంట్ కమిటీ (ఎసఎంసీ)లకు అప్పగించి త్వరిగతిన పూర్తిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… “రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్రీ స్టార్ మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యిమందికి పైబడి విద్యార్థులున్న పాఠశాలలు 60 ఉన్నాయి. ఆ స్కూళ్లలో ఫైవ్‌స్టార్ సదుపాయాల కల్పనపై దృష్టిసారించండి. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు ప్రాధమికోన్నత పాఠశాలలో సీట్ల కోసం పోటీ ఉంది. ఇది మంచి పరిణామం. లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, తాగునీరు, టాయ్ లెట్లు, పెయింట్స్, బల్లల ఏర్పాటువంటి పనులను ఎసఎంసీలకు అప్పగించండి. మోడల్ ప్రైమరీ స్కూళ్లలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.143.27 కోట్లు అవసరం. ఈ పనులను మాత్రం రాష్ట్ర పాఠశాల మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా చేపట్టండి. ఈ ఏడాది మోడల్ ప్రైమరీ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలకు రూ.571.11 కోట్లు అవసరమవుతాయని నివేదించారు. వివిధ విభాగాల ద్వారా నిధులను సేకరించి సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేయండి. ఏజన్సీ, మారుమూల ప్రాంతాల్లో సొంత భవనాలులేని పాఠశాలలను గుర్తించి వెంటనే పనులు చేపట్టాలి” అని మంత్రి లోకేష్ ఆదేశించారు.
ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లపై అధికారులు దృష్టిసారించాల్సిందిగా మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. “ఎన్‌రోల్‌మెంట్ పెంపుదలకు డోర్ టు డోర్ కాంపెయిన్ నిర్వహించండి. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ఇందులో భాగస్వాములను చేస్తాం. ఈసారి 10శాతం అడ్మిషన్ల పెంపుదల లక్ష్యంగా పనిచేయాలి. పాఠశాలల్లో డ్రాపవుట్స్‌ను జీరోస్థాయికి చేర్చాలి. బడిఈడు గల పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో స్కూలు బయట ఉండకూడదు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంపుదలకు కృషిచేయండి. స్కూళ్లలో జెండర్ సెన్సిటివిటీకి సంబంధించి మహిళలను కించపర్చే పదాలు ఎక్కడా ఉపయోగించకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలి. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సంబంధించి శాప్ అధికారులతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో విస్తృత చర్యలు చేపట్టాలి. ఆసక్తిగల విద్యార్థులను గుర్తించి బ్యాడ్మింటన్, ఆర్చరీ, ఖోఖోవంటి ఆటల్లో ప్రోత్సహించాలి. కళాశాలస్థాయిలో లీగ్స్ నిర్వహించే అంశాన్ని పరిశీలించండి” అని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు జూనియర్ కళాశాలలకు అనుమతులకు సంబంధించి మార్గదర్శకాలపై సమీక్షించారు. ఇంటర్మీడియట్‌లో పలువురు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రైవేటుకు ధీటుగా ఉత్తమ మార్కులు సాధించడంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గుర్తించి విస్తృత ప్రచారం నిర్వహించాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశించారు. అటువంటివారిని షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో సత్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో రాష్ట్ర మానవవనరుల కార్యదర్శి కోన శశిధర్, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ రంజిత్ బాషా, పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా, పాఠశాల మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ దీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.














