- ఐదుకోట్ల ఆంధ్రుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం
- రాష్ట్రపతి ముర్ముకి మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీల కతజ్ఞతలు
- రైతుల త్యాగ ఫలితమే అమరావతి
- పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుందన్న రాష్ట్రపతి
ఢిల్లీ (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రకు దేశ ప్రథమ పౌరురాలు సాక్షి సంతకం కావడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన బిల్లుకు దేశమంతా ఒక్కటై మద్దతివ్వగా, రాజముద్ర వేసి అమరావతికి శాశ్వతత్వం కల్పిస్తూ శాసనం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు జేజేలు పలుకుతున్నారు. మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్- మా రాజధాని అమరావతి అని ఆంధ్రజాతి సగర్వంగా తల ఎత్తి చాటేలా చారిత్రక అమరావతి రాజధాని చట్టంపై సంతకం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు రాష్ట్రప్రతి భవన్‌లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. విభజనతో కోలుకోలేని విధంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని, రాజధానిలేని రాష్ట్రంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని గుర్తించి.. ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ చట్టం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి ఆంధ్రజాతి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమరావతి చరిత్ర-సంస్కృతి-రాజధానిలో పూర్తయిన నిర్మాణాలు, రైతుల ఉద్యమం, మాస్టర్ ప్లాన్ ప్రకారం మొత్తం నిర్మాణాలు పూర్తయితే అమరావతి రాజధాని ఎలా ఉంటుందో సూచించే ఊహాచిత్రాలు, పర్యావరణహిత నిర్మాణ విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని ఎంపీలతో కలిసి లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని నరేంద్ర మోదీ, 2024లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమరావతి పనులు పునః ప్రారంభించింది ప్రధాని నరేంద్ర మోదీ అని వివరించారు.
రైతుల త్యాగ ఫలితమే అమరావతి
రాజధాని ఏర్పాటుకు చంద్రబాబు పిలుపుతో 58 రోజుల్లోనే 34 వేల ఎకరాల భూములు రైతులు త్యాగం చేశారని, గత పాలనలో వారిపై దాడులు జరిగినా, అక్రమ కేసులు పెట్టినా, శాంతియుతంగా రాజధాని కోసం ఉద్యమించారని రాష్ట్రపతికి లోకేష్ వివరించారు. కోట్లాది ప్రజల కోరిక అయిన అమరావతి చట్టం తన హయాంలో రూపొందడం సంతోషంగా ఉందని, రైతులు రాష్ట్రంపై ప్రేమతో రాజధాని నిర్మాణానికి తమ భూమిని ఇచ్చారని రాష్ట్రపతి రైతుల త్యాగాలను కొనియాడారు. పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని, ఆయన దూరదృష్టితో రాష్ట్రాన్ని, రాజధానిని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించాలని, రాజధాని పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.















