తాడిపత్రి (చైతన్య రథం): జలమే సంపద… దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపద సృష్టించవచ్చని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘జలధార’తో రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకూ సాగునీరు అందించేలా జలహారతి కార్యాచరణ చేపడదామని చైతన్యంనింపారు. అనంతపురం జిల్లా యాడికిలో ‘జలధార..నీటి భద్రత-సాగు నీటి సంఘాల బాధ్యత’ అనే కార్యక్రమంలో పాల్గొని 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేసిన సీఎ చంద్రబాబు.. కార్యక్రమం అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడారు. పెండేకల్లు రిజర్వాయర్ సమీపంలో రైతులు అనుసరిస్తున్న బిందు సేద్యం, ప్రకృతి సేద్యం, పీఎండీఎస్ విధానాలను ముఖ్యమంత్రి పరిశీలించి.. రైతుల నుంచి అనుసరణ విధానాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో రైతులు అవలంభిస్తున్న వినూత్న సాగు పద్ధతులను స్వయంగా పరిశీలించారు. పెండేకల్లు రిజర్వాయర్, హంద్రీనీవా ద్వారా సాగుకు నీటి లభ్యత తదితర అంశాలపై లక్కు శ్యామల, నీలం శ్రీనివాసరెడ్డి అనే రైతులతో మాట్లాడారు. హంద్రీ-నీవాతో తాగు, సాగునీటి అవసరాలు తీరుతున్నాయని రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.
వంద రోజుల కార్యాచరణలో భాగంగా నీటిని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పూడికతీత, కాలువల మరమ్మత్తుల కోసం 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం చేపట్టిందని వివరించిన ముఖ్యమంత్రి.. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలు సాగు చేస్తున్న రైతులు పరిమి చరణ్‌కుమార్, పాపసాని ముని యుగంధర్‌తోనూ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధిక దిగుబడి సాధించేలా 90 శాతం సబ్సిడీ ఇస్తున్న సాంకేతిక పరికరాలను అందిపుచ్చుకోవాలన్న ముఖ్యమంత్రి, వర్షాలకు ముందే దుక్కుల్లో విత్తనాలు చల్లే ‘ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ’ పద్ధతి గురించి రైతులు హరికృష్ణ, దేవిలను అడిగి తెలుసుకున్నారు. భూగర్భ జలాల పెంపుకోసం ఆఫ్రికావంటి దేశాల్లో అనుసరించే హాఫ్ మూన్ స్ట్రక్చర్స్ పద్ధతిని అనుసరిస్తున్న కమ్మర నందిని, గొల్ల ప్రమీలమ్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఎకరానికి 100నుంచి 300 వరకు అర్థ చంద్రకార పద్ధతిలో బండ్స్ కట్టామని వివరించిన మహిళా రైతులు, ఈ విధానంద్వారా ఒక్క సీజన్లోనే నేల సారవంతంగా మారిందని, దీనివల్ల దిగుబడి పెరిగిందని ముఖ్యమంత్రికి వివరించారు.















