- సీనియర్లను గౌరవిస్తాం, పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం
- పంచాయతీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి
- ఉండవల్లి నివాసంలో పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఆత్మీయ విందు
- సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న మంత్రి నారా లోకేష్
ఉండవల్లి (చైతన్య రథం): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషివల్లే నేడు మనం ఈ స్థాయిలో ఉన్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉండవల్లి నివాసంలో పార్టీ సీనియర్ కార్యకర్తలతో ఆత్మీయ విందు సమావేశంలో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. సీనియర్ కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. “పార్టీలో సీనియర్లను గౌరవిస్తాం, పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం. ‘మై టీడీపీ’ యాప్ ద్వారా నేతల పనితీరును బేరీజు వేస్తాం. పార్టీలో సంస్కరణల కోసం పోరాడుతున్నా. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడుతున్నా. పార్టీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత తూచ తప్పకుండా పాటించాలి. బహిరంగ వేదికలపై కాకుండా ‘మై టీడీపీ’ యాప్ ద్వారా నేతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలి. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి. నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషిచేయాలి” అని మంత్రి పిలుపునిచ్చారు.
తాత నుంచి మనవడి వరకు కలిసి భోజనం చేశాం
ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలు స్పందిస్తూ.. తాము పార్టీలో కష్టపడి పనిచేసేందుకు మీరే స్ఫూర్తి అని అన్నారు. మమ్మల్నందరినీ ఇంటికి పిలిచి గౌరవించడం, తాతగారి నుంచి మనవడి వరకు కలిసి భోజనం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఆత్మీయ విందును జీవితంలో మర్చిపోలేమని, మీ రుణం తీర్చుకోలేదని భావోద్వేగంతో చెప్పారు. కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.













