- సీఎం అధ్యక్షతన 6వ జిల్లా కలెక్టర్ల సదస్స
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వ విధానాలు, ప్రణాలికలను చిత్తశుద్ధితో అమలుచేసి.. స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా కలెక్టర్లు ముందుకు సాగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన రెండు రోజులపాటు నిర్వహించే 6వ కలెక్టర్ల సదస్సు బుధవారం ఉదయం.. అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆరంభమైంది. సమావేశానికి సిసిఎలఏ జయలక్ష్మి స్వాగతం పలికారు. సమావేశంలో సీఎస్ సాయిప్రసాద్ ముందుగా మాట్లాడుతూ `ప్రభుత్వ విధానాలను మరింత మెరుగైన రీతిలో అమలు చేసేందుకు, అధికారుల పనితీరును మదింపు చేసేందుకు సమావేశం దోహద పడుతుందని పేర్కొన్నారు. 2047నాటికి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా రూ.55 లక్షల రూ.తలసరి ఆదాయం సాధించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకు అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వర్ణాంధ్ర పది సూత్రాలు సాధనకు సమిష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ సేవలకై ఏ పౌరుడు స్వర్ణ గ్రామ వార్డులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉండేలా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు సేవలను అందుబాటులోకి తేవడం జరిగిందని చెప్పారు. ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. నేడు దేశంలో పీపీపీ విధానం వైపు కూడా అడుగులు పడుతున్నాయని, ప్రభుత్వంతోపాటు ప్రైవేటురంగంలో పధకాలు, కార్యక్రమాల అమలుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ సాయిప్రసాద్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.












