మంగళగిరి (చైతన్య రథం): రాజధాని అమరావతిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 58 అడుగుల భారీ కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవానికి విశిష్ట అతిథిగా రావాలని కోరుతూ మంత్రి నారా లోకేష్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఉండవల్లి నివాసంలో మంత్రిని కలిసిన ట్రస్ట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ, ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, ట్రస్ట్ ప్రతినిధులు ఈమేరకు ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. నారా లోకేష్ చేతుల మీదుగా సెప్టెంబర్ 3, 2025న శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టును, కేవలం ఆరు నెలల కాలంలోనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం విశేషం. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంత్యుత్సవాల సందర్భంగా, ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహారదీక్షకు గుర్తుగా 58 అడుగుల భారీ ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస’ను నిర్మించారు. అమరావతి పెదపరిమి రోడ్డులోని తుళ్లూరు శాఖమూరు పార్క్‌లో నెలకొల్పిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మార్చి 16న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించనున్నారు.














