- మహిళా సాధికారత దిశగా పరుగులు తీస్తోన్న ఏపీ
- లక్షమంది పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దిన కూటమి
- ఈ ఏడాది 5 లక్షలమందిని తీర్చిదిద్దాలన్న కొత్త సంకల్పం
- 50 కోట్ల ఉచిత ప్రయాణాల మైలురాయిని చేరిన ‘స్త్రీ శక్తి’
- అమరావతి పరేడ్‌గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- సంక్షేమం, అభివృద్ధి ప్రతిబింబించేలా కార్యక్రమాల నిర్వహణ
- సీఎం చంద్రబాబు సమక్షంలో వైభవోపేతంగా ఉమెన్స్ డే
- డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ పేరు, లోగో ఆవిష్కరించనున్న సీఎం
- వివిధ రంగాల్లో ప్రతిభా సాధకులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
అమరావతి (చైతన్య రథం): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సాహంతో నిర్వహించనుంది. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజధానిలోని అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రంగాల్లో సక్సెస్ అయిన మహిళలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. 20 నెలల కూటమి పాలనలో మహిళా సంక్షేమం, అభివృద్ధి, సాధికారతను వివరించేలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. మహిళలు, చిన్నారుల భద్రత మొదలుకుని వారి ఆర్థిక స్వావలంబన వరకు చాలా కార్యక్రమాలను అమలు చేసింది. రాష్ట్రంలో కీలకమైన పథకాల్లో మహిళలను భాగస్వాములను చేసింది. మహిళలకే ప్రాధాన్యత ఇచ్చింది. సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం, స్త్రీశక్తివంటి పథకాలు మహిళ కోసం రూపొందించినవే. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేస్తే… ఆ పథకాల అమల్లో స్త్రీశక్తి పథకం సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటివరకు 50 కోట్ల ఉచిత ప్రయాణాల మైలురాయిని ఈ పథకం చేరుకుంది.
సంక్షేమంలోనే కాదు… అభివృద్ధిలోనూ మహిళలకు భాగస్వామ్యం
మహిళలకు వివిధ సంక్షేమ పథకాలు అందించడంతోపాటు… రాష్ట్రాభివృద్ధిలోనూ కూటమి ప్రభుత్వం మహిళలను కీలక భాగస్వాములు చేసింది. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అతి కీలక నిర్ణయాల్లో వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రధానం. ఈ విధానంలోనూ మహిళలకు పెద్దపీట వేసింది కూటమి ప్రభుత్వం. లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని గత మహిళా దినోత్సవాన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాది గడిచేసరికి లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తల లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పుడు తాజాగా మరో 5 లక్షలమంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోనుంది. ఇవే అంశాలను సీఎం చంద్రబాబు సభలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో మహిళల్లో సాధికారత తెచ్చిన ముఖ్యమంత్రి… ఇప్పుడు డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయస్థాయి బ్రాండింగ్ కల్పించేలా గత కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్‌కు స్వయం పేరుతో బ్రాండింగ్ చేయాలని నిర్ణయించారు. అలాగే స్వయం లోగోను తీర్చిదిద్దారు. స్వయం బ్రాండ్ పేరు, లోగోలను ముఖ్యమంత్రి మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించనున్నారు.
కార్యక్రమం జరిగేదిలా…
ఆదివారం ఉదయం 11:30 గంటలకు అమరావతి పరేడ్ గ్రౌండ్స్ చేరుకుని.. ముఖ్యమంత్రి సుమారు నాలుగు గంటలపాటు జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జ్వోతి ప్రజ్వలన, మా తెలుగుతల్లి గీతాలాపనతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రత్యేక వీడియోలతోపాటు, లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తల సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలపై రూపొందించిన ప్రజెంటేషన్లను సీఎం చంద్రబాబు వీక్షిస్తారు. అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్కులను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు. కీలకోపన్యాసం అనంతరం వివిధ శాఖలకు చెందిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. చిరుధాన్యాల బండ్లు, ఎగ్ కార్ట్స్, ఫామ్ బజార్ వ్యాన్లువంటి వాటిని లబ్దిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత సీఎం చంద్రబాబు సమక్షంలో 36 ఎంవోయూలపై ఉన్నతాధికారులు సంతకాలు చేయనున్నారు. ఈక్రమంలో 5 కొత్త పథకాలను ప్రారంభించి, 7 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన ఫలకాలను సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. తర్వాత 50మంది మహిళా పారిశ్రామికవేత్తలు, ఆర్టీసీ మహిళా డ్రైవర్లు సహా వివిధరంగాల్లో సక్కెస్ అయిన మహిళా ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొని చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత, మహిళా సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, బీసీ సంక్షేమ మంత్రి ఎస్ సవిత సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గోనున్నారు.












