అమరావతి (చైతన్య రథం): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు దశలవారీగా అమల్లోకి వస్తున్నాయి. అందులో ఒకటి -స్త్రీ శక్తి పథకం. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పించారు. అయితే, ఈ పథకం అమలుతో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతున్నట్టు అధ్యయనం వెల్లడిస్తోంది. ఈమేరకు ప్రకాశం జిల్లా పోలీసులు ఒక అధ్యయన నివేదికను రూపొందించి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా ఉన్నతాధికారులతో ఈ అంశాన్ని వర్చువల్గా సమీక్షించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య జిల్లాలో గణనీయంగా తగ్గిందంటూ సీఎం చంద్రబాబు దృష్టికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తీసుకెళ్లారు. స్త్రీ శక్తి పథకం అమలుకు ఆరునెలల ముందు, తర్వాత పోల్చుకుంటే..శాతం మేర మరణాలు తగ్గినట్టు జిల్లా పోలీసులు ఇచ్చిన నివేదికలో పొందుపర్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా అధ్యయనం చేయించాలంటూ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గతంతో పోల్చుకుంటే ప్రకాశం జిల్లాలో10 శాతం మేర మరణాలు తగ్గినట్టు నివేదికలో వెల్లడైంది. దాంతో రోడ్డు ప్రమాదాలపై రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేయాలంటూ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.














