- చేనేతలకు మేలు చేసేది, అండగా నిలిచేది కూటమి ప్రభుత్వమే
- ఆర్థిక కష్టాలున్నా సంక్షేమం-అభివృద్ధిలో రాజీపడడం లేదు
- కుటుంబానికి ఇల్లు… రాష్ట్రానికి రాజధాని అవసరం
- మాది బ్రాండ్ ఇమేజ్… వాళ్లది బ్యాడ్ ఇమేజ్
- జెన్-జీ అభివృద్ధి కోరుకుంటోంది… జనరేషన్ గొడ్డలి కుట్రలు పన్నుతోంది
- 44 ఏళ్లు వస్తే వయసైపోయినట్టా?
- 12వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు
- చీరాలలో ‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభం
- కుటుంబానికి రూ.25 వేలు చొప్పున 71,536 కుటుంబాలకు రూ.179 కోట్లు జమ
చీరాల (చైతన్యరథం): బీసీల సంరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని… దీనికోసం త్వరలోనే చట్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని వెల్లడించారు. 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘నేతన్న సేవలో’ సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని అర్హులైన చేనేత కుటుంబాలకు రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. మొత్తంగా 71,536 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్లను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నా… రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం-అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీపడట్లేదని వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని అడ్డుకునేలా జరుగుతున్న కుట్రలపట్ల ప్రజలు అప్రమత్తతో ఉండాలని సూచించారు. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందని… ప్రజలు కూడా కుట్రలు పన్నే వారి నైజాన్ని గమనించాలని కోరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ‘స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకునేలా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మరపురాని రోజుగా ఉండాలనే ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు… చెప్పని వాటినీ అమలు చేస్తున్నామనడానికి ఈ పథకమే నిదర్శనం. చేనేత కేవలం ఒక వృత్తే కాదు… భారతీయ సంస్కృతికి ప్రతీక. దేశం గర్వించే కళ చేనేత. మన రాష్ట్రం అనేక చేనేత కళలకు నిలయం. అలాంటి వర్గానికి ఆసరాగా ఉంటున్నాం. చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, శ్రీకాళహస్తి, నరసాపురం… ఇలా రాష్ట్రంలో అనేక చేనేత ఉత్పత్తులు విశిష్ట గుర్తింపు పొందాయి. చేనేత రంగంపై ఆధారపడి 1.27 లక్షల మంది జీవిస్తున్నారు. నేతన్న సేవ పథకమే కాదు… ఇప్పటికే నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లకు ప్రయోజనం కలుగుతోంది. చేనేతలకు 50ఏళ్లకే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్ అందిస్తున్నాం. 85వేల మంది చేనేతలకు ఫించన్‌గా రూ.4వేల చొప్పున నెలకు రూ.35కోట్లు ఇస్తున్నాం. ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చు పెడుతున్నాం. రాష్ట్రంలోని 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా రూ.79 కోట్లు ఇచ్చాం. స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద రూ.10 కోట్ల వ్యయంతో 10 చేనేత క్లస్టర్లు ఆమోదం పొందాయి. హ్యాండ్లూమ్ మార్కెటింగ్ అసిస్టెన్స్ కార్యక్రమంతో నేత కార్మికులకు నేరుగా మార్కెట్ అవకాశాలు వచ్చాయి. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం కూడా వస్తోంది. విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది.” అన్నారు.
బీసీలకు అండగా…
“బీసీలకు కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తోంది. వారి సంక్షేమం కోసం పని చేయడంతో పాటు… రక్షణ కల్పించేందుకు చట్టం చేస్తున్నాం. దీని కోసం ముసాయిదా ఇప్పటికే సిద్ధమైంది. బీసీల సంక్షేమంలో భాగంగా వివిధ వర్గాలు అన్ని రకాలుగా అభివృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం. చేపల వేట నిషేధ సమయంలో 1.34 లక్షల మత్య్సకార కుటుంబాలకు రూ.20వేల చొప్పున రెండేళ్లలో రూ.505 కోట్లు ఇచ్చాం. వడ్డెరలకు మైనింగ్ లీజులు, గీత కార్మికులకు ఎక్సైజ్ షాపులు కేటాయించాం. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు బీసీలకు 3 కిలోవాట్లకు అదనంగా రూ.20వేలు సబ్సిడీ ఇస్తున్నాం. రాష్ట్రంలో అందరికీ రూ.2.5 లక్షల చొప్పున యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకువస్తున్నాం. అభివృద్ధితో పాటు సంక్షేమం, సుపరిపాలన అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. పేదలు భోజనానికి ఇబ్బందిపడకుండా రూ.5కే అన్న క్యాంటీన్లో భోజనం అందిస్తున్నాం. కొందరు వ్యక్తులు దీనికీ అడ్డంపడి అన్న క్యాంటీన్లను ఎత్తేశారు. విద్య అందరికీ అందాలన్న లక్ష్యంతో ‘తల్లికి వందనం’ పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ.. వారి తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాం. సంక్షేమంతో పాటు అభివృద్ధిపైనా శ్రద్ధ పెడుతున్నాం. గత పాలనలో రోడ్లన్నీ గుంతలే. మన రాష్ట్రాన్ని చూసి ఎగతాళి చేశారు… ఇప్పుడు రోడ్లకు మరమ్మతులు చేశాం. పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించాం… రూ.12 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయి. యువతకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నాం… అభివృద్ధి-ఉపాధి కల్పించేలా పారిశ్రామికాభివృద్ధి చేస్తున్నాం. రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు కూడా రాష్ట్రంలో నిర్మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గత పాలకుల నిర్వాకం వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా… గడిచిన రెండేళ్లలో పేదలను ఆదుకునేందుకు రూ.1.50 లక్షల కోట్లు సంక్షేమం చేశాం. అభివృద్ధి కోసం రెండేళ్లలో రూ.1.34 లక్షల కోట్లు ఖర్చు చేశాం. రోడ్లు సహా ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం.”అని ముఖ్యమంత్రి వివరించారు.
కుటుంబానికి ఇల్లు… రాష్ట్రానికి రాజధాని
“గత పాలనలో రాజధాని లేకుండా చేశారు… రాష్ట్రం పేరు చెప్తే ఇతర ప్రాంతాల్లో చులకన అయ్యేలా చేశారు. అద్భుతమైన నగరం ఉండాలనే అమరావతిని నిర్మిస్తున్నాం. రాజధానిపై గత పాలకులు నాలుక మడతపెట్టారు. మూడు ముక్కలాట ఆడారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. దేశంలో ఏ రాష్ట్రమైనా తమ రాజధాని నగరాలను ఘనంగా చెప్పుకుంటున్నాయి. గత పాలనలో రాజధానే లేకుండా పోయింది. కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి పనులు రీస్టార్ట్ చేశాం. ఆగస్టు 13న రాజధానిలోని ప్రధాన రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం అవుతుంది. వేగంగా జరుగుతున్న పనులు చూసి రాజధానిపై మళ్లీ కుట్రలు పన్నుతున్నారు. మావిగన్, వాటికన్ అంటూ ఏవోవో చెప్తున్నారు. మళ్లీ మూడు ముక్కలాట కావాలా…? రాజధానిని విధ్వంసం చేసుకుంటామా..? కుటుంబానికి ఇల్లు, రాష్ట్రానికి రాజధాని అవసరం. గత ప్రభుత్వం రాష్ట్ర పరువును తీసేసింది. ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీసింది. కూటమి వచ్చాక ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించాం. పెట్టుబడులు తీసుకువచ్చి పరిశ్రమల్ని ఏర్పాటు చేయిస్తున్నాం. వాళ్లది బ్యాడ్ ఇమేజ్… మాది బ్రాండ్ ఇమేజ్. కోర్టు కేసులు వేసి అడ్డుకున్నా మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు మళ్లీ పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. కోర్టు చీవాట్లు పెట్టినా… మళ్లీ ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తూ వేధిస్తున్నారు. జెన్-జీ యువత అభివృద్ధిని కోరుకుంటోంది. కానీ గొడ్డలి జనరేషన్‌కు చెందిన కొందరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. వీళ్లది గొడ్డలి జె. అభివృద్ధిని అడ్డుకునేలా చేసే అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. కఠిన చర్యలకు వెనుకాడం.” అని చంద్రబాబు చెప్పారు.
కుట్రలను గమనించాలి… కుట్రదారులను దూరంపెట్టాలి
“గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను, నేరాలు, ఘోరాలు చేసే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ కొందరు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. యాక్సిడెంట్ చేస్తే గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి… కానీ ఆధారాలు తారుమారు చేసేసి, వ్యక్తులను మార్చేసి కుట్రలు చేసి కేసు మాఫీ చేసేందుకు ప్రయత్నించారు. 44 ఏళ్ల వ్యక్తి చనిపోతే ఇబ్బందేమిటని మాట్లాడతారు. ఇదెక్కడి విడ్డూరం… ఇలాంటి వారిని ఏమనాలి..? పరామర్శల కోసం గంటల పాటు రోడ్లను నిర్బంధించి వెకిలి చేష్టలు చేస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడే మహిళా పోలీసు అధికారుల విషయంలోనూ అసభ్యంగా ప్రవర్తించారు. మహిళా పోలీసుల అధికారులను కూడా గొడ్డలి గ్యాంగ్ వేధిస్తోంది. పొగాకు రైతులను పలకరించేందుకు వెళ్లి అక్కడ అరాచకం సృష్టించారు. రౌడీయిజం చేస్తూ రప్పా రప్పా అంటూ రోడ్డుపైకి వచ్చి అడ్డంపడుతున్నారు. బ్రాందీ షాపుల్లో మద్యం తాగి బట్టలు విప్పి అరాచకం సృష్టిస్తున్నారు. గంజాయి బ్యాచ్ అంతా పొగాకు నాశనం చేసింది. వారికి రైతుల ఆవేదన పట్టడం లేదు. ఓ దుకాణాన్ని కూడా ధ్వంసం చేశారు. ఓ వ్యక్తి వీళ్ల కుమ్ములాటలో గాయపడి ఆస్పత్రిలో చనిపోయారు. సభ్యతగా వ్యవహరించాల్సిన కొన్ని రాజకీయ పార్టీలు అసభ్యంగా, బాధ్యతా రాహిత్యంతో ప్రవర్తిస్తున్నాయి. గత పాలనలో అంతా అరాచకం రాజ్యమేలింది. ఇప్పుడు ప్రజలకు ఆ పరిస్థితి లేదు. కుట్రలను ప్రజలు గమనించాలి… కుట్రదారులను దూరం పెట్టాలి. ప్రజలు చైతన్యంతో వ్యవహరించాలి.” అని సీఎం కోరారు.
‘మినీ ముంబై’ చీరాలకు పూర్వవైభవం తెస్తాం
“చీరాల పేరు వింటేనే ఇక్కడి నేతన్నల నైపుణ్యం గుర్తుకు వస్తుంది. చీరాల పట్టు, కాటన్ చీరలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. చీరాల ఖర్చీఫ్‌లు ఒకప్పుడు విదేశాలకు భారీగా ఎగుమతి అయ్యేవి. చేనేత ఉత్పత్తుల్లో ఒకప్పుడు ‘మినీ ముంబై’గా పేరొందిన చీరాలకు పూర్వ వైభవం తెస్తాం. పర్యాటకుల్ని ఆకట్టుకునేలా సూర్యలంక, బాపట్ల, చీరాల సముద్ర తీర ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నాం. స్వదేశ్ దర్శన్ నిధులు రూ.97 కోట్లతో సూర్యలంక నుంచి చీరాల వరకు పర్యాటక కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం.” అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రసంగం అనంతరం బాపట్ల జిల్లాలో వివిధ శాఖలకు చెందిన అధికారుల పనితీరుపై తన వద్దనున్న నివేదికను ప్రజలకు చదివి వినిపించారు. చక్కగా పనిచేసిన వారిని ప్రజలు అభినందించాలని సూచించారు. సంతృప్తికరంగా పని చేయని అధికారులను పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ స్టాళ్లను సందర్శించారు. సీబీఎన్ జీవిత చరిత్రను ఆవిష్కరిస్తూ మహతి అనే యువతి 40 పెన్సిళ్లతో రూపొందించిన మైక్రో ఆర్ట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. బాపట్ల, సూర్యలంక సహా జిల్లాలోని వివిధ బీచ్ ల సమాచారాన్ని ప్రజలకు అందించేలా రూపొందించిన బే ఆఫ్ బాపట్ల వెబ్‌సైట్, హ్యండ్ బుక్‌లను సీఎం విడుదల చేశారు. బాపట్ల లీప్స్ పేరుతో వివిధ రంగాల్లో యువతకు అందించే శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేనేతరంగ అభివృద్ధికి సంబంధించి ఫ్యాబ్ ఇండియా సహా నాలుగు సంస్థలతో సీఎం చంద్రబాబు సమక్షంలో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, బాపట్ల జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.














