- పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ప్రాధాన్యత
- నెలవారీ లక్ష్యాలతో ప్రాధాన్యతా ప్రాజెక్టులు పూర్తి
- డేటా సెంటర్లకు నీటి సరఫరాపై దుష్ప్రచారం
- అన్నమయ్య ప్రాజెక్టు ఆయకట్టుకు నీరిచ్చే అంశంపై అధ్యయనం
- జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం లోటు వర్షపాతం పరిస్థితుల నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వలను, భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సీఎం జలవనరుల శాఖపై సమీక్షించారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల్లో పనుల పురోగతి, ప్రాధాన్యతాక్రమంలో చేపట్టనున్న 36 ప్రాజెక్టులు, రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల, తాగు నీటి సరఫరా నిర్వహణ ప్రణాళిక, జలధార-జలహారతి కార్యక్రమాల అమలుపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం
ప్రాజెక్టులో ఇప్పటివరకు 89.9 శాతం మేర సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. పోలవరం ఎడమ కాలువ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు జలవనరుల శాఖ సీఎంకు తెలియజేసింది. ఈసీఆర్ఎఫ్ గ్యాప్-1, గ్యాప్-2 పనులను శరవేగంగా చేపట్టామని వివరించారు. ఇటీవల గోదావరికి 14లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినా ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించినట్టు తెలిపారు. డ్యామ్ సైట్ వద్ద రహదారులతో పాటు డ్యామ్ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల పనులు కూడా చేపట్టాలని సీఎం సూచించారు. ప్రాజెక్టు సమీపంలో గండి పోశమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ స్థానికుల సెంటిమెంట్ను కాపాడేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చికల్లా విశాఖ వరకు ఎడమ కాలువ బ్యాలెన్సు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈలోగా అనకాపల్లి వరకు ఉన్న నీటి వనరులు, రిజర్వాయర్లు, చెరువుల్లో నీటిని నింపాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పోలవరం కుడి, ఎడమ కాలువల్లో 17,500 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అనుగుణంగా పనులు చేయాలని స్పష్టం చేశారు. రెండు కాలువలకూ మంచి పేర్లు సూచించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని ప్రాంతాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు పర్యాటకంగానూ తీర్చిదిద్దాలన్నారు.
డేటా సెంటర్లకు 3.5 టీఎంసీల నీరు చాలు
డేటా సెంటర్లకు నీటి అవసరాలపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని.. మొత్తంగా వాటికి 3.5 టీఎంసీల నీరే సరిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం పరిస్థితుల నేపథ్యంలో
తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని… ఆ తదుపరి పారిశ్రామిక అవసరాలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ సీజన్లో ఆరుతడి
పంటలు సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగేలా ‘జలధార-జలహారతి’
పనులను కొనసాగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పుష్కలంగా నీటి వనరులు ఉన్న రాష్ట్రంగా గోదావరి నీటిని అటు ఉత్తరాంధ్రకు, ఇటు కృష్ణా డెల్టా ప్రాంతానికి అవసరమైనంత మేర నీరు తీసుకునే ఆస్కారం ఉందన్నారు. విశాఖ నుంచి అమరావతి దాకా అంతర్గత జలరవాణా మార్గాలతో అనుసంధానించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జలవనరుల శాఖ ఆధీనంలో ఉన్న భూములను సద్వినియోగం చేసుకునే అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంతో పాటు నిర్వాసితుల సమస్యలను కూడా మానవతా దృక్పథంతో పరిష్కరించాలన్నారు. 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. దీనికోసం నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు దిగువున ఆయకట్టుకు నీరిచ్చే అంశాన్ని కూడా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.













