- వర్షాభావ పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలి
- పంటల రక్షణకు బీమా నమోదు తప్పనిసరి
- నమోదులో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి
- పోలవరం, పట్టిసీమతో నీటి భద్రత కల్పిస్తాం
- 36 ప్రాజెక్టులకు రూ.35,555 కోట్లు కేటాయింపు
- శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఎల్‌నినో ప్రభావంపై పంచ సూత్రాల ప్రకటన
అమరావతి(చైతన్యరథం): ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని, రైతులు పంటల ఎంపిక తో పాటు నీటి వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పంటలకు ఆర్థిక రక్షణ ఉండాలంటే బీమా నమోదు చేయించుకోవాలని, అన్ని పంటల కూ బీమా చేయించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచిం చారు. పంటల బీమా నమోదుకు ఈ నెలాఖరు వరకూ గడువు ఉందని గుర్తు చేశారు. కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున వరి సాగు చేయవద్దని, ఉద్యాన, వర్షాభావ పంటలను రక్షించు కునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులను ముఖ్యమంత్రి కోరా రు. ఎల్‌నినో ప్రభావంపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఎల్‌నినోపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పంచసూత్రాలు రూపొందించామని తెలిపారు. రైతన్న మీకోసం యాక్షన్ కమిటీలు, పంటల బీమా నమోదు, హైరిస్క్ ప్రాంతాల్లో పశుగ్రాసం విత్తనాలు వేయడం, జలధార-2, రైతుల ఇబ్బందులను కనిష్ట స్థాయికి తగ్గించి జీఎస్‌డీపీ లక్ష్యాన్ని చేరడం ఇందులో భాగమన్నారు. ఎల్‌నినో కోసం షార్ట్‌టర్మ్ ప్లానింగ్ సిద్ధం చేసుకున్నామని, పంటల పరిరక్షణ, సమర్థ నీటి నిర్వహణ, సేంద్రీయ సాగుపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.
ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాభావం
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. సాధారణ వర్షపాతం కంటే తీవ్రమైన లోటు కనిపిస్తోందని, అసెంబ్లీ వేదికగా ఎల్‌నినోపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవస రం ఉందన్నారు. 2026 జూన్-డిసెంబర్ మధ్య 867 మి.మీ. వర్షపాతం పడాల్సి ఉండగా 557 మి.మీ. మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. జులైలో కొన్ని జిల్లాల్లో 68 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ఆగస్టు, సెప్టెంబర్‌లో 35 శాతం చొప్పున, అక్టోబర్‌లో 25 శాతం, నవం బర్‌లో 20 శాతం లోటు ఉండవచ్చన్నారు. డిసెంబర్‌లో మాత్రం ఒక శాతం అదనపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
శ్రీశైలానికి నీటి కొరత.. 214 టీఎంసీలే రాక
వివిధ బేసిన్లలో జలాల లభ్యత తగ్గిపోతోందని తెలిపారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీరు అడుగంటుతోందన్నారు. శ్రీశైలా నికి 753 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా ఈసారి 214 టీఎంసీలు మాత్రమే వచ్చిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర రిజర్వాయర్లు నిండిన తర్వాతే మన రాష్ట్రానికి నీరు వస్తుందని, దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు నీటి రాక తగ్గుతోందన్నారు. కావేరి జలాలపై తమిళనాడు-కర్ణాటక మధ్య వివాదంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుందని గుర్తుచేశారు. గ్రామాల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కూడా నీటి సమస్యలు వస్తున్నా యని చెప్పారు.
గోదావరిలోనూ తగ్గిన నీటి లభ్యత
గోదావరి బేసిన్‌లోనూ నీటి లభ్యత తక్కువగా ఉందన్నారు. కాటన్ బ్యారేజీకి 2,557 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా 1,071 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయని చెప్పారు. కృష్ణాతో పోలిస్తే గోదావరిలో కొంత మేర నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందని, అందుకే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించామని వివరించారు. గత రెండేళ్లలో సమర్థ నీటి నిర్వహణతో సుమారు 552 టీఎంసీల నీటిని పొదుపు చేయగలి గామని, అదే ఇప్పుడు శ్రీరామరక్షగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రధాన రిజర్వాయర్లలో 586 టీఎంసీల నీరు ఉందని, భూగర్భ జల మట్టాలు కూడా తగ్గుతున్నాయని చెప్పారు. గోదావరి బేసిన్‌లో తప్ప ఎక్కడ పంటలు వేసినా ఇబ్బందులు తప్పవు. దీన్ని ప్రతిఒక్కరూ గమనించాలి.. సహకరించాలి. క్షేత్రస్థాయిలో పొదు పు నీటిని వాడుకోకుంటే కష్టాలు వస్తాయని హెచ్చరించారు.
కృష్ణాలో వరి వద్దు.. వర్షాభావ పంటలకే ప్రాధాన్యం
కృష్ణా, పెన్నా బేసిన్లలో నీటి లభ్యత తక్కువగా ఉంటుందని సీఎం తెలిపారు. గోదావరిలో కొంతమేర పరిస్థితి బాగున్నా అక్కడ కూడా సమర్థ నీటి నిర్వహణ అవసరమన్నారు. విడుదల చేసిన నీటిని సద్వినియోగం చేసుకోవాలని, తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, పరిశ్రమలకు నీరు అందించాలని సూచించారు. ఉద్యా న, వర్షాభావ పంటలు మాత్రమే సాగు చేయాలని చెప్పారు. పులిచింతలలో నీళ్లు అడుగంటిపోయాయి. గోదావరి జలాలు నిలిచిపోతే ఇబ్బందులు వస్తాయి. కృష్ణాలో వరి వేయొద్దు” అని సీఎం స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని రైతులకు వివరించాలని సూచించారు. కృష్ణా డెల్టా సహా ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, చెన్నై వరకు 121.4 టీఎంసీల నీరు అవసర మవుతుందని చెప్పారు.
పంటల విస్తీర్ణంలో మార్పులు
ఎల్‌నినో ప్రభావం పంటలపైనే కాకుండా ద్రవ్యోల్బణంపైనా పడుతోందని తెలిపారు. దేశ సగటుతో పోలిస్తే ఏపీకి నాలుగు రెట్లు తక్కువ వర్షపాతం పడుతోందన్నారు. నీటి నిర్వహణతో కొంత మేర పంటలను కాపాడుతున్నప్పటికీ పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు. వరి విస్తీర్ణం 1.14 లక్షల హెక్టార్ల మేర తగ్గిందని, పప్పుధాన్యాలు మినహా మొక్కజొన్న, వేరుశనగ, చిరుధాన్యాల విస్తీర్ణం కూడా తగ్గిందన్నారు. సీమలో స్వీట్ ఆరెంజ్, బత్తాయి, యాసిడ్ లైమ్, మామిడి పంటలపై ప్రభావం పడుతుందని చెప్పా రు. దక్షిణాంధ్రలో అరటి, మిరప విస్తీర్ణం తగ్గుతోందని, ఉత్తరాం ధ్రలో జీడిమామిడి, కొబ్బరి తోటలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అవసరమైతే పంటలను కాపాడేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తామని, డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రాధా న్యం ఇస్తామని చెప్పారు. మిరప ఉత్పత్తిని తగ్గించమని కోరామని, ఆయిల్‌పామ్ సాగుకు ఇబ్బంది ఉండకపోవచ్చని చెప్పారు.
పంటల బీమాకు రికార్డు దరఖాస్తులు
గత ప్రభుత్వం పంటల బీమాకు ప్రభుత్వ వాటా చెల్లించక పోవడంతో కూటమి ప్రభుత్వమే చెల్లించింది. గతేడాది 19.50 లక్షల మంది బీమా నమోదు చేసుకోగా.. ఈ ఏడాది 35.17 లక్షల దరఖాస్తులు వచ్చాయి. నాన్‌లోనీ నమోదు గత ఖరీఫ్‌లో 2 లక్షలు ఉండగా ఈసారి పది రెట్లు పెరిగి 20.35 లక్షలకు చేరింది. గతేడాది 7.83 లక్షల హెక్టార్లు పంట బీమా పరిధిలో ఉండగా.. ఈ ఏడాది 15.17 లక్షల హెక్టార్లు బీమా పరిధిలోకి వచ్చాయని చెప్పారు. మొత్తంగా రూ.13,983 కోట్ల బీమా చేయగలిగామని, ఇది దేశంలోనే ఐదో స్థానమని తెలిపారు. అన్ని పంటలకు బీమా చేయించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని, ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నందున రైతులందరూ బీమా నమోదు చేసుకోవాలని సూచించారు.
సమర్ధ నీటి నిర్వహణకు ఈసీ
సమర్థ నీటి నిర్వహణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలను సిద్ధం చేయాలన్నారు. జలధార ద్వారా నీటి సంరక్షణ చర్యలు చేపట్టామని, ఎల్‌నినో లాంటి పరిస్థితులు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ఆరఎస్‌కేల స్థాయిలో నీటి నిర్వహణ, ఎల్‌నినోపై రైతుల అప్రమ త్తతకు చర్యలు తీసుకుంటున్నామని, మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్స హిస్తున్నామని తెలిపారు. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ మోడల్ విధానం తారక మంత్రమని, వర్షాభావ పరిస్థితుల్లో ఈ విధానం ద్వారా ఇబ్బందులను తగ్గించవచ్చని చెప్పారు. పట్టిసీమ ఎందుక ని, నీళ్లను ఎక్కడ పెట్టుకుంటారని నాడు ప్రశ్నించారని గుర్తుచేశారు. పులిచింతల, సాగర్, శ్రీశైలం జలాలను సద్వినియో గం చేసుకునేందుకు పట్టిసీమ అవసరమని అప్పుడే చెప్పామని అన్నారు. పట్టిసీమ ద్వారా ఇప్పటివరకు 500 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకొచ్చామని, 13 లక్షల ఎకరాలకు పైగా ఉన్న కృష్ణా డెల్టా ఆయకట్టుకు పట్టిసీమ కీలకంగా మారిం దన్నారు. మరో 40 టీఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా తరలిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
36 ప్రాజెక్టులకు రూ.35,555 కోట్లు
36 ప్రాజెక్టులను రూ.35,555 కోట్లతో నిర్మించేందుకు ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. ఇవి పూర్తయితే 19.16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందుతుందని, మరో 9 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ చేయవచ్చన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమయ్యే ప్రాజెక్టు కాదన్నారు. పోలవరంతో గోదావరి జలాలను అనకాప ల్లికి తీసుకువస్తున్నామని, ఎడమ కాల్వ పనులు వేగంగా జరుగు తున్నాయని చెప్పారు. వేయి టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలుస్తోందని, వృథాగా పోతున్న నీటిలో 30-40 టీఎంసీలను విశాఖకు తీసుకురావడం కష్టం కాదన్నారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు, డేటా సెంటర్లకు నీరు అందిస్తామని చెప్పారు.
వెలిగొండతో 30 ఏళ్ల కల సాకారం
వెలిగొండ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. 30 ఏళ్ల చిరకాల కోరికను తీర్చబోతున్నామని చెప్పారు. కరవు ప్రాంతమైన మార్కాపురం జిల్లాను కాపాడుతామన్నారు. పోలవరం పూర్తయితే కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని డ్రా చేసుకోవచ్చన్నారు. హంద్రీ-నీవా కాల్వల విస్తరణ పనులను 100 రోజుల్లో పూర్తి చేశామని తెలిపారు. 2014-19 మధ్య ఇరిగేషన్ కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు చేశామని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రూ.20 వేల కోట్ల కంటే తక్కువే ఖర్చు చేసిందని, దీంతో ఇరిగేషన్ దెబ్బతిందని సీఎం విమర్శించారు. 2028 డిసెంబర్ నాటికి ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ఏడాది 20 వేల గోకులం షెడ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని సీఎం తెలిపారు. డెయిరీ రంగంలో ఉత్పత్తి పడిపోకుండా చూడాలని, పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డెయిరీ రంగంపై అనేక మంది ఆధారపడి ఉన్నందున దాన్ని కాపాడుకో వాల్సిన అవసరం ఉందన్నారు. ‘రైతన్న మీ కోసం’ పేరుతో స్థానిక కమిటీలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఉన్న వారందరినీ భాగస్వా ములను చేశామని చెప్పారు. ఈ ఏడాది ఎల్‌నినోను ఎదుర్కోవ డంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు వచ్చినా శాశ్వతం గా ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలి. నీటిని పొదుపుగా వినియో గించడం, సరైన పంటలను ఎంచుకోవడం, ప్రతి పంటకు బీమా చేయించడం, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు.













