- గత ప్రభుత్వంలో అడ్డగోలు దందాలు జరిగాయి..
- ఐదేళ్లు ఎక్సైజ్ శాఖను దోపిడీ కేంద్రంగా మార్చారు
- దందాకోసం కల్తీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దారు
- కల్తీ మద్యంతో వేల కోట్లు దోచుకున్న ఘనత వాళ్లదే
- కూటమి వచ్చిన తరువాతే పరిస్థితులను చక్కదిద్దాం
- మద్యం అక్రమ రవాణాపై ప్రశ్నకు మంత్రి కొల్లు సమాధానం
అమరావతి (చైతన్య రథం): దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని, ఏ పాలకుడూ ఆలోచించలేని దుర్మార్గ ఆలోచనతో ప్రజల నెత్తిన కల్తీ మద్యం రుద్ది జేబులు నింపుకున్న నాయకుడు జగన్‌రెడ్డి అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. 2019-24 మధ్యకాలంలో ఇతర రాష్ట్రాల నుండి మద్యం అక్రమంగా రవాణా, వాహనాల స్వాధీనం గురించి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కల్తీ మద్యం వ్యవహారం వెనుక కింగ్‌పిన్ వెనకున్న కింగ్ ఎవరో బయట పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. అదే సమయంలో మద్యం తయారీ కంపెనీల నుంచి కమిషన్ల రూపంలో మద్యం కేసుపై రూ.250, బీరు కేసుపై రూ.150 తీసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. నాసిరకమైన మద్యం కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరిగిందని, ఆ సమయంలో వేలాది వాహనాలు సీజ్ చేశారన్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదానికి అమాయక ప్రజలకు చెందిన వాహనాలు సీజ్ చేయబడ్డాయి. ప్రధానంగా ఆటోలాంటి వాహనాలను విడుదల చేసి వారి జీవనోపాధి కాపాడాలని సూచించారు.
మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. “గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలతో మద్యం వ్యాపారం మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. సంపూర్ణ మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి.. దశలవారీ మద్య నిషేధం అన్నారు. ధరలు పెంచితే వినియోగం తగ్గుతుందనే వింత వాదన తీసుకొచ్చి అడ్డగోలుగా ధరలు పెంచారు. తర్వాత మద్యం వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తుల్ని వ్యాపారంలోకి తీసుకొచ్చారు. అప్పటి వరకు ఉన్న బ్రాండ్లను తరిమేసి సొంత బ్రాండ్లను తీసుకొచ్చి, వాటినే అమ్మేలా ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపులు ఏర్పాటు చేశారు” అని దుయ్యబట్టారు.
“నాణ్యమైన మద్యం అందుబాటులో లేకపోవడం, ధరలు భారీగా పెరగడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగింది. మరోవైపు నాటు సారా తయారీ కూడా పెరిగింది. ఫలితంగా జంగారెడ్డిగూడెంలో 22మంది యువకులు బలైపోయారు. లక్షలాది మంది కిడ్నీ, లివర్ వ్యాధులతో ఇప్పటికీ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గత ప్రభుత్వ హాయంలో సుమారు రూ.3500 కోట్లకు పైగా మద్యం కుంభకోణం జరిగిందని, ఆ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. మద్యం కుంభకోణం మొత్తాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్వేతపత్రం రూపంలో విడుదల చేశాం” అని గుర్తు చేశారు. ప్రభుత్వ షాపుల పేరుతో ఖజానాకు చేసిన నష్టాన్ని స్పష్టంగా పేర్కొన్నామన్నారు.
“కూటమి అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ ప్రకటించాం. నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచడంతో పాటుగా, పాత బ్రాండ్లను పునరుద్దరించాం. పైగా ప్రతి మద్యం బాటిల్‌ను 13 రకాలుగా పరీక్షిస్తున్నాం. డిస్టిలరీల నుంచి షాపుల్లోకి వచ్చే ప్రతి బాటిల్ ట్రాక్ అండ్ ట్రేస్ విధానంతో ట్రాక్ చేస్తున్నాం. ధరలను కూడా పొరుగు రాష్ట్రాలతో సమానంగా చేశాం. ఫలితంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అక్రమ రవాణా తగ్గడంతో పాటు.. పొరుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో మద్యం అమ్మకాలు పెరిగాయి. నవోదయం 2.0 కార్యక్రమంతో నాటు సారాను పూర్తిగా నిర్మూలించాం” అని వివరించారు. కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న మద్యంపై ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారు చేసి ప్రభుత్వంపై నిందలేసేందుకు వైసీపీ ప్రయత్నించిందని, ఈ కేసుల్లో ఏకంగా గతంలో మంత్రులుగా పని చేసిన వారే ప్రత్యక్ష పాత్ర పోషించడం సిగ్గుచేటని మంత్రి కొల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 జూన్ 1నుండి 2024 జూన్ 30 మధ్యకాలంలో 29 కల్తీ మద్యం కేసులు నమోదు చేయగా, 191మందిని అరెస్టు చేసి 9055 లీటర్ల కల్తీ మద్యం, 2465 లీటర్ల స్పిరిట్, 34 వాహనాలు సీజ్ చేశామన్నారు. 31,057 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం కేసులు నమోదుచేసి 5,81,963 లీటర్ల మద్యం, 10,239 వాహనాలను సీజ్ చేశామన్నారు. 2019 జూన్ 1నుండి 2026 జనవరి వరకు 26,846 వాహనాలు స్వాధీనం చేసుకోగా అందులో 4358 వాహనాలను విడుదల చేశామన్నారు. 18,047 వాహనాలు వేలం వేశామని, ఇంకా 4441 వాహనాలను త్వరలో విడుదల చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు.













