* టూరిజం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
అఖండ గోదావరిలో భాగంగా ప్రణాళిక
* ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష పాల్గొన్న అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు
అమరావతి(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ జీవనాడి,బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి పర్యాటక శోభను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. పోలవరం డ్యామ్తో పాటు గోదావరి నదీ తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు ప్రాంతంతో పాటు ప్రాజెక్టు దిగువన, ఎగువన టూరిజం డెవలప్మెంట్కు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ అంశంపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్, టూరిజం శాఖ అధికా రులతో పాటు ఏజెన్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవా రం రాత్రి సమావేశమయ్యారు. నదీతీరం వెంట టూరిజం ప్రాజె క్టులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రాజెక్టు వద్ద కేబుల్ బ్రిడ్జ్ డిజైన్, స్పిల్ వే బ్యూటిఫికేషన్ సహా మాస్టర్ ప్లాన్పై చర్చించారు. టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధిలో అనుభవం ఉన్న నిప్పాన్ కోయి సంస్థ ప్రతినిధులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలో నదికి ఇరు వైపులా పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటుపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు ఎగువున భద్రాచలం సమీపం వరకు ఏపీ భూభాగంలో టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమృద్ధిగా నీటి వనరులు, పచ్చని కొండలు, అటవీ ప్రాంతాలతో మంచి పర్యాటక ప్రాంతంగా పోలవరం మారుతుందని భావిస్తున్నారు. ఎకో టూరిజం, రాక్ క్లైంబింగ్, వెల్నెస్ సెంటర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి వాటికి అనుకూలంగా మార్చాలని సూచించారు. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా పర్యాటక రంగంలోనూ పోలవరాన్ని ప్రత్యేకంగా నిలపాలని పేర్కొన్నారు.
నిప్పాన్ కోయి సంస్థ ప్రతిపాదనలు
ఇంజనీరింగ్ టూరిజం, రివర్ ఫ్రంట్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం డెవలప్మెంట్కు ఈ ప్రాంతం అత్యంత అనుకూలమన్న ఏజెన్సీ.. వాటర్ స్పోర్ట్స్ కు సమృద్ధిగా అవకాశాలు ఉన్నాయని వివరించింది. స్పిల్ వే దిగువన నది మధ్యలో 500 ఎకరాల ఐ లాండ్ స్థలాన్ని అభివృద్ధి చేసే విషయంలో పలు డిజైన్ల ప్రతిపాదనలను అందించారు. అలాగే మధ్యలో ఉండే వాటర్ బాడీలు, కొండలను పర్యాటక ప్రాంతాలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలను సంస్థ ప్రతి నిధులు వివరించారు. స్పిల్ వే దిగువన కేబుల్ బ్రిడ్జ్ డిజైన్లపైనా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐలాండ్గా ఉన్న ప్రాంతంతో పాటు చుట్టుపక్కల మొత్తం 1,500 ఎకరాల్లో తీసుకురాదగిన ప్రాజెక్టులపై నిప్పాన్ కోయి సంస్థ ప్రజెంటేషన్లో పలు ప్రతిపాదనలు చేసింది. ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడంతోపాటు.. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, స్థానికంగా ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజెంటేషన్ సందర్భంగా పలు సూచనలు చేశారు. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యాటక ప్రాజెక్టులు తీసుకువస్తామని స్పష్టం చేశారు. అధికారులు ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్, అధికారులు పాల్గొన్నారు.















