- రూ.18 కోట్లతో 5.9 ఎకరాల్లో వెజిటబుల్ మార్కెట్ నిర్మాణం
మంగళగిరి (చైతన్య రథం): విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. పారిశ్రామిక పురోగతికి, మౌలిక వసతుల కల్పనకు ఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ప్రజాదరణతోపాటు పరిపాలనా దక్షత తోడవడంతో మంగళగిరి నియోజకవర్గం సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళగిరి ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంగళగిరి పట్టణంలోని నిడమర్రు రైల్వే గేట్ వద్ద మోడల్ రైతుబజార్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఆధునిక హంగులతో చేపట్టే రిటైల్ అండ్ హోల్ సేల్ వెజిటబుల్ మార్కెట్ నిర్మాణ పనులకు గురువారం మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.
రూ.18 కోట్లతో 5.9 ఎకరాల్లో నిర్మాణం
మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న మోడల్ రైతు బజార్‌ను 5.9 ఎకరాల విస్తీర్ణంలో రూ.18 కోట్ల అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎసఆర్ నిధులతో నిర్మించనున్నారు. ఆధునిక సౌకర్యాలతో పరిశుభ్రంగా, వినియోగదారులకు అనుకూలంగా, పర్యావరణహితంగా ఉండేలా ఈ రిటైల్, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌ను నిర్మించనున్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 71,925 చదరపు అడుగులుగా ఉండనుంది. రిటైల్ మార్కెట్‌లో కూరగాయల విక్రయాల కోసం 102 స్టాళ్లు, పండ్లు, పూల విక్రయాల కోసం 54 ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇతర రకాల వస్తువుల కోసం మొత్తం 60 షాపులు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా హోల్‌సేల్ మార్కెట్‌లో అన్ లోడింగ్ ప్లాట్ ఫామ్స్ 18, కూరగాయల షాపులు 23 ఉండనున్నాయి. 61.4 చ.మీల విస్తీర్ణంలో కోల్డ్ స్టోరేజీ, వెజిటబుల్ వాష్ ఏరియాస్, 144.6 చ.మీ విస్తీర్ణంలో అడ్మిన్, మెయింటెనెన్స్ ఏరియాస్, 190 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్యాంటీన్, ప్రజల కోసం 130 చ.మీల విస్తీర్ణంలో మరుగుదొడ్లు నిర్మించనున్నారు. సరుకులు తరలించే వాహనాలు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ కోసం పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. వాటర్ సంప్, ఓవర్ హెడ్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్, ట్రాన్స్ ఫార్మర్, జనరేటర్, గార్బేజ్ కలెక్షన్, ఆర్గానిక్ కన్వర్టర్, టెర్రస్ సోలార్ ఎనర్జీ ప్యానల్స్‌వంటి సదుపాయాల కోసం ప్రత్యేక స్థలం కేటాయించడం జరిగింది.













