- ఆర్ధిక నేరాల అడ్డుకట్టకు బ్యాంకుల ప్రత్యేక ఎస్వోపీ
- రుణాల మంజూరులో ఎంఎసఎంఈ రంగానికి ప్రాధాన్యత
- విద్యా రుణాలకు అదనంగా 4శాతం వడ్డీ రాయితీకి నిర్ణయం
- 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు
- 2026-27 ఏపీ వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసిన ముఖ్యమంత్రి
అమరావతి (చైతన్య రథం): డిజిటల్ ఆర్ధిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ఎస్వోపీని రూపొందించాలని సూచించారు. సచివాలయంలో 235 రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో వివిధ రంగాలకు రూ.8.10 లక్షల కోట్ల మేర రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయం సహా ప్రాధాన్యతా రంగాలకు రూ.5.4 లక్షల కోట్లు, ఇతర రంగాలకు రూ.2.70 లక్షల కోట్లను ఇవ్వాలని ప్రణాళిక చేశారు.
ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి రూ.3.60 లక్షల కోట్లు, పంట రుణాల కింద రూ.2 లక్షల కోట్లు ఇవ్వాలని బ్యాంకులు నిర్ణయించాయి. వ్యవసాయ యాంత్రీకరణ రూ.10,693 కోట్ల మేర ఆర్ధిక సహకారం అందించాలని రుణ ప్రణాళికలో పేర్కొన్నాయి. ఎంఎసఎంఈ రంగానికి రూ.1.55 లక్షల కోట్లు, మైక్రో ఎంటర్ ప్రైజెస్ కోసం రూ.70 వేల కోట్లు, గృహనిర్మాణానికి రూ.11,500 కోట్లు, విద్యా రుణాలకు రూ.2,500 కోట్లు కేటాయిస్తున్నట్టు రుణ ప్రణాళికలో వెల్లడించాయి. 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. “ఎంఎసఎంఈలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ రంగానికి బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలి. కేంద్రం కూడా ఆటోపైలట్ మోడ్‌లో రుణాలు ఇవ్వాలని చెబుతోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లు, ఆవిష్కరణలు వస్తున్నాయి. అర్హులైన వారికి రుణాలు ఇవ్వటంలో బ్యాంకులు ముందుకు రావాలి. దేశానికి ప్రత్యేక యూనికార్న్ సంస్థలు అవసరం అవుతాయి. వయబిలిటీ- సస్టెయినబిలిటీ అనేది వ్యాపార సంస్థలకు అత్యంత కీలకం.
బ్యాంకులకు పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రుణ వితరణ, ఎన్పీఏలపై బ్యాంకర్లు- అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటాం. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా పెద్దఎత్తున వ్యాపార వేత్తలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆక్వా రంగానికి కూడా బ్యాంకులు ప్రోత్సాహకం ఇవ్వాలి. వీటి ద్వారా సంపద సృష్టించేందుకు అస్కారం ఉంటుంది. సబ్సీడీపై 200 మెకనైజ్డ్ బోట్ల కొనుగోలుకు సంబంధించి కూడా బ్యాంకులకు ప్రతిపాదనలు ఇచ్చాం. డిజిటల్ ఆర్ధిక నేరాల్లో బాధితులు సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణం స్పందించాలి. నేరస్తులను పట్టుకోవటం ఆలస్యం అవుతోంది. బ్యాంకులు సెంట్రల్ ట్రాన్సాక్షన్ మోనిటరింగ్ సెల్స్‌ను ఏర్పాటు చేసి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌ను నియంత్రించాలి. డిజిటల్ అరెస్టు పేరిట చదువుకున్నవారు కూడా పెద్ద మొత్తంలో నగదు కోల్పోతున్నారు. ఏపీలో గడచిన మూడు నెలల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఈ డిజిటల్ ఫ్రాడ్‌లో నగదు కోల్పోయారు. ఈ నేరాలను విశ్లేషించి తగిన ఎస్వోపీని చేపట్టాలి. ఈ నేరాలపై ప్రజలను చైతన్య పరిచేలా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టాలి” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
విద్యా రుణాల వడ్డీపై 4 శాతం అదనంగా రాయితీ
“విద్య రుణాలపై వడ్డీలో 4 శాతం రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పీఎం విద్యానిధి స్కీమ్‌కు అనుబంధంగా కార్యక్రమం చేపట్టాలని ఆలోచన చేస్తున్నాం. దేశ, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్ధులకు వెసులుబాటు కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నాం. పునరుత్పాదక ఇంధనానికి కూడా రుణ మంజూరీ బాగా పెంచాల్సిన అవసరం ఉంది. పీఎం సూర్యఘర్ కింద 10 లక్షల కుటుంబాలకు పథకాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పీఎం విశ్వకర్మలాంటి కేంద్ర పథకాలకు బ్యాంకులు పూర్తిగా సహకారాన్ని అందించాలి. బ్యాంకర్లు- ప్రభుత్వ విభాగాల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలి. ప్రైవేటు బ్యాంకులు కూడా స్టాండప్ ఇండియాలాంటి పథకాలను అమలు చేసేలా లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయాలి. బ్యాంకులు సామాజిక బాధ్యతగా లబ్దిదారులను ఆదుకోవాల్సిందే. డైరీ, ఆక్వాకల్చర్, కోల్డ్ చైన్‌లాంటి వివిధ రంగాలు వృద్ధి చెందేలా రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధనలో బ్యాంకర్లు సహకారం అందించాలి. జిల్లా కలెక్టర్లు కూడా స్థానిక అవకాశాలను లబ్దిదారులు అందిపుచ్చుకునేలా బ్యాంకర్లతో మాట్లాడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలాంటి వెనుకబడిన వర్గాల లబ్దిదారులకు పూర్తి ఆర్దిక చేయూత ఇవ్వాలి. బ్యాంకులకు లాభాపేక్ష మాత్రమే కాదు సామాజిక బాధ్యత, సమాజం పట్ల కమిట్‌మెంట్ ఉండాలి. హౌసింగ్ లబ్దిదారులకు కూడా రుణాలు మంజూరులో జాప్యం చేయవద్దు” అని సీఎం స్పష్టం చేశారు.
అమరావతి బ్యాంక్ స్ట్రీట్‌లో ఐకానిక్ బ్యాంకు భవనాలు
“అమరావతి రాజధానిలో భూములు తీసుకున్న బ్యాంకులు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న బ్యాంక్స్ స్ట్రీట్‌లో త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలి. ప్రతీ బ్యాంకూ తమకు ఓ ఐకానిక్ భవనం ఉండేలా చూసుకోవాలి. రిజర్వు బ్యాంక్ కూడా ఏపీలో తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలి. ఎంఎసఎంఈలకు రుణ సహకారం అందిస్తే పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మహిళలు, యువతకు డైరీ, ఆక్వా రంగాల్లో సంపదకు ఆస్కారం ఉంటుంది. ఈ ఏడాది 15శాతం వృద్ధిరేటు సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి అనుగుణంగా ఆయా రంగాలకు బ్యాంకులు ఆర్ధిక ఊతం ఇవ్వాలి” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో యూనియన్ బ్యాంకు సీఎండీ, సీఈఓ ఆశీష్ పాండేతో కలిసి 2026-27 ఆర్ధిక సంవత్సరానికి ఏపీ వార్షిక రుణ ప్రణాళికలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ సమావేశానికి సీఎస్ సాయిప్రసాద్, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ డైరెక్టర్ నీలమ్ అగ్రవాల్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ ఏఓ బషీర్, నాబార్డు జీఎం కేవీఎస్ ప్రసాద్, నేషనల్ ఎస్టీ కమిషన్ సునీల్ కుమార్ బాబుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.















