- ఏపీకి ప్రతిష్టాత్మక సంస్థ క్యారియర్
- శ్రీసిటీలో నేడు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి, 3వేల మందికి ఉద్యోగాల కల్పన
అమరావతి (చైతన్య రథం): ప్రజాప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం నడుస్తోంది. దార్శనిక నేత చంద్రబాబునాయుడు, విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ కృషితో ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. గత 22 నెలల కాలంలో రాష్ట్రానికి 800 ప్రాజెక్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక సంస్థ వచ్చింది. అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ రాష్ట్రంలో తన ఉత్పత్తి సంస్థను ప్రారంభించనుంది. నేడు శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో క్యారియర్ సంస్థ కార్యకలాపాలు ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నాయి. హర్యానాలోని గుర్‌గ్రామ్‌లో తయారీ యూనిట్, హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌ను సంస్థ కలిగి ఉంది.
శ్రీసిటీలో వెయ్యి కోట్ల పెట్టుబడి, 3వేలమందికి పైగా ఉద్యోగాల కల్పన
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన నూతన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. 2028నాటికి మూడు దశల్లో సుమారు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ప్లాంట్ ద్వారా దాదాపు 3వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశంలో దీర్ఘకాలిక అభివృద్ధిలో భాగంగా క్యారియర్ సంస్థ శ్రీసిటీలో అత్యాధునిక స్మార్ట్ తయారీ యూనిట్‌ను స్థాపించనుంది. ఈ ప్లాంట్ హెచ్‌వీ ఏసీ, సంబంధిత ఉత్పత్తులపై పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే కాకుండా.. కార్యకలాపాల సామర్థ్యాన్ని, విస్తృతిని పెంచనుంది. ఈ యూనిట్ అత్యాధునిక మౌలిక వసతులు, ఆధునిక ప్లాంట్, మెషినరీతో ఏర్పాటుకానుంది. తద్వారా భవిష్యత్‌కు సిద్ధమైన తయారీ సామర్థ్యాలు, సాంకేతిక సమన్వయం, పోటీ సామర్థ్యం కలిగిన వాతావరణం ఏర్పడుతుంది.
















