- జూలై ఫస్ట్‌వీక్‌లో సీఎం చంద్రబాబు నాలుగు జిల్లాల్లో అభివృద్ధి పర్యటన
- హీరో మోటో కార్ప్, జీ రాంజీ, రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవాలు
- నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలలో సీఎం పర్యటనలు
- జిల్లా పర్యటనల సమయంలో అక్కడే బస చేయనున్న సీఎం
అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1నుంచి వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1నుంచి 5వరకు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనల్లో పలు సంక్షేమ, అభివృద్ది కార్యమాల్లో సిఎం పాల్గొంటారు. 1న పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పర్యటించనున్నారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటో కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. దాదాపు రూ.750 కోట్ల పెట్టుబడులతో హీరో సంస్థ ఈ పార్ట్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనికి శంకుస్థాపన చేయనున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 2వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (వీబీ జీ రాం జీ) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం తిరుపతి పట్టణంలో ప్రైవేటు హోటల్‌లో జరిగే జీఎస్‌డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాప్‌నకు హాజరవుతారు. ఈ వర్క్‌షాప్‌నకు నీతి ఆయోగ్ సభ్యులతోపాటు, పీఎం ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు హాజరవుతారు. 2వ తేదీ రాత్రి తిరుపతిలోనే సిఎం బస చేస్తారు. 3వ తేదీ ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మూడు రోజుల పర్యటనలో భాగంగా అక్కడినుంచి సీఎం చంద్రబాబు కుప్పం బయలుదేరి వెళతారు. 3 నుంచి 5 వరకు సీఎం కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5న తిరిగి అమరావతికి చేరుకుంటారు.















