- పంటలకు ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా అధిక ఆదాయం
- మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్
- వ్యవసాయ, ఉద్యాన పంటల కొనుగోలుపై సీఎం సమీక్ష
అమరావతి (చైతన్య రథం): ఈ ఏడాది మే 15నుంచే రైతులకు సాగునీరు అందించనున్న దృష్ట్యా రాష్ట్రంలో వేగంగా విత్తన సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖకు దిశానిర్దేశం చేశారు. విత్తనాల సరఫరా కోసం రూ.200 కోట్లు కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో బుధవారం రాష్ట్రంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్‌పామ్ తదితర పంటల కొనుగోలుపై సీఎం వ్యవసాయ, ఉద్యాన శాఖలతో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి కె.అచ్చెన్నాయుడు, వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు ధరలు దక్కేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా పంటలకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతుకు లాభసాటిగా ఉండేలా నాణ్యమైన పంట దిగుబడులు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. మరిన్ని పంటలను ప్రకృతి సేద్యం విధానంలో వివిధ పంటలను సాగు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. సేంద్రీయ సాగుకు కంపోస్టు ఎరువును సరఫరా చేసేలా చూడాలన్నారు.
ఈ ఏడాది 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట ఉత్పత్తి వస్తుందని అధికారులు వివరించారు. మొక్క జొన్న సహా ఇతర పంటల ద్వారా ఇథనాల్ తయారీకి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. మామిడిని ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసేలా చూడాలన్నారు. అరటి, ఆయిల్ పామ్, మిర్చి, కోకోలాంటి పంటలకు సంబంధించి ధరల సమస్య లేదని, రైతులకు మంచి ధర లభిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సీజన్‌కంటే ముందే రాష్ట్రంలోని నీటి వనరుల్లో ఫిష్ సీడ్‌ను సరఫరా చేయాలని స్పష్టం చేశారు. వచ్చే పంట సీజన్‌కు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. నాఫెడ్ నుంచి మినుములు ఇతర వాణిజ్య పంటల్ని కొనుగోలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రికి వివరించారు. పీఎండీఎస్ పథకం ద్వారా తక్కువ యూరియా వినియోగానికి ఇచ్చే ప్రోత్సాహకంపై కేంద్రంతో మాట్లాడాలని సీఎం వారికి సూచించారు. మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు కానుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.















