- శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదు
- రాష్ట్రంలో శాంతిభద్రతలే ప్రభుత్వానికి ముఖ్యం
- నేరాలకు పడే శిక్షలపై విస్తృత ప్రచారం చేపట్టండి
- మహిళా భద్రతా విభాగంతో సెల్ఫ్ డిఫెన్సుపై శిక్షణ
- సున్నిత గ్రామాల్లో నిరంతర తనిఖీలు పెంచాలి..
- ఎస్పీలు, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
- రాష్ట్రంలో శాంతిభద్రతలపై లోతైన సమీక్ష
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో శాంతిభద్రతలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధికి కీలకమైన శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు నొక్కిచెప్పారు. కలెక్టర్ల సదస్సులో శాంతిభద్రతలపై జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘‘రౌడీలనేవారు రాష్ట్రంలో ఉండేందుకు వీల్లేదు. నటోరియస్ రౌడీలను రాష్ట్ర బహిష్కరణ చేద్దాం. రౌడీల విషయంలో కఠినంగా ఉండాల్సిందే. అప్పుడే పరిస్థితి నియంత్రణలోకి వస్తుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే రాష్ట్ర బహిష్కరణే. జిల్లాల్లో ప్రొఫెషనల్ రౌడీలను గుర్తించి హెచ్చరించండి. లొంగకపోతే పీడీ యాక్టుతో రాష్ట్ర బహిష్కరణ చేయండి. నెల్లూరులో లేడీడాన్స్, గంజాయి వ్యాపారం, అడ్డంవస్తే చంపేయటం లాంటి ఘటనలతో.. శాంతి భద్రతలు ప్రశ్నార్థకమవుతుంది. సినిమాల్లోనే ఈ తరహా వ్యవహారాలుంటాయి. ఈ విషయంలో ఎస్పీ, కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. శాంతిభద్రతల విషయంలో రాష్ట్రాన్ని జీరో టాలరెన్సుకు తీసుకురావాలి’’ అని సీఎం చంద్రబాబు గట్టిగా చెప్పారు. తొలుత శాంతిభద్రతలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో గతంతో పోలిస్తే 5.5 శాతంమేర నేరాల రేటు తగ్గిందని వెల్లడిరచారు. ‘‘మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. 16 జిల్లాల్లో నేరాలు బాగా నియంత్రణకు వచ్చాయి.
కొన్ని జిల్లాల్లో వేర్వేరు కారణాలవల్ల క్రైమ్ ట్రెండ్ పెరుగుతోంది’’ అని డీజీపీ వివరించారు. అన్నమయ్యలాంటి జిల్లాలో మైగ్రేషన్ లేబర్ కారణంగా నేరాలు జరుగుతున్నాయని డీజీపీ అన్నారు. కిడ్నాపింగ్‌లాంటి కేసులు తగ్గుముఖం పట్టాయన్న డీజీపీ.. 56 శాతంమేర డిటెక్షన్ రేట్, 55 శాతంమేర రికవరీ రేటు ఉందన్నారు. ఎన్టీఆర్, పశ్చిమగోదావరి జిల్లాలు సహా ఐదు జిల్లాల్లో సీసీటీవీల అనుసంధానంతో నేరాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని వెల్లడిరచారు. డీహెచ్‌ఎంఎస్ అనే ఆధునిక సాంకేతికత ద్వారా సీసీ కెమెరాల హెల్త్‌ను నమోదు చేస్తున్నామన్న విజయవాడ సీపీ రాజశేఖర బాబు.. నగరంలో నిఘా కోసం 10 వేల సీసీ కెమెరాల డ్యాష్ బోర్డును కమ్యూనిటీ సహకారంతో రూపొందించామని చెప్పారు. ఫేస్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని రాజశేఖర్ బాబు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. ‘‘కొన్ని జిల్లాల్లో క్రైమ్ రేటు ఎక్కువగా ఉంది. మరికొన్నిచోట్ల తక్కువగా ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతలే ప్రభుత్వానికి ముఖ్యం. కడప, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో ప్రాపర్టీ సంబంధిత కేసులు ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటో విశ్లేషించండి. పోలీసింగ్ అంటే భయం ఉండాలి. రాష్ట్రంలో 5.5 శాతంమేర నేరాల రేటు తగ్గింది. కానీ జిల్లాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది. అన్నమయ్య, కోనసీమ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో ఎందుకు నేరాలు పెరిగాయో విశ్లేషించండి’’ అని సీఎం చంద్రబాబు ఎస్పీలు, కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రంలో రౌడీల కట్టడి, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, మతపరమైన గొడవలువంటి అంశాలపై సదస్సులో చర్చించారు. సమీక్షలు మొక్కుబడి వ్యవహారం కాదని, శాంతి భద్రతల విషయంలో సీరియస్సుగానే ఉంటామని చంద్రబాబు హెచ్చరించారు. ‘‘తప్పు చేసిన వాళ్లకి పోలీసంటే భయం ఏర్పడేలా చేయండి. అప్పుడు తప్పులు చేయడానికి వెనుకాడతారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు అదుపులోకి రావాలి. రాష్ట్రంలో రౌడీలుండేందుకు వీల్లేదు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు’’ అని సీఎం తీవ్రస్వరంతో ఆదేశించారు. ‘‘ఆర్ధిక నేరాల విషయంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలి. అన్ని జిల్లాల్లో సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయండి. ఫోరెన్సిక్ రంగంలో ఆల్ ఇండియా ప్రమాణాల ప్రకారం కార్యాచరణ ఉండాలి. తీరప్రాంత భద్రతకు బోట్స్ తక్షణం కొనుగోలు చేయండి. డ్రోన్ల వినియోగం బాగా పెరగాలి. ఆర్టీజీఎస్ విభాగంతో అనుసంధానించాలి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం 15 నిముషాల్లోపుగా బాధితుల్ని చేరేలా బలోపేతం చేయండి. ప్రతీ రహదారి ప్రమాదంపైనా సమీక్షించండి. బ్లాక్ స్పాట్స్ కరెక్షన్ జరగాలి. టాప్ -3 నేరాలను నియంత్రించిన బెస్ట్ ప్రాక్టీసెస్‌ను వచ్చే కాన్ఫరెన్సులో చర్చిద్దాం. సైబర్ నేరాల ద్వారా జరిగే ఆర్ధిక నష్టంపై అధ్యయనం చేయండి. సామాజిక మాధ్యమాల్లో జరిగే దుష్ప్రచారంపై మంత్రుల కమిటీ అధ్యయనం చేయాలి. ఫేక్ ఖాతాలు తయారు చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిని శిక్షించాలి’’ అని సీఎం చంద్రబాబు ఎస్పీలు, కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.











