అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చేవారం రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక
కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధినుంచి గృహ పట్టాల పంపిణీ, పింఛన్ల పంపిణీ, తాగునీటి సరఫరా వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
ఉదయగిరిలో ‘పల్లె పండుగ-3.0’ కింద గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.11 వేల కోట్ల నిధుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని సీఎం తెలిపారు. విజయవాడలో 25 వేలమందికి గృహ పట్టాల పంపిణీ, రేపల్లెలో లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు చెప్పారు. మదనపల్లెలో రాయలసీమ హబ్ అభివృద్ధిపై సమావేశం, పాన్ ఐఐటీ అభివృద్ధి సదస్సు నిర్వహించనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. తెనాలిలో 3 లక్షల గ్రామీణ గృహాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా ‘జల్ జీవన్ మిషన్’ పై దృష్టి సారించనున్నట్లు చెప్పారు.
ఉదయగిరి నుంచి విశాఖ వరకు రాష్ట్ర అభివృద్ధి పటం విస్తరిస్తోందని సీఎం పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు.. అన్నింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లనున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలను కలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ఈ అభివృద్ధి ప్రస్థానంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జెన్ జెడ్ డెవలప్మెంట్ అంటే కేవలం పెద్ద భవనాలు కాదని, జాబ్స్ కావాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. అవకాశాలు అందించాలి. ప్రతి కుటుంబానికీ డిగ్నిటీ కావాలి. ఆ దిశగా ప్రభుత్వం ఫైళ్లలో కాదు… ఫీల్డ్‌లో కనిపించే పనులతో ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.















