- ప్రజల్లో భయాన్ని కాకుండా భరోసా కల్పించాలి
- క్రమశిక్షణ, మానవత్వంతో విధులు నిర్వర్తించాలి
- హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపు
అమరావతి(చైతన్యరథం): పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుని ప్రజలకు సేవ చేయాలని నూతనంగా విధుల్లోకి అడుగుపెడుతున్న కానిస్టేబుళ్లకు సూచించారు. పోలీసు యూనిఫాం ప్రజల్లో భయాన్ని కాకుండా భరోసాను కల్పించేలా ఉండాలని తెలిపారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం 2025-26 బ్యాచ్‌కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు అవార్డులను అంద జేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో రాష్ట్రంలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రి యను ఎన్నో అడ్డంకులను అధిగమించి పూర్తి చేశామని తెలిపా రు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా 21 శిక్షణ కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్త యిందని తెలిపారు. వీరిలో 2,330 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఉన్నారని వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో సుమా రు 1,000 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండటం విశేషమని తెలిపారు. పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని పేర్కొ న్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, సైబర్ నేరాల నియంత్రణకు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ అందించామని తెలిపారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా విని, వారికి సత్వర న్యాయం అందించేలా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన 2047 విజన్‌లో కానిస్టేబుళ్లు కూడా భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. పదవీ విరమణ వరకు క్రమశిక్షణతో, ప్రశాంతంగా ప్రజలకు సేవలందిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.














