- రైతులను ఆదుకోవడం..ధరల తగ్గింపే లక్ష్యం
- హైరిస్క్ ఆరఎస్కేల పరిధిలో నష్టం జరగొద్దు
- పంట నష్టం సంభవిస్తే బీమా అందేలా చూడాలి
- కంటింజెన్సీ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలుచేయాలి
- ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): ఎల్‌నినో ప్రభావం, యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగంతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. ఎల్‌నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం… ధరలు తగ్గింపే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను నియంత్రించాలని ఆదేశించారు. హైరిస్క్ ఆరఎస్కే పరిధిలోని హార్టికల్చర్ పంటలను ఆదుకునేందుకు ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిమాండ్ ఆధారిత పంటల సాగుపై ఫోకస్ పెట్టాల ని తెలిపారు. ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా తాత్కాలిక, మధ్యంతర ప్రణాళికలతో వెళ్లాలని సూచించారు. ఎల్‌నినోకు ముందస్తు యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రతిఒక్కరూ పనిచేయాలని స్పష్టం చేశారు. పంటల బీమా చేయించాం… పంట నష్టం సంభ విస్తే బీమా మొత్తం రైతులకు దక్కేలా చేయాలని ఆదేశించారు. గోడౌన్లలో బియ్యం నిల్వలు ఎంతమేరకు ఉన్నాయో పరిశీలిం చాలి. బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకు బియ్యం నిల్వల ను మార్కెట్‌లోకి వదిలేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నాం. రానున్న కాలంలో ఉల్లికి ఉన్న డిమాండ్ కు అనుగుణంగా ఉల్లి సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఇక పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో పెట్టేలా ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను త్వరితగతిన అమలు చేయాలని స్పష్టం చేశారు.
కిచెన్ గార్డెన్లను ప్రోత్సహించండి…
స్వయం సహాయక బృందాల ద్వారా కిచెన్ గార్డెన్ల ద్వారా కూరగాయలు పండించేలా చూడాలి. కిచెన్ గార్డెన్లను ప్రోత్సహిం చి వ్యవస్థీకృతం చేయగలిగితే కూరగాయల ధరలు అదుపులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు కనీస మద్దతు ధర అందిస్తుంది…దీనిపై కేంద్రంతో సమన్వయం చేసుకోవాలి. ఎల్ నినో విపత్తును సవాల్‌గా స్వీకరించాలి. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, రైతు, సాగునీటి సంఘాలు సమన్వయం తో పనిచేయాలి. వర్షాధార పంటలు, ప్రకృతి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంట లపై హై రిస్క్ ఉంది… ఈ ఉద్యాన పంటలను కాపాడేందుకు రూ.190 కోట్లు కేటాయించాం.. ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు.
పశుగ్రాసం అందేలా చూడాలి
ప్రతిఒక్కరికీ తాగునీటిని అందించాలి. పశువులకు నీటిని అందించడంతో పాటు పశుగ్రాసం అందేలా చూడాలి. డిమాండ్ కు అనుగుణంగా పంటలను సాగు చేయడం.. పశుగ్రాసం పెంచడం.. మల్చింగ్ కోసం విత్తనాలు జల్లడం వంటివి చేయాలి. వీబీ జీ రామ్ జీ పనులను అనుసంధానం చేసుకుంటూ జలధార కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా 50.7 శాతం మేర లోటు వర్షపాతం నమోదైంది. ప్రకాశం, అన్నమ య్య, సత్యసాయి జిల్లాల్లో అత్యధిక లోటు వర్షపాతం కన్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 30.84 లక్షల హెక్టార్లల్లో సాగు చేయాల్సి ఉండగా… ఎల్‌నినో కారణంగా 79 శాతం భూము ల్లోనే సాగు పనులు మొదలుపెట్టారు. పప్పు ధాన్యాల సాగు మెరుగ్గా ఉన్నా… నూనె గింజల సాగు తక్కువగా ఉంది. కర్నూ లు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని పంటలపై ఎల్ నినో ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. ఇప్పటికే సిద్దం చేసుకున్న కంటింజెన్సీ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఖరీఫ్ కంటింజెన్సీకి రూ.60 కోట్లు సిద్ధం
5.21 లక్షల హెక్టార్లకు పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, పచ్చిరొట్ట ఎరువులు సరఫరా చేశాం. 1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం సబ్సిడీతో సరఫరా చేశాం. ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ.60 కోట్లు సిద్దం చేసుకున్నాం. అధికారులు క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలి. స్థానిక ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు ఎల్ నినో అంశంపై గ్రామాల్లో ఎక్కువగా పర్యటించి రైతుల్లో అవగాహన పెంచాలని సూచించారు. సంప్రదాయేతర ప్రాంతాల్లో కూడా ఉల్లి, మిరప సాగును చేపట్టాలి. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలతో కరవు ప్రభావిత ప్రాంతాలకు నీటిని పంపగలు గుతున్నాం. హంద్రీ-నీవా ద్వారా చివరి భూములకు నీరందిం చాం.. ఇప్పుడు తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యల వల్లే ఎల్ నినో వంటి సమయాల్లో కూడా హంద్రీ-నీవా కాల్వల్లో నీరు వస్తుంది. రూ.3,500 కోట్ల ఖర్చుతో 100 రోజుల్లో హంద్రీ-నీవా కాల్వల్లో నీటిని పారించగలిగాం. 2014-19 మధ్య కాలంలో ఇరిగేషన్ నిమిత్తం రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టాం. 2019-24 మధ్యన నాటి ప్రభుత్వం కేవలం రూ.22 వేల కోట్లే ఖర్చు పెట్టింది. ప్రాజెక్టులు పూర్తి అయ్యుంటే ఎల్‌నినో వంటి విపత్తు వచ్చినా ఇబ్బంది ఉండేది కాదని తెలిపారు.












