- రోశయ్య విగ్రహం.. ‘ది స్టాట్యూ ఆఫ్ స్టేట్స్‌మన్’గా నిలవాలి
- సమాజ శ్రేయస్సుకు ఆయన సేవ భావితరాలకు తెలియాలి
- ఆయన జీవిత చరిత్ర తెలిసేలా మ్యూజియం ఏర్పాటుచేయాలి
- విశాఖలో మాజీ సీఎం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్
- రోశయ్య కుటుంబసభ్యులతో మంత్రి లోకేష్ ప్రత్యేక భేటీ
విశాఖపట్నం, సిరిపురం సర్కిల్ (చైతన్య రథం): రాజకీయ విలువలకు మానవ రూపం, నిజాయతీకి నిలువెత్తు ప్రతిరూపం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని సిరిపురం సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన రోశయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి.. ఆ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు.
‘ది స్టాట్యూ ఆఫ్ స్టేట్స్‌మన్’
“యువగళం పాదయాత్రలో ఆర్యవైశ్యులు మా ఆత్మగౌరవాన్ని గౌరవించాలని కోరారు. అందుకే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకైన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అమరావతిలో రికార్డు సమయంలో ఏర్పాటు చేసుకున్నాం. అది ఒక చరిత్ర, భూమి మేం ఇచ్చాం. నిధులు ఆర్యవైశ్య సోదరులే సమకూర్చి ఏర్పాటుచేశారు. మీరు కోరుకుంటే ఐక్యత తో నిలబడతారనే దానికి ఇది నిదర్శనం. ఇప్పుడు విశాఖపట్నంలో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా చరిత్రలో నిలిచిపోయే రోజు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య పెద్దల ఆమోదంతో ‘స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్’ అని పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా రోశయ్య విగ్రహాన్ని చూసిన వెంటనే గుర్తొచ్చే పదం ‘స్టేట్స్ మన్’. అందుకే ఈ విగ్రహాన్ని ‘ది స్టాట్యూ ఆఫ్ స్టేట్స్ మన్’ అని పిలుద్దాం” అనిమంత్రి లోకేష్ సభలో ప్రతిపాదించారు.
వ్యక్తిగత విభేదాలకు దూరం… రాజకీయ విలువలకు ప్రతిరూపం
“రాజకీయ విలువల గురించి మాట్లాడాలంటే గుర్తొచ్చే పేర్లలో రోశయ్య ఒకరు. నాకు ఎంతో ఇష్టమైన నాయకుడు, గొప్ప స్టేట్స్ మన్ రోశయ్య, క్రమశిక్షణ, నిజాయతీ, సబ్జెక్టుపై పట్టు, మాటల్లో మంచితనం, విమర్శల్లో పదును ఆయన ప్రత్యేకతలు. పదవులు శాశ్వతం కాదు.. ప్రజలకు చేసిన సేవే. శాశ్వతమని నమ్మిన వ్యక్తి రోశయ్య. అధికారం ఉన్నప్పుడు అహంకారం ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోశయ్య మాట్లాడుతుంటే అందరూ సైలెంట్‌గా వినేవారు. ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య ఒక వారధిగా ఉండేవారు. చంద్రబాబు, వైఎస్సార్ మధ్య ఎప్పుడైనా వాడివేడిగా వాదన జరిగినప్పుడు రోశయ్య నిలబడి కాస్త చల్లబరిచేవారు. మరుసటి రోజు చంద్రబాబుకి ఫోన్ చేసి ‘చాలా చక్కగా వాదనలు జరిగాయి.. ఇవాళ చర్చ కొనసాగిద్దాం’ అని చెప్పేవారు. రాజకీయ విభేదాలున్నా వ్యక్తిగత గౌరవాన్ని కాపాడిన నాయకుడు రోశయ్య’ అని కీర్తించారు.
నేటి తరానికి ఆయనే స్ఫూర్తి
“ఒక పల్లెటూరిలో సాధారణ కుటుంబంలో పుట్టి… ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చారు రోశయ్య పల్లెటూరు నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన గొప్ప వ్యక్తి ఆయన, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయం లో ముఖ్యమంత్రులు మారినా ప్రతి కేబినెట్లో రోశయ్య కొనసాగేవారు. మొదటి నుంచి చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కమిట్మెంట్ పనిచేశారు. ఆస్తులు, రాజకీయ నేపథ్యం లేకపోయినా కష్టం, క్రమశిక్షణ, విలువలుంటే రాజకీయాల్లో ఉన్నతస్థాయికి ఎదగవచ్చని రోశయ్య నిరూపించారు. ఆయన ఒక రాజకీయ పాఠశాల, నేటి తరానికి ఆయనే స్ఫూర్తి” అని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.
భావి తరాలకు ఆయన జీవిత చరిత్ర తెలియాలి.
“విగ్రహాలు కట్టడం వలన ఏం ఉపయోగమని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ నేను యువగళం పాదయాత్ర చేసే సమయంలో తెలుగు జాతి కోసం త్యాగాలు చేసిన ఎందరో మహానుభావుల గురించి విగ్రహాలను చూసే తెలుసుకున్నాను. గొప్ప వ్యక్తులకు విగ్రహాలు ఏర్పాటు చేయడం గొప్ప నివాళి. అయితే అక్కడితో ఆగకూడదు. వారి జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి. రోశయ్య జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, విజయాలు నేటి తరాలకు తెలియాలి. ఆయన జీవిత చరిత్రపై పుస్తకాలు, ప్రత్యేక వీడియోలు రూపొందించి యువతకు చేరువ చేయాలి. వీటితోపాటు రోశయ్య జీవిత చరిత్ర తెలిపేలా ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఆర్యవైశ్య పెద్దలంతా కలిసి ఆలోచించి మ్యూజియం కోసం స్థలం ఏర్పాటుచేయండి. కేవలం 18 నెలల్లో మ్యూజియం పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా దేశానికి అంకితం చేద్దాం.
నేటి తరానికి కూడా బాల్యం నుంచే రోశయ్య జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే పాఠ్యాంశాలలో ఆయన జీవిత చరిత్ర, రాజకీయ విలువలు, సమాజ సేవ గురించి ఒక అధ్యాయం పెట్టించే బాధ్యత నాది. అలానే ఆయన అవలంబించిన రాజకీయ విలువలపై టీడీపీ క్యాడర్ ట్రైనింగ్ కూడా ఒక చాప్టర్ పెట్టించే బాధ్యత పల్లా శ్రీనివాసరావుది. ప్రభుత్వం, ఆర్యవైశ్య పెద్దలు కలిసి రోశయ్య జీవితాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా కృషి చేద్దాం” అని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని, ఇంతటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాని లోకేష్ పేర్కొన్నారు.
విగ్రహావిష్కరణకు ముందు రోశయ్య కుటుంబసభ్యులు పైడా కృష్ణ ప్రసాద్, పైదా రమాదేవి, పైడా మౌర్య, కొణిజేటి శివసుబ్బారావు, కేఎస్ఎన్ మూర్తిలతో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమాజ శ్రేయస్సుకు రోశయ్య చేసిన త్యాగాలు, అందించిన సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని కుటుంబసభ్యులకు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టీజ్ భరత్, ఎంపీ ఎం శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.











