- రాఖీ పండుగ సందర్భంగా మంత్రి లోకేష్ భావోద్వేగ ట్వీట్
అమరావతి (చైతన్య రథం): తోడబుట్టిన అక్కచెల్లెళ్లు లేని తనకు దేవుడే కోట్లాదిమంది సోదరీమణులను తోడుగా ఇచ్చాడని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. రాఖీ పండుగ సందర్భంగా ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ.. “తోడబుట్టిన సోదరీమణులు లేని నాకు దేవుడే కోట్లాదిమంది సోదరీమణులను తోడుగా ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా అక్కా చెల్లెళ్లు చూపించే ప్రేమాభిమానాలు మరువలేను. మహిళాలోకం ఆత్మీయత నాలో మరింత బాధ్యతను పెంచింది. విద్యార్థి దశనించే మహిళలను గౌరవించేలా పిల్లలకు నైతిక విలువల పాఠాలు బోధిస్తున్నాం. మహిళల భద్రత, సాధికారత ప్రజా ప్రభుత్వం బాధ్యత. ప్రాణ సమానమైన తెలుగింటి అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని లోకేష్ పేర్కొన్నారు.
రాఖీ కట్టిన మంత్రి సవిత, ఎమ్మెల్యే మాధవి
రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని ఉండవల్లి నివాసంలో శుక్రవారం వేడుక నిర్వహించారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు బీసీ సంక్షేమ మంత్రి ఎస్ సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగింటి ఆడపడుచులకు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.













