- హెచ్చార్డీలో అప్పగించిన బాధ్యతలను మెరుగైన స్థితికి తీసుకెళ్లడమే లక్ష్యం
- స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ… పెట్టుబడుల ఆకర్షణలో మా సక్సెస్ ఫార్ములా
- రేపటితరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టించబోతోంది
- ప్రపంచం మెచ్చే మోడల్‌ను ఏపీలో సృష్టించాలనేది మా లక్ష్యం
- ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 అవార్డును అందుకున్న నారా బ్రాహ్మణి
- కేంద్ర ఫుడ్ ఫ్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా స్వీకారం
ముంబాయ్ (చైతన్య రథం): భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకులు, చేంజ్ మేకర్లు, బిజినెస్ మైండ్స్కు ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 పేరిట ముంబాయిలో అవార్డులను ప్రదానం చేసింది. కార్యక్రమానికి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధులుగా హాజరై విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. దేశంలో డైరీ వాల్యూయాడెడ్ ఉత్పత్తుల్లో ప్రత్యేకత సాధించిన హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నారా బ్రాహ్మణికి కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఆర్పీఎస్జీ వైస్ చైర్మన్ శాశ్వత్ గోయెంకా అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలిచ్చారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ వేగంగా పెట్టుబడుల ఆకర్షణకు రెండు ప్రధాన కారణాలను మంత్రి లోకేష్ విశదీకరించారు. స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ తమ విజయ రహస్యమని తెలిపారు. శాశ్వత్ గోయెంకా అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలు ఇలా ఉన్నాయి.
శాశ్వత్ గోయెంకా: ప్రభుత్వ నిర్వహణలో మీరు ఒక డిసిప్లేన్ ఆపరేషన్ తీసుకువస్తున్నారు. మీరు గతంలో అనేకసార్లు పొదుపు గురించి, ప్రతి రూపాయి ఎంత ముఖ్యమో మాట్లాడారు. ఆ ఆలోచన మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అది మీరు ప్రభుత్వాన్ని నడిపే విధానాన్ని ఎలా మార్చింది?
నారా లోకేష్: వ్యాపారమైనా, రాజకీయాలైనా.. మనం నిర్వహించే సంస్థలకు కేవలం సంరక్షకులం మాత్రమేనని నేను నమ్ముతాను. అదే విధానాన్ని రాజకీయాల్లోనూ అవలంబిస్తున్నాం. ఒక మంత్రిగా నేను ఇక్కడికి వచ్చింది కేవలం మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖకు సంరక్షకుడిగా మాత్రమే. నాకు అప్పగించిన బాధ్యతలను మరింత మెరుగైన స్థితికి తీసుకెళ్లాలన్నదే నా ఆలోచన. గతంలో వ్యాపారంలోనూ ఇదే విధానాన్ని అనుసరించాను. ఇప్పుడు అధికారిక బాధ్యతలోనూ ఇదే విధానంతో ముందుకు వెళ్తున్నాను. మనందరం, ముఖ్యంగా రాజకీయ నాయకులు సంస్థలను నిర్మించే వ్యక్తులుగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నాను.
శాశ్వత్ గోయెంకా: ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాష్ట్రం కోసం మీరు ఎంతో ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. పరిశ్రమలు కూడా దానికి సానుకూలంగా స్పందిస్తున్నాయి. కానీ ప్రస్తుతం ప్రతి రాష్ట్రం పెట్టుబడుల కోసం పోటీ పడుతోంది. ఒక రాష్ట్రంపై వ్యాపార సంస్థలు విశ్వాసం ఉంచాలంటే నిజంగా ఏం కావాలి? ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటి?
నారా లోకేష్: దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది మేము అనుసరిస్తున్న మూడు ‘ఎస’ల విధానం- స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ. మొదటిది -వేగం. మేము ఎంత వేగంగా పని చేస్తున్నామో ఇక్కడ ఉన్న అనేక పరిశ్రమల ప్రతినిధులు స్వయంగా చూశారు. రెండోది -సర్వీస్. చాలామంది పెట్టుబడిదారులకు వారి పెట్టుబడుల ప్రస్తుతస్థితిపై నేను స్వయంగా ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటాను. దాదాపు ప్రతి శనివారం రాత్రి వారికి వ్యక్తిగతంగా మెసేజ్ పంపుతాను. పెట్టుబడిదారులు కోరుకునేది ఇదేనని నేను నమ్ముతున్నాను. మూడోది -పాలసీ స్థిరత్వం. అంటే విధానాల్లో స్థిరత్వం. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. కానీ పెట్టుబడిదారులు కోరుకునేది స్థిరమైన పాలసీ ఫ్రేమ్‌వర్క్. మా నాయకత్వం గతంలో తీసుకొచ్చిన విధానాలు రాజకీయ మార్పులను తట్టుకుని నిలబడ్డాయి. ప్రభుత్వాలు మారవచ్చు, కానీ మా విధానాలు మాత్రం కొనసాగుతాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టే ఒక కారణం.
రెండో కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సీబీఎన్ అంటే ఒక బ్రాండ్. ఆయనకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. పెట్టుబడుల కోసం అవసరమైన తలుపులు తెరవగలిగే ముఖ్యమంత్రి ఉండటంవల్ల మా పని సగం సులభమవుతుంది. మిగిలిన సగం నేను సమావేశ మందిరంలోకి వెళ్లినపుడు ఒప్పందాన్ని ఖరారు చేస్తాను. మేమిద్దరం కలిసి ఈవిధంగా పని చేస్తున్నాం. ఈ భాగస్వామ్యమే ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది.
శాశ్వత్ గోయెంకా: ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన అవకాశం మీకు ఉంది. మీరు ఆయనతో కలిసి పనిచేస్తున్నారు, అదే సమయంలో ఆయన మీ తండ్రి కూడా. ఈరోజు ఇక్కడ ఉన్న మనలో చాలామంది తమ తండ్రులతో కలిసి పనిచేస్తున్నారు. ప్రభుత్వంపై మీ అభిప్రాయాలు ఆయన అభిప్రాయాల కంటే ఏ విషయంలో భిన్నంగా ఉంటాయి? అలాగే ఆయన నుంచి మీరు నేర్చుకున్న, భవిష్యత్తులో కొనసాగించాలని కోరుకునే విషయం ఏమిటి? నారా లోకేష్: ఇక్కడ ఉన్న రెండో, మూడో, నాలుగో తరానికి చెందిన వ్యాపారవేత్తలందరికీ ఇది వర్తిస్తుంది. ప్రతిరోజూ తీసుకునే నిర్ణయాల విషయంలో మనం మన తల్లిదండ్రులతో విభేదించే సందర్భాలుంటాయి. అయితే నా అభిప్రాయం కుటుంబ వ్యాపారాల్లో ఉన్న యువత తమ కంఫర్ట్ జోన్‌నుంచి బయటకు రావాలి. కొత్తరంగాల్లో, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలి. పరిశోధనపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇది చాలా కీలకం. ఇక్కడే విద్య ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
వివిధ ఖండాల్లో ఉన్న సంస్థలు, పరిశోధనా సంస్థల మధ్య అనుసంధానం కల్పించి, పరిశోధన, కొత్త రంగాల్లో మరింత దృష్టి పెట్టవచ్చు. అది అంతరిక్ష రంగం కావచ్చు, క్వాంటమ్ టెక్నాలజీ కావచ్చు, మెటీరియల్ సైన్సెస్ కావచ్చు -భారతదేశం చేయగలిగేది ఎంతో ఉంది. మనమంతా కలిసి దీన్ని సాధించగలం. ఇక రాష్ట్రం తరఫున నేను కోరేది ఒక్కటే -ఈ మార్పులో మీరు కూడా భాగస్వాములు కండి. మనం వివిధ దేశాలు, వివిధ నగరాల గురించి, అక్కడ జరుగుతున్న మార్పుల గురించి మాట్లాడుతుంటాం. నేను మీకు అందిస్తున్న వేదిక ఆంధ్రప్రదేశ్. మేము పూర్తిగా పరిపూర్ణంగా ఉన్నామని చెప్పడం లేదు. కానీ మేము చేసే ప్రతి తప్పు నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రాన్ని మరింత మెరుగ్గా ఎలా తీర్చిదిద్దాలి? అనే విషయంలో మీ అభిప్రాయాలను స్వీకరించడానికి, మీతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రేపటి భారతదేశం, మన తర్వాత తరం గర్వపడేలా ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి అనే నగరం మరోసారి చరిత్ర సృష్టిస్తోంది. ప్రపంచమంతా చెప్పుకునేలా ఒక మోడల్‌ను ఆంధ్రప్రదేశ్‌లో సృష్టించాలనేది మా లక్ష్యం. ఈరోజు ఇక్కడ ఉన్న 40 ఏళ్లలోపు యువతనుంచి నేను కోరేది కూడా ఇదే అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.














