- టెలీమెడిసిన్ తో హైరిస్క్ ప్రసవం సక్సెస్…
- ఆస్పరి పీహెచ్ సి వైద్యులను అభినందించిన ముఖ్యమంత్రి
ఆలూరు (చైతన్య రథం): ఆలూరు నియోజక వర్గంలోని ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని ప్రాజెక్టు అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరెటివ్ విధానంలో భాగంగా సంజీవని ప్రాజెక్టు అమలుపై వైద్యులనుంచి ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకున్నారు. వ్యక్తిగత ఆరోగ్య రికార్డు లను డిజిటల్ అనుసంధానించి ఆరోగ్య సంరక్షణ అందించే విధానాన్ని పరిశీలించిన సీఎం, డిజిటల్ సాంకేతికత ద్వారా సమాచార మార్పిడి, ఫాలోఅప్, వ్యాధుల గుర్తింపు, కౌన్సెలింగ్, కుటుంబ సభ్యుల భాగస్వామ్యంవంటి అంశాలపై ఆరా తీశారు. సంజీవని ప్రాజెక్టుకు ముందు, అమలు తర్వాత వచ్చిన మార్పుల గురించి కూడా వైద్యులను అడిగి తెలుసుకున్నారు. స్పెషలిస్ట్ వైద్యుల సాయంతో టెలీమెడిసిన్ వ్యవస్థ ద్వారా హైరిస్క్ ప్రసవాన్ని పీహెచ్సీ స్థాయిలోనే విజయవంతంగా చేసినట్టు వైద్యాధికారులు సీఎంకు వివరించారు.
సకాలంలో నిర్ణయం తీసుకుని ఓ గర్భిణికి విజయవంతంగా ప్రసవం చేయించిన వైద్యులను ముఖ్యమంత్రి అభినందించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొందరు దంపతులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వారి పిల్లలను ఆప్యాయంగా ఎత్తుకుని, మహిళల ఆరోగ్య సంరక్షణపై పీహెచ్సీలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గర్భధారణ సమయంలో తమకు అందిన వైద్య సేవలు, హెల్త్ ఫాలోఅప్ గురించి మహిళలు సీఎంకు వివరించారు. వ్యాధుల ట్రాకింగ్, వైద్య పరీక్షల రిమైండర్లు, హెల్త్ రిపోర్టుల గురించి అధికారులు సీఎంకు వివరించారు. సంజీవని ప్రాజెక్టును పటిష్టంగా అమలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.













