- ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్లతో మంత్రి దుర్గేష్ కీలక భేటీ
- ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని పిలుపు
- ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ప్రోత్సాహానికి భరోసా
జైపూర్ (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి ‘వెడ్డింగ్ డెస్టినేషన్’గా ప్రమోట్ చేయడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టి సారించారు. దేశంలోనే రాయల్ వెడ్డింగ్స్కు కేరాఫ్ అడ్రస్, రోల్ మోడల్గా నిలిచిన రాజస్థాన్లోని జైపూర్లో మంత్రి దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా జైపూర్ కుకాస్లోని విరాసత్ హెరిటేజ్ రెస్టారెంట్లో జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్ క్లేవ్ (ఐడబ్ల్యూటీసీ)లో ప్రముఖ వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లానర్లు, ఈవెంట్ నిర్వాహకులతో మంత్రి దుర్గేష్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్లో వెడ్డింగ్ టూరిజం విస్తరణకు ఉన్న అనుకూలతలు, సహజసిద్ధమైన వనరులు మరియు ప్రభుత్వ రాయితీలపై మంత్రి దుర్గేష్ సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం సహకారంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ు పర్యాటక రంగానికి కల్పిస్తున్న ప్రాముఖ్యతను తెలిపారు. అంతకుముందు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి, పర్యాటక మంత్రి దియా కుమారితో కలిసి ఆంధ్రప్రదేశ్ టూరిజం స్టాల్ను మంత్రి దుర్గేష్ ప్రారంభించి పలువురికి ఏపీ ప్రత్యేకతలను స్వయంగా తెలిపారు.
వైజాగ్, అరకు, కోనసీమ, తిరుపతి.. అన్నీ వెడ్డింగ్ డెస్టినేషన్ల
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతమైన ప్రకృతి అందాలు, చారిత్రాత్మక కోటలు, సుదీర్ఘమైన సముద్ర తీరాలతో వెడ్డింగ్ డెస్టినేషన్లకు అత్యంత అనువైన ప్రాంతంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి బీచ్ వెడ్డింగ్స్ నిర్వహించుకోవడానికి హిల్ రిసార్ట్స్ కలయికతో ఉన్న వైజాగ్ తీరం ఎంతో రమణీయంగా ఉంటుందని వివరించారు. సూర్యలంక బీచ్ లో స్టార్ హోటళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.పచ్చని ప్రకృతి, గిరిజన సంస్కృతి, ఎకో-టూరిజం వైభవం మరియు అంతర్జాతీయ గుర్తింపు పొందిన ‘అరకు కాఫీ’ విశిష్టతలతో అరకు పర్యాటకులను కట్టిపడేస్తుందని తెలిపారు. పచ్చని కొండలు, చల్లని వాతావరణం, పొగమంచు మధ్య ప్రశాంతంగా వేడుక జరుపుకోవాలనుకునే వారికి అరకు ఉత్తమమైన ప్రాంతం అని పేర్కొన్నారు. అదే గాక కోనసీమ ప్రాంతం పచ్చని కొబ్బరిచెట్లతో, మారేడుమిల్లి దట్టమైన అటవీ ప్రాంతంతో సుందరంగా ఉంటుందన్నారు. సాంప్రదాయ పద్ధతిలో, వైభవంగా వివాహం చేసుకోవాలనుకునే వారికి తిరుపతి మొదటి ప్రాధాన్యతగా మారుతోందని, ప్రస్తుతం అక్కడ
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘వరల్డ్ క్లాస్ హోటల్స్’ అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి తెలిపారు. బాబా రామ్ దేవ్ ఏపీలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు.
సింగిల్ విండో విధానంలో అనుమతులు
మంత్రి దుర్గేష్ స్పీచ్తో ఆంధ్రప్రదేశ్కు వచ్చి వెడ్డింగ్ డెస్టినేషన్ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టేందుకు పలువురు వెడ్డింగ్ ప్లానర్లు సుముఖత వ్యక్తం చేశారు. ఏపీలో ఈవెంట్స్, టూరిజం ప్రాజెక్టులు చేపట్టే వారికి కూటమి ప్రభుత్వం తరపున సింగిల్ విండో విధానంలో అనుమతులు, అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామని, నూతన పర్యాటక పాలసీ 2024-29తో ఇన్వెస్టర్లకు రాయితీలు ఇస్తున్నామన్నారు. ఇవేగాక హోమ్ స్టే, క్యారవాన్, ల్యాండ్ అలాట్మెంట్, బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ తదితర అనుబంధ పాలసీలు అమలు చేస్తున్నామన్నారు. ఫిల్మ్ టూరిజంకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగ వృద్ధికి, ఉపాధి కల్పనకు వెడ్డింగ్ టూరిజం ఎంతో దోహదపడుతుందని, త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఏపీలో పర్యటించాలని స్థానిక నిర్వాహకులను మంత్రి దుర్గేష్ అధికారికంగా ఆహ్వానించారు. ప్రకృతి ప్రసాదించిన అన్ని రకాల అందాలు ఏపీ సొంతమని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరపున అండగా ఉంటా మని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఈవెంట్ ప్రొఫెషనల్స్, హాస్పిటాలిటీ రంగానికి చెందిన ప్రముఖులు, ఇన్వెస్టర్లు, వెన్యూ ఓనర్స్, ట్రావెల్ అండ్ ట్రేడ్ పార్ట్నర్స్, టూరిజం స్టేక్ హోల్డర్స్, వెడ్డింగ్ డెస్టినేషన్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
















