- వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తాం
- ఆగస్టు 14న అనకాపల్లికి గోదావరి జలాలు
- సెప్టెంబరు 1న వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం
- రాష్ట్రవ్యాప్తంగా 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులు వేగవంతం
- జలధార-జలహారతి పనులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు
- పోలవరం వద్ద మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు
- ప్రాజెక్టును పరిశీలించి పనుల పురోగతిపై సమీక్ష
పోలవరం/ఏలూరు(చైతన్యరథం): పోలవరం ప్రాజెక్టు పనులు ఫాస్ట్ ట్రాక్‌లో పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సీఎం హెలికాప్టర్ నుంచి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో పనుల పురో గతిపై సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఆగస్టు 14 తేదీన అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి ఇస్తామని ప్రకటించారు. ముందు అనకాపల్లి వరకూ పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని తరలించనున్నట్టు వివరించారు. వచ్చే ఏడాదిలోగా విశాఖకు నీటిని తరలించే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమం చేపడతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును మార్చి 2027 నాటికల్లా పూర్తి చేస్తామని.. వర్షపు సీజన్ సహా వరద నీటి ప్రవాహాలకు అనుగుణంగా జూలైలో గ్రావిటీపై నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు.
పోలవరం ఎడమ కాలువకు గోదావరి జలాలను విడుదల చేసి ఆగస్టు 14న అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలకు స్వాగతం పలికి అఖండ హారతి ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ప్రతీ నెలా ప్రజలకు వివరిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు భారీ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. 7.2 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుం దని, 23.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, 28.5 లక్షల మందికి తాగునీరు అందించవచ్చని వివరించారు. 23.44 టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియో గించుకోవచ్చని, జలవిద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. హైబ్రిడ్ మోడల్‌లో పంప్డ్ స్టోరేజ్ అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించినట్లు చెప్పారు.
నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వం
2014లో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశామని, నిర్వాసితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికే పోలవరం జిల్లాను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. రంపచో డవరం నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని పోలవరం జిల్లా ఏర్పాటు చేశామని, పునరావాస బాధ్యతను నెరవేర్చేందుకు పని చేశామని తెలిపారు. గతంలో పరిహారం విషయంలో అనేక ఫిర్యాదులు వచ్చేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. నిజమైన అర్హులకు న్యాయం చేస్తున్నామని, ఒక ప్రాజెక్టు వల్ల కొందరు లాభపడితే మరికొందరు నష్టపోతారని, నష్టపోయిన వారికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. 2019 నాటికే పోలవరం పనుల్లో 72 శాతం పూర్తి చేశామని, అనంతరం వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాజెక్టుపై కక్షపూరిత ధోరణి ప్రదర్శించిందని ముఖ్యమంత్రి విమర్శించారు. టెండర్లు రద్దు చేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచించి నా పట్టించుకోలేదన్నారు. రూ.440 కోట్లతో నిర్మించిన డయా ఫ్రం వాల్ దెబ్బతిన్నా గుర్తించలేదని, దానిని మళ్లీ నిర్మించాల్సి వచ్చిందని తెలిపారు.
ప్రస్తుతం అదే డయాఫ్రం వాల్‌పై ఈసీఆరఎఫ్ నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుపై 136 సార్లు సమీక్ష నిర్వహిం చానని, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిధులు విడుదల చేయిం చుకున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమర్థ వంతంగా పనిచేస్తోందని, అధికారులు సమయం కేటాయించి పనులు వేగంగా పూర్తయ్యేలా మార్గనిర్దేశనం చేస్తున్నారని చెప్పారు. ప్రాజెక్టును ఫాస్ట్‌ట్రాక్‌లో పెట్టామని, ప్రస్తుతం మొత్తం పనుల్లో 89 శాతం మేర పూర్తయ్యాయని వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 2 శాతం పనులు పూర్తి చేస్తే, తమ ప్రభుత్వం రెండేళ్లలోనే 15 శాతం పనులు పూర్తి చేసి రూ.7,100 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు.
సెప్టెంబరులో వెలిగొండ
వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తి చేసి సెప్టెంబరు 1 తేదీన ప్రాజెక్టు ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. గత పాలకులు పనులు పూర్తి కాకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని.. టన్నెల్ బోరింగ్ మిషన్‌ను తీయకుండానే ప్రాజెక్టు పూర్తి అయ్యిందని మభ్య పెట్టారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా అనకాపల్లికి, అనంతరం విశాఖకు గోదావరి జలాలను అందించి తదుపరి గోదావరి-నాగావళి నదుల అనుసంధానాన్ని చేపడతామని వివరించారు. పోలవరం పూర్తయితే ప్రాజెక్టులో 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడుతుందని, వరద జలాల్లో మరో 200 టీఎంసీలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. స్పిల్‌వే, రేడియల్ గేట్లు, కాఫర్ డ్యాం పనులు పూర్తయ్యాయని తెలిపారు. 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకునేలా గేట్ల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. గ్యాప్-1లో 40 శాతం, గ్యాప్-2లో 30 శాతం, గ్యాప్-3లో 100 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రణాళిక ప్రకారమే పనులు సాగుతున్నాయన్నారు.
ప్రాజెక్టు కోసం మొత్తం 94,152 ఎకరాల భూమిని సేకరించామని, అక్టోబర్ 2026 నాటికి భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. పునరావాసం కింద ఇప్పటికే 17,500 కుటుంబాలను తరలించామని, 2027 మార్చి నాటికి మిగిలిన వారందరికీ పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో 17,118 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన పనులు కూడా 2027 మార్చికల్లా పూర్తి అవుతాయని వెల్లడించారు. కుడికాల్వ ఎర్త్ వర్క్స్ 100 శాతం పూర్తయ్యాయని, ఎడమకాల్వ ఎర్త్‌వర్క్స్ 99 శాతం పూర్తయ్యాయని తెలిపారు. కుడికాల్వపై స్ట్రక్చర్లలో మరో 4 శాతం మాత్రమే మిగిలి ఉందని, ఎడమకాల్వ స్ట్రక్చర్లు 83 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులకు వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. లెఫ్ట్, రైట్ ఇరిగేషన్ టన్నెల్ పనులు 100 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోంది
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే ముందు రాష్ట్ర ప్రభుత్వం రూ.4,730 కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. ఫేజ్-1 పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.30,436 కోట్లకు ఆమోదం తెలిపిందని, గత రెండేళ్లలోనే రూ.8,823 కోట్లు విడుదల చేసిం దని తెలిపారు. అందులో రూ.7,100 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ.3,835 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. 22,058 నిర్వాసిత కుటుంబాలకు రూ.2,250 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉందని, ఇంటి స్థలం కొనుగోలు చేసుకునే వారికి అదనంగా రూ.2 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి శుభారంభమని, ప్రజల చిరకాల వాంఛ, దశాబ్దాల కోరిక అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చితో ఫేజ్-1 పూర్తవుతుందని, అనంతరం వెంటనే ఫేజ్-2 పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా అనకాపల్లికి, ఆపై విశాఖకు గోదావరి జలాలు అందించి తర్వాత గోదావరి-నాగావళి అనుసంధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.
గత ప్రభుత్వంలో ఎత్తిపోతల పథకాల నిర్వీర్యం
గత ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను కూడా అటకెక్కించింది. వాటితో పాటు అన్ని సాగునీటి ప్రాజెక్టులను సరిచేస్తే మరో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. పోల వరం ప్రాజెక్టు పనులు సరైన దిశలో సాగుతుండటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. డయాఫ్రం వాల్ దెబ్బతిన్నప్పుడు తీవ్ర మనోవేదనకు గురయ్యా..కొన్ని సందర్భాల్లో నిద్ర కూడా పట్టలేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భగవంతుడి ఆశీర్వా దం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరిగి ప్రాజెక్టు గాడిలో పడిందని తెలిపారు. జలధార కార్యక్రమంపై కూడా సమీక్ష నిర్వహించామని, నీరు ఉన్న ప్రాంతాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడుతు న్నామని తెలిపారు. జలధార-జలహారతి పనులను రూ.3,300 కోట్లతో ప్రారంభించామని, సర్దుబాటు పనుల కోసం ప్రతి జిల్లాకు అదనంగా రూ.2 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రతీ గ్రామంలో కురిసే వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మళ్లించి సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
37 సార్లు సందర్శన..136 సార్లు సమీక్షలు
ప్రాజెక్టులోని ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 2, గ్యాప్ 1 పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు సందర్శనలో భాగంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనుల్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు డ్యామ్ సైట్ వద్ద కాన్ఫరెన్స్ హాలులో అధికారులు, ప్రజా ప్రతి నిధులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 2, గ్యాప్ 1 పనులు నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కుడి, ఎడమ కాలువల కనెక్టివిటీ టన్నెల్ పనులు ఈ నెలాఖరుకు పూర్తి అవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాజక్టు డ్యామ్‌కు చేరుకునే వివిధ రోడ్లు, కుడి, ఎడమ గట్లకు సంబం ధించిన పనులు, గండి పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పునరావాసం, పరిహారం అందించే విషయంలో నిర్వాసితులకు ఇబ్బంది లేకుం డా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే అంశంపై నిరంతరం శ్రద్ధ వహిస్తున్న సీఎం చంద్రబాబు 2014 నుంచి ఇప్పటివరకూ 37 సార్లు ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. అలాగే ప్రాజెక్టు సైట్‌తో పాటు సచివాల యంలో 136 సార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారధి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల శాసనసభ్యులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.













