- గ్రామీణ రూపాంతరమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- చేనేత, హస్తకళల అభివృద్ధి మంత్రి ఎస్ సవిత
- ఘనంగా ఏపీ హస్తకళా మహోత్సవం-2026
విజయవాడ (చైతన్య రథం): రాష్ట్రంలో హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర చేనేత, హస్తకళల అభివృద్ధి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ, లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని బి.ఆర్. అంబేద్కర్ కళా వేదికలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం-2026 ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, హస్తకళల అభివృద్ధి, వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రతి స్టాల్‌ను సందర్శించి కళాకారుల సమస్యలను తెలుసుకోవడం వారికి కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. బొబ్బిలి వీణల తయారీదారులు ఎదుర్కొంటున్న కలప కొరతను తీర్చేందుకు రానున్న ఆగస్టు 15నాటికి వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లేపాక్షి ఆధ్వర్యంలో కళాకారుల ఉత్పత్తుల విక్రయాల కోసం తరంగ యాప్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
దేశవ్యాప్తంగా హస్తకళలకు ప్రకటించిన 30 జాతీయ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అత్యధికంగా 10 అవార్డులు దక్కడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ ప్రాజెక్ట్, నగరవనాలు ఏర్పాటు చేస్తూ పచ్చదనం పెంపొందిస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద రికార్డు స్థాయిలో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు గోకులం షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలను అమలు చేస్తూ హస్తకళాకారులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
చేనేత, హస్తకళల గౌరవ సలహాదారు సుచిత్ర యల్లా మాట్లాడుతూ.. రాష్ట్ర హస్తకళలు, చేనేత వస్త్రాలను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ దిశగా స్పష్టమైన మార్గదర్శకత్వం అందిస్తున్నారని తెలిపారు. ఎర్రచందనం కళాఖండాలు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని చెప్పారు. రాష్ట్రానికి లభించిన 34 క్లస్టర్లు, జాతీయ అవార్డులు, జీఐ ట్యాగ్‌లు మన కళల గొప్పతనానికి నిదర్శనమన్నారు. సాంకేతికంగా ఎంత ముందుకెళ్లినా పర్యావరణ హిత, సురక్షిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు చేనేత వస్త్రాలు ధరిస్తే కళాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. నేటి యువతకు ఇక్కత్, కలంకారీ వంటి సంప్రదాయ కళలను పరిచయం చేస్తూ మన సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి కళాకారులు రూపొందించిన స్వామివారి విగ్రహాన్ని అమెరికాకు పంపగా విశేష ప్రశంసలు లభించడం మన కళాకారుల ప్రతిభకు గర్వకారణమని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ… ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మాటల్లోనే కాకుండా చేతల్లోనూ కళాకారుల పట్ల తన అభిమానాన్ని చాటుతున్నారని అన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హస్తకళల వస్తువులే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. హస్తకళలలో రాష్ట్రం గ్లోబల్ డెస్టినేషన్‌గా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
చేనేత మరియు హస్తకళలు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ (చేనేత మరియు జౌళి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా మాట్లాడుతూ… లేపాక్షి బ్రాండ్ టర్నోవర్ గత రెండేళ్లలో రూ.35 కోట్ల నుంచి రూ.60 కోట్లకు పెరగడం దీని ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. బొబ్బిలి వీణ వంటి ఉత్పత్తులు అంతర్జాతీయ గుర్తింపు పొందాయని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈఆర్పీ ఆధారిత ఐటీ సొల్యూషన్ల ద్వారా వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్, మార్కెట్ ఇంటెలిజెన్స్, ఈ-కామర్స్ కార్యకలాపాలను ఆధునికీకరించామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అవార్డుల్లో దేశవ్యాప్తంగా ప్రకటించిన 30 అవార్డుల్లో 9 అవార్డులు ఆంధ్రప్రదేశ్‌కు రావడం విశేషమన్నారు. రాష్ట్ర చేనేతకు చెందిన 5, హస్తకళలకు చెందిన 11 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ లభించిందని చెప్పారు. రాష్ట్రంలోని రెండు లక్షలకుపైగా హస్తకళాకారుల ఉత్పత్తులకు నాణ్యత పెంచడంతో పాటు వాటి వెనుక ఉన్న ప్రత్యేకతను వివరిస్తూ స్టోరీటెల్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. చిన్న కళాకారుల ఆర్థికాభివృద్ధికి లేపాక్షి బలమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), గౌరవ అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డాక్టర్ పి.వి. చలపతిరావు, చేనేత, హస్తకళల కమిషనర్ రేఖా రాణి, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ వీసీ మరియు మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ మనోహర్, హస్తకళాకారులు, తదితరులు పాల్గొన్నారు.
















