అమరావతి (చైతన్య రథం): దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు సీఎం చంద్రబాబు నాయుడు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెడుతూ.. “జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతన్నలు భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే కార్యక్రమం ఏరువాక. పాడి పంటలతో రైతన్నల ఇళ్లలో వెలుగులు నిండాలని ప్రార్థిస్తున్నా. ప్రకృతిని పూజించే గడ్డపై పుట్టిన మనం.. ఆ సాంప్రదాయాలను పాటిద్దాం. ప్రకృతి సాగుతో పంటలు పండించి మన భూమిని, ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందాం. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుంది. ఇందులో భాగంగానే అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ నిధులు జమ చేసి వారికి అండగా నిలిచాం. ఎల్ నినో, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్ళను రైతన్నలు అధిగమించాలని కోరుకుంటున్నా. ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.













