అమరావతి (చైతన్య రథం): ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (ఏఎసఈ) -మే 2026 ఫలితాలు విడుదలయ్యాయని విద్యా మంత్రి లోకేష్ నారా ప్రకటించారు. పరీక్షలకు హాజరైన 94,990మంది విద్యార్ధుల్లో 78,261మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ఉత్తీర్ణత శాతం 82.39శాతంగా నమోదైంది. గత ఏడాది 76.14శాతంగా ఉన్న ఉత్తీర్ణత శాతం ఈసారి 6.25 శాతం పాయింట్లు పెరగడం విశేషం. ఈ అద్భుత ఫలితాలకు ప్రభుత్వం అమలు చేసిన 20 రోజుల యాక్షన్ ప్లాన్ దోహదపడిందని మంత్రి వివరించారు. ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల అనంతరం విద్యార్థులకు కేంద్రీకృత విద్యా సహాయం, ఇంటెన్సివ్ కోచింగ్ మరియు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం అందించడం ద్వారా ఈ మెరుగుదల సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులందరికీ, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు పాఠశాల యాజమాన్యాలకు మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థుల అకాడమిక్ ప్రయాణంలో మరింత విజయం సాధించాలని ఆకాంక్షించారు.















