- అద్దె చెల్లించకపోగా.. షాపులు ఆక్రమిస్తున్నారు
- అసైన్డ్ భూమిని కబ్జాచేసిన వైసీపీ మాజీ సర్పంచ్
- టీడీపీకి అనుకూలంగా ఉన్నారంటూ కుటుంబంపై దాడి
- టీడీపీ కేంద్ర కార్యాలయ గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు
- అర్జీలు స్వీకరించిన మంత్రులు డోలా, యాతగిరి
- సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
మంగళగిరి (చైతన్య రథం): బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన కొందరు గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి.. “గ్రామంలోని సర్వే నెం.76లో 0.25 సెంట్ల స్థలమును ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ గ్రామ పంచాయతీకి బదిలీ చేసింది. సదరు స్థలము గ్రామ ముఖ్య కూడలిలో ఉండటంతో ప్రజా సౌకర్యార్థం 1997లో బస్‌షెల్టర్ నిర్మించారు. ఇటీవల మాజీ సర్పంచ్ సదరు బస్‌షెల్టర్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పంచాయతీ ఆదాయం కొరకు పదమూడు షాపులు నిర్మించారు. తరువాత ఆ షాపుల్లోని కొన్నింటిని స్థానిక వైసీపీ నాయకులు అనధికారికంగా ఆక్రమించారు. మరికొన్నింటిలో అద్దె కట్టకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు” దీనిపై రెవెన్యూ అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి గ్రామ అభివృద్ధికి సహకరించాలని అర్జీ ఇచ్చారు.
శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఏపీ ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ యాతగిరి రాంప్రసాద్‌లు గ్రీవెన్స్ నిర్వహించి అర్జీలు స్వీకరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చినాపురానికి చెందిన తాడికొండ నాగిరెడ్డి గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి.. “1970లో మా తాతగారు తాడికొండ రెడ్డికి ప్రభుత్వం అసైన్డ్ భూమి మంజూరు చేసింది. ఆ తర్వాత అది వారసత్వంగా ప్రస్తుతం నాకు సంక్రమించింది. సదరు భూమి సర్వే నెం.153/3లో 2.13 ఎకరాలు, సర్వే నెం.228/12లో 0.41 ఎకరాలకు సంబంధించి అడంగల్, రెవెన్యూ రికార్డులు, పంచనామా, స్వాధీన అప్పగింత పత్రాలు ఇతర ఆధారాలు నా వద్దనే ఉన్నాయి. ఈ భూమిలో వైసీపీ మాజీ ప్రెసిడెంట్ జన్ను రాఘవరావు అండదండలతో పండురాజు, గాంధీరాజు కిరణ్ కుమార్ అక్రమంగా ప్రవేశించి చేపల చెరువు తవ్వారు.
అంతేకాకుండా భూమిని పక్కనే ఉన్న 100 ఎకరాల చెరువులో కలిపి చేపలు సాగు చేస్తున్నారు” సదరు భూమిపై విచారణ చేపట్టి తిరిగి తనకు అప్పగించాలని గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చారు. మార్కాపురం జిల్లా, పెద్దారవీడు మండలం, పోతంపల్లె గ్రామానికి చెందిన చెంకెల పాలంకి రెడ్డి గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి.. “గ్రామంలోని సర్వే నెం. 68, సర్వే నెం. 345లో మాకు వారసత్వంగా కొంత భూమి సంక్రమించింది. నేను చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నాను. దీంతో వైసీపీ నాయకులు నాపై కక్ష కట్టారు. నా వల్లనే గ్రామంలో ఓట్లు చీలిపోయాయని పగ పెంచుకున్నారు. సదరు సర్వే భూమిలో ఈ మధ్య ప్రభుత్వం వారు రీ-సర్వే చేస్తున్నారు. మా భూమిని కూడా రీ-సర్వే చేయమనగా వైసీపీ పార్టీకి చెందిన సుమారు 10 మంది వరకు అడ్డుకుంటున్నారు. ఎదురు తిరిగితే మా కుటుంబ సభ్యులపై కర్రలతో, రాళ్లతో దాడి చేయుటకు మూకుమ్మడిగా వచ్చారు. వారి వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉంది.” దీనిపై విచారణ చేపట్టి తమ కుటుంబానికి రక్షణగా నిలవాలని గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చారు.
కర్నూలు పట్టణ కేంద్రం జోహరాపురం గ్రామానికి చెందిన శివ ప్రియ నగర్, సర్వే నెం. 161, ప్లాట్ల ఓనర్స్ అసోసియేషన్ వారు గ్రీవెన్స్‌లో అర్జీ ఇస్తూ.. “మేము గత 30 సంవత్సరాల క్రితం జోహరాపురం గ్రామానికి సంబంధించిన శివ ప్రియ నగర్ సర్వే నెంబరు 161లో 11.27 ఎకరముల విస్తీర్ణంలో భూమి కొనుగోలు చేశాం. అందులో గుడిసెలు నిర్మించుకున్నాం. వాటికి సంబంధించిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్సులు, కరెంటు బిల్లులు కూడా కడుతున్నాము. సదరు స్థలాన్ని పి. బంగారయ్య అనే వ్యక్తి ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. దీనిపై మేము కోర్టుకు కూడా వెళ్లాం. కానీ వాళ్లు న్యాయస్థానం ఉత్తర్వులు పట్టించుకోకుండా మరికొందరికి ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. దీనిపై ఉన్న డబుల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెం. 4357/2026, డబుల్ జీపీఏలను రద్దు చేయాలి” అని గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చారు.
కృష్ణా జిల్లా కోడూరు మండల శివారు గ్రామాలైన హరిపురం, ఉల్లిపాలెం, వేణుగోపాలపురం, సాలెంపాలెం గ్రామాలకు చెందిన కొందరు రైతులు గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి.. “తమ నాలుగు గ్రామాలకు ఈ డొంక రోడ్డుకు ఇరువైపులా సుమారు 400 ఎకరాల మాగాణి భూములు ఉన్నాయి. ఈ గ్రామాల రైతులు పండించిన పంటను బయటికి తీసుకురావడానికి ఈ రోడ్డు మార్గమే సాయపడుతుంది. పొలాల నుంచి పశుగ్రాసం తీసుకురావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది.” ఈ సమస్యపై దృష్టి పెట్టి నాలుగు గ్రామాలకు ఉపయోగపడేలా రోడ్డు నిర్మించాలని అర్జీ ఇచ్చారు. వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా, మరికొందరు ఉద్యోగాల కోసం రెజ్యూమ్‌లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, ఆర్థిక తోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి డోలా, యాతగిరి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.














