- ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి మా ప్రథమ కర్తవ్యం
- గత ఐదేళ్లు సమస్య చెప్పుకునే దిక్కులేకుండా చేశారు
- బ్రిటీష్ దోపిడీకంటే వైసీపీ దోపిడీలే ఎక్కువ
- గొడ్డలి పార్టీకి గడ్డి పెట్టినా బుద్ధి రాలేదన్న మంత్రి కొల్లు
మచిలీపట్నం (చైతన్య రథం): కూటమి ప్రభుత్వానికి ప్రజలే సుప్రీం అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండడం, వారి సమస్యల్ని పరిష్కరించడం కోసమే వారంలో ఒకరోజు తప్పకుండా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. గత ఐదేళ్లు గొడ్డలి పార్టీ రాష్ట్రంలో అలజడులు సృష్టించడం, గొడవలు చేయడం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ నేడు ప్రజల నుండి సమస్యలన్నీ తెలుసుకుని పరిష్కరిస్తున్నాం. మచిలీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 408 ఫిర్యాదులు రాగా 318 పరిష్కరించాం. మిగిలినవి కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
“2014-19 మధ్య రాష్ట్రాన్ని ఒక్కో ఇటుక పేర్చి నిర్మించుకున్నాం. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. దోపిడీయే పరమావధిగా పీడించారు. ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి జేబులు నింపుకున్నారు. ప్రభుత్వ ఖజానాను ఊడ్చిపడేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ రాష్ట్ర నిర్మాణం చేపట్టాం. ఇబ్బందులన్నింటినీ ఎదురొడ్డి పోరాడుతున్నాం. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. సూపర్ సిక్స్ పథకాలన్నీ సూపర్ హిట్ చేశాం.
గత ఐదేళ్లు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారు. లులూ, అమరరాజా లాంటి ప్రఖ్యాత కంపెనీలు ఏపీని వదిలి వెళ్లిపోయేలా చేశారు. కానీ నేడు ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పునఃప్రతిష్టించడంతో ఏపీకి పరిశ్రమలు క్యూ కట్టాయి. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల మంది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాం. గుంతలు లేని రోడ్లను సాకారం చేసి చూపించాం. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాం. 2027 పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమలో హంద్రీనీవా పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం. మేము అభివృద్ధిపై దృష్టి పెట్టి పని చేస్తుంటే.. జగన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు. వెన్నుపోటు అంటూ ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. జగన్ రెడ్డిని మించిన వెన్నుపోటుదారుడు దేశంలో ఎవరైనా ఉన్నారా? 151 మంది ఎమ్మెల్యేలుండి కూడా ఐదేళ్లలో ఈ గొడ్డలి పార్టీ కనీసం అభివృద్ధి చేయలేదు. కానీ నేడు పోలవరం, అమరావతి, స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ లాంటి అనేక ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి.
లక్ష కోట్లతో పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లక్షన్నర కోట్లతో అనకాపల్లిలో అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశాం. లక్ష కోట్లతో గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాం. రాయలసీమలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు తయారీ సంస్థ వచ్చింది. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు చేశాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో పోర్టులు పూర్తి చేస్తున్నాం. అన్ని ప్రాంతాలను అనుసంధానిస్తూ రోడ్లు నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక జగన్ రెడ్డి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు. ఐదేళ్లు రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిందే కాక.. ఇప్పుడు మళ్లీ కుట్రలు చేస్తున్నాడు. బ్రిటీషర్ల దోపిడీ కంటే జగన్ రెడ్డి దోపిడీయే ఎక్కువ అన్నట్లు తయారైంది. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. బాబాయిని గొడ్డలి వేటు వేసిందే కాక.. న్యాయం చేయమన్న సోదరిపై నెపం నెట్టి వెన్నుపోటు పొడిచాడు.
జగన్ రెడ్డి లాంటి అరాచక శక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజాప్రతినిధులంతా పోటీపడి నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. గ్రామ స్థాయి నుండి మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త, నాయకుడు తీసుకోవాలి” అని మంత్రి కొల్లు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ, బాబాప్రసాద్, పట్టణాధ్యక్షులు లోగిశెట్టి స్వామి, గ్రామీణ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.














