- కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్!
- అమరావతి సంస్కృతి, హస్తకళకు దేశ రాజధాని సాక్షిగా గౌరవం
న్యూఢిల్లీ (చైతన్య రథం): “ఐదు కోట్ల ఆంధ్రుల దశాబ్దాల నిరీక్షణకు, వేలాది రైతుల త్యాగానికి ఎట్టకేలకు ఒక చట్టబద్ధమైన విజయం లభించింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయం. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన తరుణంలో, రాష్ట్ర విద్యా, ఐటీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో ఒక ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. తనను గెలిపించిన రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గ నేతన్నల నైపుణ్యానికి ప్రతీకగా, అత్యంత నైపుణ్యంతో నేసిన మంగళగిరి చేనేత శాలువాతో ప్రధాని మోదీని లోకేష్ ఘనంగా సత్కరించారు. మన సంస్కృతిని, హస్తకళను దేశ రాజధాని నడిబొడ్డున గౌరవించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఏపీ అసెంబ్లీ పంపిన తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరిగింది. దేశంలోని అన్ని పార్టీలను అమరావతివైపు నిలిపి, బిల్లుకు చట్టబద్ధత వచ్చేలా చేసిన ప్రధాని వ్యూహాన్ని లోకేష్ కొనియాడారు. బిల్లు ఆమోదం పొందిన వెంటనే మంత్రి లోకేష్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకుని, కూటమి పార్టీల ఎంపీలను అభినందించారు. “ఇచ్చిన మాటకు కట్టుబడి, కేంద్ర ప్రభుత్వం అమరావతికి అండగా నిలిచింది” అని లోకేష్ ఈ సందర్భంగా ప్రశంసించారు. గతంలో అమరావతి విషయంలో ఏర్పడిన అనిశ్చితికి ఈ బిల్లుతో తెరపడింది. పార్లమెంటు సాక్షిగా జరిగిన ఈ ఆమోదం, అమరావతి నిర్మాణానికి అడ్డంకులు తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును ఎవరూ అడ్డుకోలేని విధంగా బలమైన పునాది వేసింది.“ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరింది. అమరావతి అంటే కేవలం నగరం కాదు, అది ఆంధ్రుల ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవానికి పట్టాభిషేకం చేసిన ప్రధానికి ధన్యవాదాలు.” అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుందని వ్యాఖ్యానించారు.













