- యూనిట్, బూత్‌లను బలోపేతంచేయాలి
- ఒక వ్యవస్థలా టీడీపీని తీర్చిదిద్దుతాం
- వినే నాయకుడు చంద్రబాబు ఉండటం మన అదృష్టం
- మీరంతా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నేతలు
- క్లస్టర్ ఇన్‌ఛార్జిలతో ‘కాఫీ కబుర్లు’లో లోకేష్ దిశానిర్దేశం
మంగళగిరి (చైతన్య రథం): టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్లస్టర్ ఇంఛార్జ్‌లకు శిక్షణ తరగతుల్లో భాగంగా ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “మిమ్మల్నందరినీ నాయకులుగా చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌గా మిమ్మల్ని చూస్తున్నాం. రాబోయే నాలుగు దశాబ్దాలు పార్టీ ఏవిధంగా నడవాలో ఇక్కడున్న మీరే నిర్ణయించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ లాంటిది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రెండో ముఖ్యమంత్రి తెలుగుదేశం ప్రొడక్ట్. టీడీపీ నాయకులను తయారుచేసే కార్ఖానా. తెలుగుదేశం పార్టీ నిరంతరం మారుతూ వచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ నిరంతరం మారుతూ ఉండాలి. గ్రామస్థాయి నాయకుడు బాగా పనిచేస్తే వారిని గుర్తించి పొలిట్ బ్యూరోలో కూర్చోబెట్టాలి. రాబోయే పొలిట్ బ్యూరోలో మీరు ఆ మార్పును చూడబోతున్నారు. మనందరి అదృష్టం వినే నాయకుడు చంద్రబాబు ఉన్నారు. పార్టీలో మార్పులు రావాలని, యువకులు రావాలని, పార్టీనీ మరింత బలోపేతం చేయాలని ఆయన మాకు దిశానిర్దేశం చేశారు. అందుకే మార్పులు తీసుకువచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం” అన్నారు.
ఆశించిన మార్పు రావాలంటే కష్టపడాలి
“కార్యకర్తే అధినేత అనే శాసనాన్ని అందరూ పాటించాలి. క్లస్టర్ ఇంఛార్జ్‌లు తమ పరిధిలోని యూనిట్, బూత్‌ల బలోపేతానికి కృషిచేయాల్సిన బాధ్యత ఉంది. మనం ఆశించిన మార్పు పార్టీలో తీసుకురావాలంటే చాలా కష్టపడాలి. పార్టీలో సంస్కరణల కోసం నేను చాలా పోరాడాను. పార్టీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత తూచా తప్పకుండా అమలుచేయాలి. చంద్రబాబు గారే మన అధినేత. మనందరం కార్యకర్తలం. ఆయనే మన సేనాధిపతి. మనం సైనికులం. దీనిని ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంతకాలమైనా పార్టీలో అంతర్గతంగా పోరాడాలి. పార్టీ ఆరు శాసనాలను ముందుకు తీసుకెళ్లాలి. పార్టీ నేతలు అలక వీడాలి. 2019-24 మధ్య ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనం దేవాలయం అయిన పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారు. చంద్రబాబు గారిని 53 రోజుల పాటు అక్రమంగా జైలులో నిర్బంధించారు. అమర్నాథ్ గౌడ్, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఓంప్రతాప్ ను చంపారు. డాక్టర్ సుధాకర్ ను హింసించారు. అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్యను చంపారు. కోడెల శివప్రసాదరావును వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకువచ్చారు” అన్నారు.
తెలుగుదేశం పార్టీ శాశ్వతం
“దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఈ విధంగా శిక్షణ తరగతులు నిర్వహించడం లేదు. పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఈ భూమిపైన మీరు, నేను శాశ్వతం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ శాశ్వతం. ఒక వ్యవస్థలా తయారుచేయాలనేది నా లక్ష్యం. వ్యవస్థలో ఎప్పుడైతే నా అవసరం ఉండదో నేను విజయం సాధించినట్లు. వ్యవస్థ బలోపేతం కోసం అందరూ కృషిచేయాలి. ‘మై టీడీపీ’ యాప్ ద్వారా పార్టీలో కష్టపడి పనిచేసే వారిని గుర్తిస్తాం. పనిచేసే వారిని డైరెక్ట్ గా చంద్రబాబు గారు గుర్తించి పదవులు ఇస్తున్నారు. ఎవరి సిఫార్సులు చెల్లవు. ‘మై టీడీపీ’ యాప్ ద్వారా ఎవరైనా తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు” అని పేర్కొన్నారు.
జగన్‌రెడ్డికి క్రెడిట్ చోరీ డిజార్డర్ వ్యాధి
“జగన్‌రెడ్డి క్రెడిట్ చోరీ డిజార్డర్ (సీసీడీ) వ్యాధితో బాధపడుతున్నారు. అనకాపల్లిలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, విశాఖలో డేటా సెంటర్, అనంతపురంలో కియా కార్ల పరిశ్రమ, భోగాపురం విమానాశ్రయం, బల్క్ డ్రగ్ పార్క్‌వంటి పరిశ్రమలు తానే తెచ్చానంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. ఆ జబ్బునుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా” అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.
ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి
“వైసీపీ అహంకార ధోరణి వల్ల 151 సీట్లు 11 అయ్యాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు ఓర్పు, సహనంతో వ్యవహరించాలి. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి. ప్రతి బూత్ కు వెళ్లడం ద్వారా 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో విజయం సాధించాం. పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు వంటిది. పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం. పార్టీ వల్లే మనకు ఈ గౌరవం లభిస్తోంది. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే చంద్రబాబు గారి కృషే కారణం. కలిసికట్టుగా పనిచేయాలి. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడాలి. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలుచేయాలి” అని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ నిర్దేశించారు.















