- పోలీస్ యంత్రాంగానికి ముఖ్యమంత్రి ఆదేశాలు
- పేలుడు పదార్థాల నిల్వలపై దష్టి పెట్టాలన్న చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో బాణాసంచా తయారీ యూనిట్లు, పేలుడు పదార్ధాల నిల్వలపై కఠినవైఖరి అవలంభించాలని పోలీస్ యంత్రాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రెండో రోజు శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షిస్తూ.. వేట్లపాలెం బాణాసంచా పేలుడు ప్రమాదంపై కీలకంగా చర్చించారు. చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… “బాణాసంచా తయారీ యూనిట్లపై గట్టిగానే వ్యవహరించండి. ఎక్స్‌ప్లోజివ్స్ ఎక్కడున్నా నిరంతరం తనిఖీలు చేస్తూ ఉండాలి. నిల్వలు, ప్రమాణాలు, నిబంధనల మేరకు ఉన్నాయో లేదో సీరియస్‌గా పరిశీలించాలి. క్షేత్రస్థాయిలో నిల్వలున్న చోట్ల తనిఖీ చేసి తక్షణ చర్యలు చేపట్టాలి. బాణాసంచా, ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్స్ ఇళ్లల్లో పెట్టినా.. పెద్దఎత్తున నిల్వ చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు. బాణాసంచా తయారీ చేస్తున్న వారెవరైనా నిబంధనలు ఉల్లంఘించి నిల్వలు పెడితే.. వారిపట్ల కఠినంగా వ్యవహరించండి. స్టోరేజ్ పాయింట్స్‌తోపాటు ఇప్పటి వరకూ మంజూరు చేసిన లైసెన్సులను కూడా సమీక్షిస్తుండాలి. 15 రోజుల్లోగా ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్స్ నిల్వ చేసినచోట తనిఖీ చేసి చర్యలు తీసుకోండి. భవిష్యత్తులో సమస్య రాకుండా అన్ని జాగ్రత్తలతో బాణాసంచా తయారు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి. శివకాశీలో అంత పెద్దఎత్తున బాణాసంచా తయారీ జరుగుతున్నా.. ఎక్కువ ప్రమాదాలు జరగకపోవటానికి గల కారణాల్ని అధ్యయనం చేయాలి. రాష్ట్రంలో 95 బాణాసంచా యూనిట్‌లలో ఎలాంటి ఉల్లంఘనలు ఉన్నాయో తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.














