- యువగళం పాదయాత్రలోనే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన
- రియల్ టైం గవర్నెన్స్ విభాగ సాయంతో సులువుగా అమలు
- అరచేతికి పౌరసేవలను అందించడమే ప్రాజెక్టు ధ్యేయం
- లోపాలను సరిదిద్దడానికి ఇంటారాక్టివ్ విధానం అమలు
- మెటా నిర్వహించిన సమావేశంలో మంత్రి నారా లోకేష్
న్యూఢిల్లీ (చైతన్య రథం): యువగళం పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రజలు వ్యక్తంచేసిన ఆకాంక్షే ‘మనమిత్ర’ వాట్సాప్ సేవలకు ప్రేరణగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు. మెటా ఆధ్వర్యాన వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరమ్ ఆధ్వర్యాన న్యూఢిల్లీలో జరిగిన సమావేశానికి మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. కార్యక్రమానికి మెటా భారత వైస్ ప్రెసిడెంట్, సౌత్ ఈస్ట్ ఆసియా హెడ్ సంధ్యా దేవనాథన్ సంధానకర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… పౌరసమాజ విశ్వాసానికి కేంద్రంగా ‘మనమిత్ర’ సేవలు ఉండాలన్న లక్ష్యం.. అధికార యంత్రాంగం ఆలోచనా విధానాన్ని మార్చిందన్నారు. ఫైర్ సైడ్ చాట్‌లో సంధ్యా దేవనాథన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు.
సంధ్యా దేవనాథన్: బహుశా మీకు పౌర సేవల లభ్యత గురించి తెలిసి ఉండొచ్చు. అసలు ఈ ఆలోచన మీకు మొదట ఎలా వచ్చిందో చెప్పగలరా? ఎందుకంటే ఇది చాలా పరివర్తనాత్మకమైనది. మేము కొన్ని పైలట్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాం. వాటితో పోలిస్తే ఇది విభిన్నం?
నారా లోకేష్: యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో నాకు వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన వచ్చింది. ఒక బటన్ నొక్కితే కిరాణా సరుకులు వస్తున్నాయి. టాక్సీ వస్తోంది. సినిమా చూడగలుగుతున్నాం. మరి పౌరసేవలను అందించడంలో ప్రభుత్వం ఎందుకు చురుకుగా వ్యవహరించడం లేదు? అని పాదయాత్ర సమయంలో ప్రజలు నన్ను అడిగారు. పౌరసేవలను సులభతరం చేసి ‘ఈజ్ ఆఫ్ లివింగ’ కల్పిస్తామని అప్పట్లో వాగ్దానం చేశాను. పౌర సేవలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫారమ్, ఒకే ఫోన్ నంబర్‌పైకి తీసుకువస్తామని ఎన్నికల సమయంలోనూ చెప్పాను. భారతదేశంలో ప్రతి ఒక్కరూ వాట్సాప్‌పై ఆసక్తిగా ఉన్నారని నేను గ్రహించాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేం మెటా సంస్థను సంప్రదించాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షే “మనమిత్ర” ప్లాట్‌ఫాంకు ప్రేరణ.
సంధ్యాదేవనాథన్: ఈ ప్రాజెక్ట్‌ను ఏపీలో మేం 60 రోజుల్లో పూర్తి చేయడానికి అంగీకరించాము. కానీ ప్రారంభించడానికి 90 రోజులు పట్టింది. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో 160 సేవలతో ప్రారంభించాము. ఇప్పుడు వివిధ విభాగాలలో దాదాపు 900 పౌర సేవలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ సేవా విధానం నుంచి డిజిటల్ విధానానికి మారడానికి ఎలాంటి ఆలోచనా విధాన మార్పులు అవసరమయ్యాయి?
నారా లోకేష్: ఇక్కడ అతిపెద్ద సవాలు అంతర్గత రాజకీయాలు. ప్రతి శాఖ వారి అనుభవాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకోవాలని కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టే విషయం ఏమిటంటే, మాకు ‘రియల్-టైమ్ గవర్నెన్స’ అనే వ్యవస్థ ఉంది. వాస్తవానికి ఇది ఒక మంత్రిత్వ శాఖ. అందరినీ కూర్చోబెట్టి చర్చించి, వారి ఏపీఐలను (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేజ్)లను తెరిచేలా చేయడమే అతిపెద్ద సవాలు. సాంకేతికత అనేది కేవలం సాధనం మాత్రమే. కానీ నిజమైన మార్పు సాంస్కృతికంగా జరగాలి. మంత్రులు, కార్యదర్శులతో నేను దీనిగురించి చాలా ఓపెన్‌గా చర్చలు జరపాల్సి వచ్చింది. ఇది ముఖ్యమంత్రి ఆదేశమని స్పష్టం చేశాను. మేము ఎక్కువ ట్రాఫిక్ ఉన్న (ఎక్కువగా ఉపయోగించే) సేవలతో ప్రారంభించి, తర్వాత తక్కువగా ఉపయోగించే సేవలవైపు వెళ్లాము. ప్రతి క్యాబినెట్ సమావేశంలో మా చర్చల్లో ఇది భాగంగా ఉండేది. అక్కడ ముఖ్యమంత్రి “ముందుగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురండి” అని చెప్పేవారు. మేము మెనూ- ఆధారిత విధానం నుండి సంభాషణాత్మక ఏఐని ఉపయోగించి మరింత ఏఐ-ఆధారిత విధానానికి వెళ్లాలనుకుంటున్నాము. దీనికి రాజకీయ సంకల్పం చాలా ముఖ్యం. నేను నా బృందానికి పౌర సమాజ విశ్వానికి కేంద్రంగా ఈ సేవలు అందుబాటులో ఉంచుదామని చెప్పాను. అది మా మొత్తం ఆలోచనా విధానాన్నే మార్చేసింది.
సంధ్యాదేవనాథన్: మీకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వచ్చింది? పౌరుల జీవితంలో గణనీయమైన మార్పులు వచ్చిన ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా?
నారా లోకేష్: గతంలో హాల్ టిక్కెట్లు పొందడం చాలా ఇబ్బందిగా ఉండేది. మేం మొదటిరోజు నుండే వాటిని వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం వల్ల పిల్లలు వాటిని సులభంగా పొందే వీలు కలిగింది. ఇప్పుడు హాల్‌టిక్కెట్ల కోసం వారు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. దీనివల్ల సమయం, శ్రమ ఆదా అయ్యాయి. విద్యుత్, ఇతర బిల్లులు చెల్లించడం కూడా ఒక గొప్ప మార్పు. మేము ఫీడ్‌బ్యాక్ సేకరించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాము. దాని ఆధారంగా వివిధ విభాగాలకు ర్యాంకులు ఇస్తాము. ముఖ్యమంత్రి దీనిని వారం వారం సమీక్షిస్తుంటారు. మంత్రులు, కార్యదర్శులకు ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. 1నుంచి 10 స్కేల్‌లో పౌరులు మాకు 8.5 లేదా 9 రేటింగ్ ఇస్తున్నారు. కానీ నేను మాత్రం 3 మాత్రమే ఇస్తాను. మేము ఏఐ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సి ఉంది.
సంధ్యా దేవనాథన్: రాష్ట్ర బడ్జెట్‌లో వాట్సాప్ గవర్నెన్స్‌ను అధికారికంగా చేర్చిన మొదటి రాష్ట్రం మీదే. ఏఐ పర్సనల్ అసిస్టెంట్లు లేదా ప్రిడిక్టివ్ అలర్ట్స్‌వంటి అధునాతన ఫీచర్లను ఏకీకృతం చేయడంలో మీ విజన్ ఏమిటి?
నారా లోకేష్: భారతదేశం ఏఐని స్వీకరించడం ప్రస్తుతం అత్యవసరం. మా డేటా లేక్ ప్రాజెక్ట్.. పౌరుడిని కేంద్రంగా చేసుకొని డేటా పటిష్టంగా ఏకీకృతమయ్యేలా చేస్తుంది. ఉదాహరణకు మేము ఒకసారి జనన ధృవీకరణ పత్రాన్ని జారీ చేసిన తర్వాత, ప్రాథమిక రూల్ ఇంజిన్‌లను ఉపయోగించి అనేక ఇతర విషయాలను స్వయంచాలకంగా ఏకీకృతం చేయవచ్చు. వెర్షన్ 1 అని పిలిచే మెనూభాగాన్ని మేము పూర్తి చేసాము. ఇప్పుడు మేము రాబోయే 90 రోజుల్లో వెర్షన్ 2.0 పూర్తిచేయాలి. విద్యుత్ బిల్లులు, ఆస్తిపన్నులవంటి ఆర్థిక లావాదేవీలపట్ల మేము ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.
సంధ్యా దేవనాథన్: వాట్సాప్ సేవలను ఉపయోగిస్తున్న కుటుంబాలు సుమారు 30శాతం వరకూ ఉన్నాయి. గ్రామీణ కుటుంబాలు, రైతులకు ఇది ఎలా పని చేస్తోంది?
నారా లోకేష్: గ్రామీణ వినియోగదారులు కూడా ఇప్పుడు వాట్సాప్ సేవలకు అలవాటుపడుతున్నారు. రైతులు ఏయే ప్రభుత్వ సేవలకు అర్హులో అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకమైనది. పథకాల పంపిణీ సమయంలో, వారు సంతృప్తి చెందారో లేదోనని అడగడానికి దీనిద్వారా మేము వారిని స్వయంగా సంప్రదించవచ్చు. వారికి ఏదైనా లబ్ధి చేకూరకపోతే, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే తమ మొబైల్ ఫోన్‌నుండే వారు ఫిర్యాదు చేయవచ్చు. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ఎన్ని పరిష్కారమయ్యాయి? అని చూసేందుకు మాకు ఇది తోడ్పడింది. మేము దీన్ని ఆన్‌లైన్‌లోనే చేయాలని పట్టుబట్టాము. ఎందుకంటే అక్కడ తగినంత భద్రత, రక్షణ ఉంటుంది.
సంధ్యా దేవనాథన్: వాట్సాప్ గవర్నెన్స్‌లో ఏ సేవలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మీరు గమనించిన మెరుగుదల ఏమిటి?
నారా లోకేష్: యుటిలిటీ చెల్లింపులు, హాల్ టిక్కెట్లు, పరీక్షా ఫలితాలు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. మా పౌరసేవల సంతృప్తి స్కోర్‌లు మెరుగుపడుతున్నాయి. మాకు తక్కువ రేటింగ్ వచ్చినప్పుడు లోపాలను సరిదిద్దడానికి మేము ఇంటరాక్టివ్ విధానాన్ని ఉపయోగిస్తున్నాము. అయితే, ఇందులో పటిష్టమైన డేటా లేక్ చాలా కీలకం. డేటా సెట్‌లు వేర్వేరుగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ మొదటి 150 సేవలకుమించి విస్తరించలేదు. ప్రతి ప్రక్రియను ప్రశ్నించే అవకాశాన్ని కూడా ఇది అందిస్తుంది. మేము ప్రాసెస్ రీ-ఇంజనీరింగ్ చేస్తున్నాము. వ్యవస్థను ప్రతిస్పందించే విధంగా కాకుండా చురుకుగా ఉంచడానికి ఏ దశలను తొలగించవచ్చని ప్రశ్నిస్తున్నాము. ఉదాహరణకు కుల ధృవీకరణ పత్రంకోసం, మీరు మళ్లీమళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండకూడదు. ఇది ఒకసారి వివరాలు ఇస్తే తర్వాత దానంతట అదే అందించే ఒక ఫ్రేమ్‌వర్క్ ఉండాలి. బ్లాక్‌చెయిన్ ద్వారా ట్రాక్-అండ్-ట్రేస్‌తో ఒక క్యూఆర్ కోడ్‌పై ఉంచాలి. ఒక పౌరుడి దైనందిన జీవితంలో సాధారణ పౌరసేవల కోసం రాజకీయ నాయకులు, అధికారులవద్దకు వెళ్లకుండా చేస్తామో.. ఆ రోజు మనం విజయం సాధించినట్టని నేను నా ఐటీ సెక్రటరీకి చెబుతుంటాను.
సంధ్యా దేవనాథన్: ఇతర రాష్ట్రాలకు మీరు ఎటువంటి సలహాలిస్తారు?
నారా లోకేష్: ఒకటి, బలమైన డేటా లేక్. రెండవది ఇది వ్యూహాత్మకంగా దీనిని కీలకమైన ప్రాజెక్ట్ అని విశ్వసించే రాజకీయ సంకల్పం. ఇది మేం ప్రజలకు ఇచ్చిన ఒక ఎన్నికల హామీ. దానిని విజయవంతం చేసేందుకు ఎంతో శ్రద్ధ వహించాం. విభాగాల్లో అలసత్వం రాకుండా చూసేందుకు, ఇది ఎల్లప్పుడూ అత్యున్నత ప్రాధాన్యతగా ఉండేలా మీరు చూసుకోవాలి. ఒక ఏడాది తరువాత, మనం పరిపూర్ణతకు దగ్గరగా ఉండే ఒక నమూనాను కలిగి ఉంటామని నేను నమ్ముతున్నాను.













