- కాకినాడ, అమలాపురం పార్లమెంటు
- ప్రజాప్రతినిధులతో మంత్రి లోకేష్ ఆత్మీయ కలయిక
ఉండవల్లి (చైతన్య రథం): ఆత్మీయ ఆతిథ్యానికి చిరునామా అయిన గోదావరి జిల్లా పరిధి కాకినాడ, అమలాపురం పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు వారి కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో మంగళవారం ఇచ్చిన విందు ప్రేమ ఆప్యాయతలతో సాగింది. గోదావరి జిల్లాలకు వెళితే ఎంత చక్కటి ఆతిథ్యం ఇస్తారో.. అదే అతిథి మర్యాదలతో ఆత్మీయ కలయిక ఆనందంగా గడిచింది. గోదావరి జిల్లాకే ప్రత్యేకమైన రుచులు, చిత్రాలు, ప్రతిమలతో ఆతిథ్యం ఇచ్చిన లోకేష్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా లోకేష్ నేతలపై ఓ బాధ్యత మోపారు. తన తమ్ముడు, అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగికి మూడు నెలల్లో పెళ్లి చేయాలని, సంబంధాలు చూడాలని ప్రజాప్రతినిధులను కోరారు. ప్రేమ పెళ్లిళ్ల గురించి ఆసక్తికరమైన చర్చ సాగింది. ప్రేమించి, ఇరుపక్షాలనూ ఒప్పించి పెళ్లి చేసుకున్నామని.. ప్రేమ వివాహమే మా జీవితాలకు వెలుగునిచ్చిందని ఎంపీ సానా సతీష్‌బాబు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తమ ప్రేమ పోరాటాలను, పెళ్లి విజయాలను చెప్పారు. ఆయా ప్రజాప్రతినిధులు తమ పరిధిలో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం కోసం మంత్రి నారా లోకేష్‌కు ఇచ్చిన దరఖాస్తుల తాజాస్థితిని తెలుపుతూ ఓ నివేదికను ప్రజాప్రతినిధులకు అందజేశారు. తన ఆహ్వానాన్ని మన్నించి ఆత్మీయ కలయికకు హాజరైన ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులకు మంగళగిరి పట్టుచీరలను లోకేష్ బహూకరించారు. ఈ ఆత్మీయ కలయికకు కాకినాడ పార్లమెంటు నుంచి ఎంపీ సానా సతీష్ బాబు (రాజ్యసభ), ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ (ప్రత్తిపాడు), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ సిటీ) పంతం వెంకటేశ్వరరావు (కాకినాడ రూరల్ జనసేన), జ్యోతుల వెంకట అప్పారావు నెహ్రూ (జగ్గంపేట), ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, పిడుగు హరిప్రసాద్… అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగి, ఎమ్మెల్యేలు మంత్రి వాసంశెట్టి సుభాష్ (రామచంద్రాపురం), దాట్ల సుబ్బరాజు (ముమ్మిడివరం), అయితాబత్తుల ఆనందరావు (అమలాపురం), దేవ వరప్రసాద్ (రాజోలు జనసేన), గిన్ని సత్యనారాయణ (పి గన్నవరం జనసేన), బండారు సత్యానందరావు (కొత్తపేట), వేగుళ్ల జోగేశ్వరరావు (మండపేట) కుటుంబాలతో హాజరయ్యారు.





