- ఐకానిక్ టవర్లలో శాఖలకు భవనాలపై చర్చ
- తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సెక్రటేరియట్ల పరిశీలనకు నిర్ణయం
- శాఖల వారీగా కోఆర్డినేటర్లు..అభిప్రాయ సేకరణకు ఆదేశం
- వివరాలు వెల్లడించిన పురపాలక మంత్రి నారాయణ
అమరావతి(చైతన్యరథం): రాజధానిలో నిర్మించే ఐకానిక్ భవనాల్లో ఏ శాఖకు ఎంతెంత కేటాయించాలని దానిపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రాజధానిలో సాధారణ పరిపాలన శాఖ టవర్‌తో పాటు నాలుగు హెచ్‌వోడీ టవర్లను ప్రభుత్వం నిర్మి స్తుంది..ఈ టవర్లను ఐకానిక్ భవనాలుగా నిర్మించేలా ప్రభుత్వం డిజైన్లు రూపొందించింది. ఇప్పటికే పనులు కూడా ప్రారంభం అయ్యాయి. గతంలో సెక్రటేరియట్‌లో కేవలం ముఖ్య కార్యదర్శుల తో పాటు ఆయా శాఖలకు చెందిన సెక్షన్లు మాత్రమే ఉండేవి. కానీ కొత్తగా నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల్లో సెక్రటేరియట్ విభాగా లతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్ కార్యాల యాలు కూడా ఒకేచోట ఉండేలా నిర్మాణం చేస్తున్నారు. అంటే రాష్ట్రస్థాయి కార్యాలయాలకు చెందిన అన్ని విభాగాలు ఒకే చోట ఉంటాయన్న మాట. దీనికోసం ఏ శాఖకు ఎంత స్థలం అవసరం అవుతుంది అనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం నియమించింది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, మనోహర్, బాల వీరాంజనేయ స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ మొదటి సమావేశం ఇవాళ సెక్రటేరియట్‌లోని రెండో బ్లాక్‌లో జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
సబ్ కమిటీ సమావేశంలో ఐకానిక్ భవనాల నిర్మాణం, పార్కింగ్ సదుపాయాలు వంటి అంశాలతో పాటు రాష్ట్రస్థాయి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై చర్చించినట్లు మంత్రి చెప్పారు. శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు, వారికి కావాల్సిన స్థలం, సదుపాయాలపై చర్చించాలని అధికారులకు ఆదేశించినట్టు చెప్పారు. 2014-19 మధ్యలో 52.72 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో భవనాలు డిజైన్ చేశామని..దీంట్లో 31.71 లక్షల చదరపు విస్తీర్ణంలో కార్పెట్ ఏరియాలో ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న అవసరాలపై పూర్తిగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు కేబినెట్ సబ్‌కమిటీ నియమించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 39,882 శాంక్షన్ పోస్టులు ఉన్నాయన్నారు. అయితే ఖచ్చితమైన లెక్కల కోసం ప్రతి డిపార్ట్‌మెంట్ నుంచి ఒకరిని నామినేట్ చేయాలని సీఎస్‌ను కోరుతామని చెప్పారు. 2014-19లో 26,700 మంది ఉద్యోగులు ఉంటారని… దానికి తగినట్లుగా భవనాలు డిజైన్ చేశామని చెప్పారు.. మరోవైపు ఇటీవల కొత్తగా నిర్మించిన నయా రాయపూర్, హైదరాబాద్‌లోని సచివాలయాలను కూడా పరిశీలిం చాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. వచ్చే సోమవారం మరోసారి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై ఆయా అంశాలపై చర్చిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శొంఠి శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
















