- యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించడంపై దష్టిపెట్టండి
- అందుకు అనుగుణంగా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలి
- జాబ్ క్యాలెండర్‌తోపాటే వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకీ కసరత్తు
- ఏపీ ఎస్ఎస్‌డీసీ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
- కోచింగ్ సెంటర్ల నిర్వహణపై సుప్రీం మార్గదర్శకాల అమలుపైనా చర్చ
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో పెద్దఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్న తరుణంలో ఉపాధి కల్పనపైనే యంత్రాంగం దృష్టిపెట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో గురువారం ఏపీ ఎసఎస్‌డీసీ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రౌండ్ అయిన పరిశ్రమల్లో ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అధికారులు రూట్ మ్యాప్ రూపొందించాలని లోకేష్ సూచించారు. ఇప్పటికే గ్రౌండ్ అయిన పరిశ్రమల్లో పెద్దఎత్తున యువతకు ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి సారించాలన్నారు. రిలయన్స్ సీబీజీ, జూపిటర్, లారెన్స్ ఫార్మా, హెట్రో డ్రగ్స్‌తోపాటు రాష్ట్రంలో కొత్తగా వస్తున్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి యువతకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేపట్టాలని సూచించారు. ఇందుకు అవసరమైన కరిక్యులమ్ రూపకల్పనలో ఆయా రంగాల్లో పేరుగాంచిన పరిశ్రమల సలహాలను తీసుకోవాలన్నారు. “ఇప్పటికే కొన్ని ప్రధాన సంస్థలు నేరుగా స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణా కేంద్రాలను నెలకొల్పాయి. వాటిని అధ్యయనం చేసి.. అదేతరహాలో ఐటీఐలకు అనుబంధంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యేలా చూడాలి. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మూడునెలలకోసారి నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయి. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలి” అని లోకేష్ దిశానిర్దేశం చేశారు.
త్వరలో ఏఐ ఆధారిత నైపుణ్యం పోర్టల్
నైపుణ్యం పోర్టల్‌పై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ… సాధ్యమైనంత త్వరలో పోర్టల్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ… ఇందుకు సంబంధించి ఇప్పటికే మాడ్యూల్స్ సిద్ధమయ్యాయి. 25 రంగాలకు సంబంధించి డేటా ఇంటిగ్రేషన్ పూర్తైంది. వాటిలో 1,14,899 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 3,100 విదేశీ ఉద్యోగాలూ ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 16మంది రిక్రూటర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇందులో ట్రయల్ బేసిస్‌లో ఇప్పటికే 20వేలమందికి పైగా విద్యార్థులు, 60వేలమంది జాబ్ సీకర్స్‌కు విజయవంతంగా కీలకమైన ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించాం” అని మంత్రి లోకేష్ దష్టికి తీసుకొచ్చారు.
అధ్యాపక పోస్టుల భర్తీపై సమీక్ష
రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి లోకేష్ అధికారులతో సమీక్షించారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా గత ఏడాది నిర్వహించిన డీఎస్సీ తరహాలో ఉగాదికి విడుదల చేయబోయే జాబ్ క్యాలండర్‌లో అధ్యాపక పోస్టుల నోటిఫికేషన్ కూడా ఇచ్చి, భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన విదేశీ యూనివర్సిటీలకు (ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్)కు ప్రోత్సాహకాలు, విధివిధానాలపై చర్చించారు. విద్యార్థుల ఆత్మహత్య, మానసిక ఒత్తిడి నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కోచింగ్ సెంటర్ రెగ్యులేషన్స్ రూపకల్పనపై పబ్లిక్ డొమైన్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో గణేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
















