- విద్యారంగంలో సంస్కరణలతో సమూల మార్పులు
- నైపుణ్యం, కౌశలంలో 4 లక్షల మందికి శిక్షణ
- ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మహిళలు, యువతే చోదక శక్తులు
- యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరంలో లోకేష్
- దేశ సాంకేతిక పురోగతి, సామాజిక సమానత్వంపై చర్చ
దావోస్(స్విట్జర్లాండ్): నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దావోస్‌లో యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం, వరల్డ్ ఉమెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశ సాంకేతిక పురోగతి, సామాజిక సమానత్వం(విద్య, మహిళా సాధికారత, వనరుల పంపిణీ) అంశంపై జరిగిన చర్చలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీలో భవిష్యత్ అవసరాలకు తగ్గ నైపుణ్యం కలిగిన యువతను తయారుచేయడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. తద్వారా ఉద్యోగాల కల్పన, పోటీతత్వం, జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది. రాబోయే సాంకేతిక మార్పులకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవస రం ఉంది. అప్పుడే అత్యధిక జనాభా గల భారతదేశం ప్రయోజనం పొందగలుగుతుంది. భవిష్యత్ మార్పులను ముందుగానే గుర్తించి ఏపీలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు ఉపాధి, ఆవిష్కరణల ఫలితాలను లక్ష్యంగా చేసుకుని సమన్వ యంతో విద్య, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ మౌలిక వసతుల రంగాల్లో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆశయం అవకాశాన్ని కలిసే దశ నైపుణ్యాభివృద్ధే కాబట్టి మేం మొదట స్కిల్లింగ్‌తో ప్రారంభించాం.
నైపుణ్యం, కౌశలంలో 4 లక్షల మంది యువత, మహిళలకు శిక్షణ
‘నైపుణ్యం’ దేశంలోనే అత్యంత సమగ్ర ఏఐ ఆధారిత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి వేదికలలో ఒకటి. ఇది శిక్షణకే పరిమితం కాకుండా నైపుణ్యాలు, సర్టిఫికేషన్లు, నియామకాలు, పరిశ్రమల తక్షణ అవసరాలను ట్రాక్ చేస్తుంది. నిరుద్యోగ యువత కోసం ప్రారంభించిన ‘కౌశలం’ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, గ్రామీణ యువత కోసం డిమాండ్ ఆధారిత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించడం జరిగింది. తద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పన జరుగుతుంది. ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు 4 లక్షల మందికి పైగా యువత, మహిళలకు నైపుణ్య శిక్షణ అందివ్వడం జరిగింది.
విద్యారంగంలో సంస్కరణల ద్వారా సమూల మార్పులు
విద్యా సంస్కరణలు పునాది వంటివి. అందుకే మేం కేవలం సిలబస్‌లనే కాదు, నేర్చుకునే విధానాన్నే సంస్కరిస్తున్నాం. 45కు పైగా విద్యా యాప్‌లను ఒకే డిజిటల్ వేదికగా ఏకీకృతం చేసి.. ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిర్వాహకులను అనుసంధానించాం. భవిష్యత్తు నైపుణ్యాలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ, రోబోటిక్స్, స్టెమ్‌ను ప్రవేశపెడుతున్నాం. అమెరికా, యూకే, యూరప్, సింగపూర్, ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాల ద్వారా గ్లోబల్ ఎక్స్‌పోజర్‌ను నిర్మిస్తు న్నాం. ఒరాకిల్, సామ్‌సంగ్, సిస్కో, ష్నైడర్ ఎలక్ట్రిక్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ద్వారా పరిశ్రమకు అనుగుణమైన సర్టిఫికేషన్లను అందిస్తున్నాం. ఒరాకిల్ భాగస్వామ్యం ద్వారా ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు గ్లోబల్ స్టాండర్డ్ ఏఐ, క్లౌడ్, డేటా సైన్స్ విద్యను అభ్యసిస్తున్నారు.
ఏపీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్
సరైన విధానాలు, పాలన, సాంకేతిక మౌలిక వసతులు రూపొందిస్తే.. సమగ్రత, సహనశీలత, స్థిరత్వం వంటి లక్ష్యాలను సాధించ గలుగుతాం. అన్ని రంగాల్లో ఇప్పుడు నిర్ణయాలను పేపర్ వర్క్ కాదు, డేటానే నడిపిస్తోంది. రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా సమస్యలకు ప్రతిస్పందించడమే కాకుండా ముందుగానే పరిష్కరించగలుగుతున్నాం. విపత్తు నిర్వహణలో, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు ఆర్టీజీఎస్ తోడ్పాటు అందించింది. మరోవైపు నాలుగో తరం పారిశ్రామిక విప్లవం కోసం ఏపీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్‌ను ప్రారంభించడం జరిగింది. తద్వారా ఏపీ కేవలం సాంకేతికతను ఉపయోగించుకునే రాష్ట్రం గా కాకుండా సాంకేతిక విధానాలను రూపొందించే దేశాల సరసన నిలవనుంది. అభివృద్ధి వికేంద్రీకరణకు సాంకేతికత దోహదప డుతుంది. టైర్-2, టైర్-3 పట్టణాల్లో స్టార్టప్‌లను శక్తివంతం చేస్తోంది. ఏఐ సిటీ, డ్రోన్ సిటీలు సమగ్ర ఆవిష్కరణ ఎకోసిస్టమ్‌లుగా అభివృద్ధి చెందుతున్నాయి. సైబర్ భద్రత, సహనశీలత, ఎథికల్ ఏఐ.. మా పాలన రూపకల్పనల్లో నిక్షిప్తమై ఉన్నాయి. పెట్టుబడి దారుల కు ఇది దీర్ఘకాలిక స్థిరత్వం, అంచనా వేయగలిగే విధానం, సంస్థాగత పరిపక్వతను సూచిస్తుంది.
స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తోంది. వ్యాపారాలకు విధాన స్థిరత్వం, వేగం, స్పష్టత అవసరం. ప్రభుత్వం అవి అందించాలి. ప్రైవేట్ మూలధనం, నైపుణ్యాలను వినియోగించడం ద్వారా ఫలితాలు చూపే సమయాన్ని తగ్గించి నాణ్యతను మెరుగుపరుస్తున్నాం. రూ.1.16 లక్షల కోట్ల విలువైన 270 ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అతిపెద్ద పీపీపీ పైప్‌లైన్‌కు నాయకత్వం వహిస్తోంది. ఇది రాష్ట్ర పాలనా సామర్థ్యంపై పెట్టుబడిదారుల బలమైన నమ్మకానికి నిదర్శనం. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నాం.
ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మహిళలు, యువతే చోదక శక్తులు
ఆర్థిక వ్యవస్థలో మార్పు, వృద్ధికి మహిళలు, యువతే చోదక శక్తులు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషిచేస్తోంది. లీప్ ద్వారా ప్రతి ఇంట్లో ఒక మహిళా వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. జాతీయ పట్టణ జీవనోపాధి మిష న్ కింద పట్టణ పేదరికం, అస్థిరతను తగ్గించేందుకు మహిళా స్వయం సహాయక సంఘాలకు విస్తృతస్థాయిలో రుణ సహాయక వ్యవస్థను నిర్మించడం జరిగింది. ఇది ఆర్థిక స్వావలంబన, వ్యాపార వృద్ధి, జీవన భద్రతను బలోపేతం చేస్తుంది. మహిళలు, యువత కలిసి రాష్ట్ర భవిష్యత్ కార్మికశక్తిగా నిలుస్తున్నారు.
2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం
పాలనలోనూ అనేక మార్పులు తీసుకువచ్చాం. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 36 విభాగాల్లో 700కు పైగా సేవలను అందించడం జరుగుతోంది. వాట్సాప్ గవర్నెన్స్ బెస్ట్ ప్రాక్టీసెస్‌గా కేంద్ర ప్రభుత్వం సైతం గుర్తించింది. ఫిన్‌టెక్ వ్యాలీ విశాఖపట్నం.. రీజనల్ ఎకోసిస్టమ్‌ను గ్లోబల్ ఫిన్‌టెక్, డిజిటల్ మార్కెట్లతో అనుసంధానిస్తోంది. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు డీప్ టెక్, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి, సుస్థిరత దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఉమెన్ ఫౌండేషన్ సీఈవో రూపదాష్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గౌరవ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.















